Sangareddy Politics : నేనే సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిని, ప్రకటించుకున్న పట్నం మాణిక్యం
Sangareddy Politics : సంగారెడ్డి బీఆర్ఎస్ లో విభేదాలు రచ్చకెక్కాయి. అధిష్టానం టికెట్ చింతా ప్రభాకర్ కు ప్రకటించినా.. తానే బరిలో ఉన్నానని పట్నం మాణిక్యం ప్రకటించుకున్నారు.
Sangareddy Politics : సంగారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ని ప్రకటినించారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ తరఫున తానే పోటీలో ఉంటానని మరో సీనియర్ నాయకుడు, డీసీసీబీ వైస్ ఛైర్మన్ పట్నం మాణిక్యం ప్రకటించుకున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా పట్నం మాణిక్యం పెద్ద ఎత్తున సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. సంగారెడ్డి పట్టణానికి సమీపంలోని తన స్వగ్రామమైన పసల్వాది నుంచి, సంగారెడ్డికి మరో వైపు ఉన్న గోకుల్ ఫంక్షన్ హాల్ కి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లారు. వందలాది మంది తన ఫాలోయర్స్ ఈ ర్యాలీలో, పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్నం మాణిక్యం మాట్లాడుతూ...రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నానని ప్రకటించారు. మరొక పదిరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందన్న ఆయన, తాను తప్పకుండా పోటీలో ఉంటానన్నారు. ప్రజలు తనను గెలిపిస్తే వారికీ ఎప్పుడు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్, హరీష్ రావు ఆశీస్సులతో తాను పార్టీ అభ్యర్థిగా పోటీ చేయపోతున్నానని మాణిక్యం ప్రకటించడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2016లో బీఆర్ఎస్ లో చేరిన దగ్గర్నుండి, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు తనకు మంచి అవకాశాలు ఇచ్చారని మాణిక్యం అన్నారు.
ట్రెండింగ్ వార్తలు
బీఆర్ఎస్ అభ్యర్థిగా చింత ప్రభాకర్
సంగారెడ్డిలో 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన చింతా ప్రభాకర్ కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డిని ఓడించారు. 2018 ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన చింతా ప్రభాకర్... 2,000 ఓట్ల తేడాతో జగ్గారెడ్డి చేతిలో ఓడిపోయారు. అయినా అన్ని తానే అయ్యి చింతా సంగారెడ్డి నియోజకవర్గంలో పార్టీని నడిపిస్తున్నారు. చింతా ప్రభాకర్ ను అధిష్టానం జిల్లా అధ్యక్షుడిగా, తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలుగుదేశం పార్టీకి భవిషత్తు లేదని తెలిసి మాణిక్యం 2016లో బీఆర్ఎస్ లో చేరారు. నియోజకవర్గంలో చింతా ప్రభాకర్ బలమైన అభ్యర్థి అని భావించిన సీఎం కేసీఆర్ మరొసారి అవకాశం ఇచ్చి 2023 ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించారు.
పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా?
అయితే పార్టీ అధినాయకత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాణిక్యం మంత్రి హరీశ్ రావును కలిశారు. మంత్రి మద్దతు కూడా చింతా ప్రభాకర్ కే ఉండటంతో... తన పుట్టిన రోజు సందర్భంగా స్వయంగా తానే అభ్యర్థినంటూ ప్రకటించుకున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ప్రభాకర్ తో పడని కొంత మంది బీఆర్ఎస్ నేతలు మాణిక్యంకు మద్దతు తెలుపుతున్నారని సమాచారం. అధిష్టానం ఈ విషయాలను సీరియస్ గా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. సంగారెడ్డి బీఆర్ఎస్ లో విభేదాలును పరిష్కరించడానికి జిల్లా మంత్రి హరీశ్ రావును బరిలోకి దిగనున్నట్లు పార్టీ శ్రేణులు అంటున్నాయి.