Orchids Cultivation : అధిక వర్షాల సమయంలో పండ్ల తోటలను ఎలా కాపాడుకోవాలి?
Orchids Cultivation : అధిక వర్షాల కారణంగా పండ్ల తోటల రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్త సుచిత్ర తెలిపారు. పంట్ల తోటల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య చర్యలు రైతులకు వివరించారు. వర్షపు నీరును 48 గంటల కంటే ఎక్కువసేపు చెట్ల చుట్టూ నిలువకుండాచూసుకోవాలన్నారు.
Orchids Cultivation : అధిక వర్షాల కారణంగా పండ్ల తోటల పెంపకంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సంగారెడ్డిలోని ఫల కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త వి.సుచిత్ర రైతులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా పండ్ల తోటల్లో తీసుకోవలసిన సస్యరక్షణ, యజమాన్య చర్యలను వివరించారు. కొత్తగా నాటిన మొక్కలకి వెదురు కర్రలతో కట్టి గాలికి వంగిపోకుండా ఆధారం కల్పించాలన్నారు. గాలికి దెబ్బతిన్న కొమ్మలను సీకేచర్ ఉపయోగించి కత్తిరించాలి అని, కత్తిరించిన చివర్లకు COC లేదా బోర్డో మిశ్రమం పూయాలన్నారు.
48 గంటల కంటే నీరు ఎక్కువ సేపు నిల్వ ఉండకుండా చూడాలి
'సాధ్యమైనంత వరకు వర్షపు నీరును 48 గంటల కంటే ఎక్కువ సమయం చెట్ల చుట్టూ నిలువకుండాచూసుకోవాలి. నిలిచిన నీటిని కాలువలు పెట్టి తోట నుంచి బయటకి పోయే వసతికల్పించాలి. 48 గంటల లోపు నీరు తీయలేని పక్షంలో ఆక్సిజన్ కలిగిన ఎరువులు, కాల్షియం హైడ్రాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, మెగ్నెషీయం పెరాక్సైడ్ వంటి రసాయన ఎరువులు 5 గ్రా. ఒక చదరపు మీటరుకు (50 కే.జీ/హె) వేసినట్టైతే ముంపునకు గురైన మొక్కలు త్వరగా కోలుకోగలుగుతాయి. వేర్లకు ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా ఉంటుంది. చెట్టు చుట్టూ మట్టిని ఎగదోయడం వలన వేరు కుళ్ల నష్టాన్ని నివారించవచ్చు' అని సీనియర్ శాస్త్రవేత్త సుచిత్ర తెలిపారు.
వర్షం పడేటప్పుడు ఎరువులు వేయరాదు
వర్షాలు కురిసే సమయంలో ఎరువులు వేయరాదు. 1% KNO 3 లేదా 2% యూరియా ద్రావణాన్ని 2-3 సార్లు వర్షాలు తగ్గిన తర్వాత పిచికారీ చేయాలి. వర్షాలకు నత్రజని ఎరువులు తేలికగా భూమిలోపలి పొరలలోకి పోయి చెట్లకు అందుబాటులో ఉండదు. కాబట్టి వర్షాలు తగ్గిన వెంటనే యూరియా లేదా మల్టీ కె 10 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నత్రజనిని యూరియా రూపంలో కాకుండా అమ్మోనియా రూపంలో అందిస్తే ఎక్కువ నష్టం ఉండదు.
విరిగిపోయిన కొమ్మలను కత్తిరించుకొని బోర్డో పేస్ట్ ను పూయాలి. మచ్చతెగులు నివారణ కోసం తెగులు ఆశించిన కొమ్మలను, ఆకులను తీసివేసి కార్బెన్డజిం 1 గ్రా లేదా మాంకోజెబ్ 2 గ్రా పది రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. అధిక వర్షాలకు జామలో ఎండు తెగులు అధికంగా వ్యాప్తి చెందుతుంది. దీని నివారణ కోసం 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేప పిండి, 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి అనే జీవ శిలీంధ్రనాశిని కలిపి ప్రతి చెట్టుకి 30-40 కిలో లు వేయాలి. తెగులు ఆశించిన మొక్కలకు కార్బెన్డజిం లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి మూడుసార్లు పది రోజుల వ్యవధిలో మొదలు చుట్టూ నేల తడిచేటట్లు పోయాలి.
మామిడికి జల్లెడ గూడు పురుగు వస్తుంది
అధిక వర్షాలకు మామిడిలో ఆకు జల్లెడ గూడు పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మొదటిగా ఈ పురుగు గూడులను వెదురు కర్రలతో దులిపి తదుపరి లాంబ్డా సైహలోత్రిన్ 2 మి. లీ. లీటర్ నీటిలో కలిపి వర్షాలు తగ్గిన తర్వాత పిచికారీ చేయాలన్నారు. పండ్ల తోటల్లో సూచించిన విధంగా యజమాని చర్యలు పాటించి నష్టం నివారణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లాలోని పండ్లతోటలు రైతులకు సూచించారు.