PM Modi Tour : తెలంగాణలో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన, రూ. 9 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం
PM Modi Tour : తెలంగాణలో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటిస్తున్నారు. నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలో రూ. 9021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

PM Modi Tour : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సంగారెడ్డి (Sangareddy)జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేయనున్నారు. జాతీయ రహదారి 161ను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. అనంతరం సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలం పటేల్ గూడలోని ఎల్లంకి ఇంజినీరింగ్ కళాశాల వద్ద బహిరంగ సభలో పాల్గొననున్నారు. ప్రధాని రాక కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
నేషనల్ హైవే 161 జాతికి అంకితం
రూ. 1409 కోట్లతో నిర్మించబడిన నాందేడ్- అకోలా నేషనల్ హైవే 161 ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. అదే విధంగా మదీనాగూడ నుంచి సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు 4 లైన్ ల రహదారిని 6 లైన్ లుగా విస్తరించేందుకు రూ. 1298 కోట్లతో రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా రూ. 399 కోట్లతో మెదక్-ఎల్లారెడ్డి హైవే ఎన్.హెచ్ (NH) 765-D విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. పలు అభివృద్ధి పనులను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాలో రూ. 9021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
మోదీ సభకు ఏర్పాట్లు పూర్తి
ప్రధాన మోదీ(PM Modi) సభ ప్రాంగణానికి హెలికాఫ్టర్ లో చేరుకుంటారు. ఇప్పటికే భద్రత దళాలు హెలికాఫ్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. హెలిప్యాడ్ నుంచి వేదిక వరకు బీటీ రోడ్డును ఏర్పాటు చేశారు. మోదీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని పట్టణాలు, గ్రామాల నుంచి సభకు భారీగా జన సమీకరణకు బీజేపీ నాయకులు సమాయత్తం అవుతున్నారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని సంగారెడ్డి నుంచి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ(MP Seats) సీట్లకు గాను ఇప్పటికే 9 మంది అభ్యర్థులను బీజేపీ న్యాయకత్వం ఖరారు చేసింది. అందులో జహీరాబాద్ ఎంపీ సీటుకు బీబీ పాటిల్ ను ఖరారు చేయగా, మెదక్ స్థానాన్ని పెండింగ్ లో పెట్టింది.
డ్రోన్ లను ఎగురవేసినట్లైతే కఠిన చర్యలు
ప్రధానమంత్రి జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా సుమారు 2 వేల మందితో కట్టుదిట్టమైన, మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా రెండు రోజులు రిమోట్ కంట్రోల్ డ్రోన్ లను నిషేధిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. ప్రధాని భద్రత దృష్ట్యా సభా స్థలానికి 5 కిలో మీటర్ల దూరం వరకు నో ఫ్లై (No Fly) జోన్ గా నిర్ణయించామన్నారు. ఎవరైనా డ్రోన్(Drones) లను ఎగురవేసినట్లైతే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పటాన్ చెరు ఎల్లంకి కళాశాల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలానికి చేరుకునే వాహన దారులు ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions) పాటించవలసి ఉంటుందని తెలిపారు. బెంగళూరులో పేలుడు కారణంగా ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
సంబంధిత కథనం