Sangareddy News : ఎన్నికల్లో ఓడినా ప్రచారంలో ఇచ్చిన హామీ నెరవేర్చిన జగ్గారెడ్డి-sangareddy news in telugu congress leader jagga reddy fulfilled election campaign promises ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Sangareddy News In Telugu Congress Leader Jagga Reddy Fulfilled Election Campaign Promises

Sangareddy News : ఎన్నికల్లో ఓడినా ప్రచారంలో ఇచ్చిన హామీ నెరవేర్చిన జగ్గారెడ్డి

HT Telugu Desk HT Telugu
Dec 05, 2023 09:26 PM IST

Sangareddy News : ఎన్నికల ప్రచారంలో ఓ కుటుంబానికి ఇచ్చిన హామీని జగ్గారెడ్డి నెరవేర్చారు. జగ్గారెడ్డి భార్య, కుమారుడు... ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.

ఆర్థిక సాయం అందిస్తున్న జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు
ఆర్థిక సాయం అందిస్తున్న జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు

Sangareddy News : తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన జగ్గారెడ్డి, సంగారెడ్డి నియోజకవర్గంలో తన ఎన్నికల ప్రచార సమయంలో ఓ కుటుంబానికి ఇచ్చిన హామీని ఈ రోజు నెరవేర్చారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని నిజాంపూర్ గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు కరెంటు షాక్ తగిలి తన రెండు కాళ్లు కదపలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. ఎన్నికల ప్రచార సమయంలో నిజాంపూర్ గ్రామానికి వచ్చిన జగ్గారెడ్డి రాజు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ కష్టాలు తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో డబ్బులు ఇస్తే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినట్టు అవుతుందని, ఎన్నికల తర్వాత తప్పకుండా ఆ కుటుంబానికి సహాయం చేస్తానని మాటిచ్చారు. జగ్గారెడ్డి చెప్పిన్నట్లే ఎన్నికల తర్వాత ఈ రోజు తన కుటుంబ సభ్యులు అయిన జగ్గారెడ్డి భార్య నిర్మలా రెడ్డి, అతని కుమారుడు భరత్ సాయిరెడ్డి రాజు ఇంటికి వెళ్లి అతని కుటుంబానికి లక్ష యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.

ట్రెండింగ్ వార్తలు

రూ. 1,50,000 సాయం

నిజాంపూర్ గ్రామానికి చెందిన రాజుకు మూడు సంవత్సరాల కిందట సొంత ఇల్లు కట్టుకునే సమయంలో కరెంట్ షాక్ తగిలి రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స కోసం, ఆ సమయంలో 15 లక్షలు అప్పులు చేసినట్లు రాజు భార్య తెలిపారు. రాజు రెండు కాళ్లు కోల్పోవడం వలన ఏ పని కూడా చేయలేని స్థితిలో ఉన్నాడు. దీంతో అతని భార్య కుట్టు మెషిన్ కుట్టుకుంటూ భర్తని, తమ ఒక్కగానొక్క కూతురును పోషించుకుంటూ వస్తుంది. ఐతే కుట్టు మెషిన్ తో వచ్చిన డబ్బులు వారు చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికే సరిపోతున్నాయని ఆమె ఆవేదనను వ్యక్తం చేశారు. అప్పుడు జగ్గారెడ్డి కుట్టు మిషన్ కుట్టుకుంటూ, ఇంట్లోనే చీరల వ్యాపారం చేసుకోవడానికి రూ.1,50,000 ఆర్థిక సహాయం చేస్తానని అన్నారు. అలాగే వారికీ ఉన్న అప్పు కూడా తానే కట్టేస్తానని, ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ రోజు తాను ఇచ్చిన హామీ నెరవేర్చారు. రాజు కుటుంబానికి అయినా అప్పును కూడా జగ్గారెడ్డి త్వరలో తీరుస్తామని నిర్మల అన్నారు.

ఈ సందర్భంగా అతని భార్య నిర్మలా రెడ్డి మాట్లాడుతూ జగ్గారెడ్డి ఎప్పుడు కష్టాల్లో ఉన్న మనిషికి సహాయం చేయడానికి ఇష్టపడతారని అన్నారు. రాజుకి అప్పు ఇచ్చినవారు ఎవ్వరు కూడా తనను ఇబ్బంది పెట్టవద్దని నిర్మల కోరారు. రాజు కుటుంబానికి ముందుముందు కూడా జగ్గా రెడ్డి అండగా ఉంటారని ఆమె తెలిపారు.

రిపోర్టింగ్ : హెచ్.టి తెలుగు ప్రతినిధి, సంగారెడ్డి

WhatsApp channel