Gurukuala School Student : గురుకుల హాస్టల్ పై నుంచి పడిపోయిన పదో తరగతి విద్యార్థిని, విచారణకు ఆదేశించిన కలెక్టర్
Gurukuala School Student : సంగారెడ్డి జిల్లా అల్లాపూర్ లోని గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థిని హాస్టల్ పై నుంచి పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? ఎవరైనా తోసేశారా? అని సిబ్బంది ఆరా తీస్తున్నారు.

Gurukuala School Student : గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని వసతి గృహం రెండో అంతస్తు పై నుంచి కింద పడిపోవడం సంచలనం రేకిత్తించింది. రెండు అంతస్తులపై నుండి పడిపోవడంతో ఆమెకు కాలు విరగడంతో పాటు వెన్నెముఖకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం అల్లాపూర్ లో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన గురుకుల పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. అక్కడి విద్యార్థులు, గ్రామస్థుల కథనం ప్రకారం రాయికోడ్ మండలం యూసుఫ్ పూర్ గ్రామానికి చెందిన బేగరి కుమార్ కూతురు మల్లీశ్వరి (15) అల్లాపూర్ శివారులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతూ, హాస్టల్ లో ఉంటుంది.
ఈ క్రమంలో సోమవారం ఉదయం తోటి విద్యార్థినితో కలిసి హాస్టల్ రెండో అంతస్తులోకి వెళ్లింది. కాగా తనతో పాటు వచ్చిన విద్యార్థిని రూంలోకి వెళ్లింది. దీంతో మల్లీశ్వరి రెండో అంతస్తు నుంచి ఒక్కసారిగా పడడంతో కాళ్లకు, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. గురుకుల సిబ్బంది వెంటనే బాలికను చికిత్స నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు కుడి కాలు విరిగిందని, వెన్నెముకకు తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. అక్కడి నుంచి బాలికను మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తరువాత సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, బాలిక వెన్నెముకకు శస్త్ర చికిత్స అవసరమని డాక్టర్లు తెలిపారు. పై అధికారుల ఆదేశాల ప్రకారం బాలికను హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఎవరో తోశారని ఆరోపణ
విద్యార్థి మల్లేశ్వరి తనను ఎవరో కిందికి తోశారని ఆరోపించింది. మరో విద్యార్థిని తోడుగా హాస్టల్ బిల్డింగ్ పైకి రమ్మంటే వెళ్లానని, తాను రూంకి వెళ్లగా తాను అక్కడే నిలబడి కిందికి చూస్తుండగా తనను పై నుంచి ఎవరో తోసేయడంతో కింద పడిపోయానని మల్లీశ్వరి చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఎవరైనా తోసేశారా, ప్రమాదవశాత్తు పడిపోయిందా అన్న కోణంలో గురుకుల సిబ్బంది విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థినిని పరామర్శించారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని, బాలికను ఎవరూ కిందకు తోశారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాలిక మానసిక స్థితి బాగాలేదని
బాలిక మానసిక స్థితి బాగాలేదని, మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లాలని గతంలో తల్లిదండ్రులకు తెలిపినట్లు ప్రిన్సిపాల్ మాన్విందర్ తెలిపారు. విద్యార్థులంతా కింద ఉంటే తాను ఒక్కతే పైకి ఎక్కిందని తెలిపారు. కాగా అనార్యోగం కారణంగా మల్లీశ్వరి జూన్ 22 పాఠశాలకు వచ్చిందని, గ్రామా పెద్దలు చెప్పడం వల్లనే లోనికి అనుమతించామని ప్రిన్సిపాల్ చెప్పారు. ఈ సంఘటన పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. విద్యార్థిని భవనంపై నుంచి పడడానికి గల కారణాలు పూర్తిస్థాయిలో విచారణ జరపాలని సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ ను ఆదేశించినట్లు కలెక్టర్ క్రాంతి తెలిపారు.
సంబంధిత కథనం