Sangareddy News : ఆ దంపతుల ఐదుగురు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులే
Sangareddy News : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం రావడమంటే అదో గొప్ప విషయం. ఎంతో కష్టపడితే గానీ ప్రభుత్వ ఉద్యోగం సాధించలేరు. అలాంటిది ఒకే కుటుంబంలో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.
ప్రభుత్వ ఉద్యోగం సాధించటమనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కల. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో కుటుంబంలో ఎవ్వరైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటేనే ఎంతో కష్టపడాలి. అలాంటిది ఆ ఇంట్లో ఉన్న ఐదుగురు పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు రావటం అనేది చాలా గొప్ప విషయం. సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ గ్రామానికి చెందిన ఓ పోస్టల్ ఉద్యోగి నలుగురు కూతుర్లు, ఒక కొడుకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి గ్రామానికే ఆదర్శంగా నిలిచారు. దీంతో ఆ తల్లిదండ్రులు సంతోషం అంబరాన్ని అంటింది.
చిన్నప్పటి నుంచి చదువులో ఎప్పుడు ముందే
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రానికి చెందిన పులిర్గమ రాఘవరెడ్డి, శోభమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. వారిలో నలుగురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. రాఘవరెడ్డి పోస్ట్ మాస్టర్ గా పనిచేసి, ఇటీవలే ఉద్యోగ విరమణ పొందారు. ఈ దంపతులు ఉద్యోగంతో పాటు వ్యవసాయాన్ని కూడా చేసుకుంటూ ఎంతో కష్టపడి ఐదుగురు పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. వారు చదువులో ఎల్లప్పుడూ ముందుండేవారు. తల్లితండ్రుల కష్టాన్ని గుర్తించి ఎంతో శ్రద్ధగా చదివి ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.
ముగ్గురు టీచర్లు, ఇద్దరు పంచాయతీ సెక్రటరీలు
రాఘవరెడ్డి పెద్ద కూతురు కవిత 2012 డీఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించి, మూసాపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. రెండో కూతురు కల్పన, మూడో కూతురు వీరమణి 2024 డీఎస్సీ లో టీచర్ పోస్టులు కైవశం చేసుకున్నారు. కాగా కల్పన ఝరాసంగం ఎంపీపీఎస్ పాఠశాలలో తెలుగు పండిత్ గా విధులు నిర్వర్తిస్తుండగా, వీరమణి ఝరాసంగం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అలాగే చిన్న కూతురు జ్యోతి రాణి, అందరికంటే చిన్నవాడైన కొడుకు కృష్ణ ప్రతాప్ రెడ్డి కొన్నేళ్ల క్రితం పంచాయితీ సెక్రటరీగా ఉద్యోగాలు సాధించారు. వీరిద్దరూ ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్నారు.
పెళ్లి తర్వాతే నలుగురు కూతుర్లు ఉద్యోగాలు సాధించారు
రాఘవరెడ్డి దంపతుల నలుగురు కూతుర్లకు వివాహాలు కాగా కొడుకుకు ఇంకా వివాహం కాలేదు. అంతేకాకుండా పెద్ద కూతురు కవిత భర్త కూడా ప్రభుత్వ ఉపాద్యాయుడు కావడం విశేషం. కుటుంబం మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో గ్రామస్తులంతా వారిని అభినందిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు సంబరపడిపోతున్నారు. ఎవరైనా ఆడపిల్లల తల్లితండ్రులు భయపడకుండా మగ పిల్లలతో సమానంగా వారిని బాగా చదివించి ప్రయోజకుల్ని చేయాలనీ రాఘవరెడ్డి పోత్సహిస్తున్నారు. ఆ కుటుంబం, గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించే వారికీ పెద్ద ప్రేరణగా నిలుస్తున్నారు. ఆడ పిల్లలు నలుగురు కూడా పెళ్లి చేసుకున్న తర్వాతనే ఉద్యోగాలు సాధించారని, పెళ్లి చదువు ఉద్యోగం సాధించడానికి ఎంత మాత్రం అడ్డంకి కాదని నిరూపించారన్నారు రాఘవ రెడ్డి. వారి వారి భర్తల సహకారం కూడా మరవ లేదని అయన గుర్తుచేశారు.
సంబంధిత కథనం