Ex Mlc Satyanarayana : మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ కన్నుమూత-సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం
Ex Mlc Satyanarayana : మాజీ ఎమ్మెల్సీ, సీరియర్ జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ ఆదివారం సంగారెడ్డిలో తుదిశ్వాస విడిచారు. సత్యనారాయణ మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.
Ex Mlc Satyanarayana : తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ (60) ఆదివారం తన నివాసంలో తుది శ్వాస విడిచారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ, తన నివాసంలోనే ఈరోజు మరణించారని కుటుంబసభ్యులు తెలిపారు. మెదక్ జిల్లాకు చెందిన సత్యనారాయణ, డిగ్రీ చదువుతున్న సమయం 1980లో జర్నలిస్ట్ గా తన జీవితనాన్ని ప్రారంభించారు. సుమారుగా 25 సంవత్సరాలు జర్నలిస్ట్ గా పనిచేస్తూ, జిల్లాలో ఎన్నో సమస్యలను లేవనెత్తడంలో, వాటికీ పరిష్కరాల కోసం తనవంతు ప్రయత్నం చేశారు. తన జీవిత కాలంలో ఎంతో మంది యువ జర్నలిస్ట్ లను తయారుచేశారు.

తెలంగాణ కోసం పదవికి రాజీనామా
2001లో మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించిన తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడై బీఆర్ఎస్ పార్టీ లో చేరిన సత్యనారాయణ, ఆ పార్టీ ఉమ్మడి జిల్లా అధక్షుడిగా పని చేసి పార్టీ పటిష్టత కోసం తీవ్ర కృషి చేశారు. 2007 ఎన్నికల్లో పోటీ చేసి, ఎమ్మెల్సీగా కూడా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం కోసం, తన పదవిని కూడా తృణప్రాయంగా త్యజించారు. సంగారెడ్డి కేంద్రంగా, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన సత్యనారాయణ, రాష్ట్ర సాధన తరవాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబెర్ పని చేసిన అనుభవం ఉంది.
ముఖ్యమంత్రి సంతాపం
సత్యనారాయణ మరణ వార్త తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జర్నలిస్టుగా, ఎమ్మెల్సీగా, ఉద్యమకారునిగా ఆయన చేసిన సేవలను కొనియాడుతూ, తెలంగాణ రాష్ట్రం, సత్యనారాయణ సేవలను ఎన్నటికి మరచిపోదని అన్నారు. మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు, కాంగ్రెస్ నాయకులు కూడా సత్యనారాయణ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఒక నిజమైన ఉద్యమకారుడిని కోల్పోయింది
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో సత్యనారాయణ చేసిన కృషిని, వారితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. సీనియర్ జర్నలిస్టుగా, ఉద్యమకారునిగా వారు అందించిన సేవలు, బీఆర్ఎస్ పార్టీ కోసం చేసిన కృషి గొప్పవన్నారు. సత్యనారాయణ మృతితో తెలంగాణ ఒక నిఖార్సయిన ఉద్యమకారున్ని కోల్పోయిందన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
అంత్యక్రియల్లో పాల్గొననున్న హరీష్ రావు
"తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ గారి మృతి బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జర్నలిస్టుగా, పట్టభద్రుల ఎమ్మెల్సీగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా తనదైన ముద్ర వేశారు. బీఆర్ఎస్ పార్టీకి వారి సేవలు చిరస్మరణీయం" అని మాజీ మంత్రి హరీష్ రావు కొనియాడారు. సంగారెడ్డిలో ఆదివారం మధ్యాహ్నం సత్యనారాయణ అంత్యక్రియలు జరగన్నాయి. ఈ అంత్యక్రియల్లో, మాజీ మంత్రి హరీష్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఇతర నాయకులు, అధికారులు పాల్గొననున్నారు.