Sangareddy Crime : తాగొచ్చి తల్లిని కొడుతున్నాడని, తండ్రిని హత్య చేసిన కొడుకు-sangareddy crime news in telugu son murdered drunk father beating mother every day ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy Crime : తాగొచ్చి తల్లిని కొడుతున్నాడని, తండ్రిని హత్య చేసిన కొడుకు

Sangareddy Crime : తాగొచ్చి తల్లిని కొడుతున్నాడని, తండ్రిని హత్య చేసిన కొడుకు

HT Telugu Desk HT Telugu
Published Feb 05, 2024 02:51 PM IST

Sangareddy Crime : నిత్యం మద్యం తాగివచ్చి భార్య వేధిస్తున్న ఓ వ్యక్తి కొడుకు చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

తండ్రిని హత్య చేసిన కొడుకు
తండ్రిని హత్య చేసిన కొడుకు

Sangareddy Crime : మద్యం మహమ్మారి రోజు ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంటుంది. మద్యం మత్తులో కన్ను మిన్ను ఎరుగక, కట్టుకున్న భార్యను ప్రతిరోజు హింసిస్తున్న ఒక వ్యక్తి , తన కన్న కొడుకు చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ సంఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో చోటుచేసుకుంది. తండ్రి ప్రతిరోజు మద్యం తాగి వచ్చి తల్లిని కొడుతున్నాడనే క్షణికావేశంలో కొడుకు తండ్రి తలపై కర్రతో బలంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం రాంరెడ్డిబావి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాంరెడ్డిబావి గ్రామానికి చెందిన కొంచెం కృష్ణా రెడ్డి (48) ప్రతిరోజు మద్యం తాగివచ్చి కుటుంబసభ్యులతో గొడవపడటం, భార్యపై చేయి చేసుకోవడం చేస్తుండేవాడు. తన కుమారుడు, ఇరుగుపొరుగు వారు ఎంతచెప్పినా వినిపించుకునేవాడు కాదు . ఇలాగే నిత్యం తాగి వస్తూ, ఏ పని చేయకుండా తిరుగుతూ కుటుంబాన్ని కూడా పట్టించుకునేవాడు కాదు.

తలపై బలంగా కొట్టడంతో

ఈ క్రమంలో, రోజు మాదిరిగానే శనివారం రాత్రి కూడా కృష్ణారెడ్డి మద్యం తాగి వచ్చి భార్యను కొట్టడంతో పాటు, గొడవ పడుతున్నాడు . అప్పటికే నిద్రిస్తున్న తన కుమారుడు రఘుపతిరెడ్డి ఈ గొడవ విని నిద్రలోంచి లేచి వచ్చాడు. అతడు తన తండ్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినా తన తండ్రి కృష్ణా రెడ్డి వినిపించుకోలేదు. దీంతో రఘుపతి రెడ్డి ఆగ్రహానికి గురై ఇంట్లో ఉన్న కర్రతో తండ్రి తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై కృష్ణా రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో కుమారుడు రఘుపతి రెడ్డి గుమ్మడిదల పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. గ్రామస్థుల నుంచి విషయం తెలుసుకున్న గుమ్మడిదల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పఠాన్ చేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు పోలీసులు చేస్తున్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడలో ఆదివారం జరిగింది. అమీన్ పూర్ పురపాలక పరిధిలోని భవానీపురం కాలనీలో నివాసముంటున్న మహ్మద్ అమీర్ (26) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడు ప్రతిరోజు మాదిరిగే ఆదివారం ఉదయం బైక్ పై డ్యూటీకి బయలుదేరాడు. ఈ క్రమంలో అమీర్ బీరంగూడ కమాన్ వద్ద టర్న్ తీసుకుంటుండగా పటాన్ చెరు నుంచి లింగంపల్లి వైపు వేగంగా వెళ్ల్తున్న కారు ఢీకొట్టింది. దీంతో అతని హెల్మెట్ పగిలి ఇనుప ముక్కలు తలకు గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే అమీర్ ను పక్కనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడి డాక్టర్ లు ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం కిమ్స్ ఆసుపత్రికి పంపారు. అక్కడ చికిత్స పొందుతూ అమీర్ మృతిచెందాడు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

(హిందూస్థాన్ టైమ్స్ తెలుగు రిపోర్టర్, సంగారెడ్డి)

Whats_app_banner

సంబంధిత కథనం