Sangareddy Crime : ఒంటరి మహిళలే ఆ స్వామీజీ టార్గెట్, పూజల పేరుతో బంగారం చోరీ ఆపై ఘోరం
Sangareddy Crime : పూజలు చేస్తే మంచి జరుగుతుందని నమ్మించి సంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళను హత్య చేశాడో దొంగ స్వామీజీ. ఈ నకిలీ స్వామి ఒంటరి మహిళలను టార్గెట్ చేసి, మాయమాటలతో నమ్మించి వారి వద్ద బంగారం చోరీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Sangareddy Crime : సంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పూజలు చేస్తానని చెప్పి నమ్మించి మహిళను హత్య చేసి బంగారు ఆభరణాలను(Gold Robbery) చోరీ చేశారు. ఈ కేసును ఛేదించిన పోలీసులు దొంగ స్వామీజీని(Fake Baba) అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుమ్మడిదల మండలం వీరన్నగూడెం గ్రామానికి చెందిన బుచ్చమ్మ (58) గ్రామంలో వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో పూజ సామాగ్రి దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తుంది. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీపేట్ మండలం వెంకిర్యాల గ్రామానికి చెందిన నర్సింగ్ రావు ఆలయాల వద్ద బొట్టు పెట్టుకొని స్వామిజీగా చెప్పుకొని తిరుగుతుంటాడు. అతడు గుమ్మడిదల వీరభద్రస్వామి ఆలయానికి వచ్చి శివ స్వామీజీగా చెప్పి ఒంటరి మహిళ అయిన బుచ్చమ్మతో పరిచయం చేసుకొన్నాడు. ఆమెకు మాయమాటలు చెప్పి తాను పూజలు చేస్తే అంతా మంచి జరుగుతుందని చెప్పి నమ్మించాడు. దీంతో ఫిబ్రవరి 13 న ఆమెను సికింద్రాబాద్ తీసుకొని వెళ్లి పూజ సామాగ్రి కొనుగోలు చేశారు. అనంతరం ఘట్కేసర్ పరిధిలోని మాదారం శివారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి పూజలు ప్రారంభించాడు. పూజలో భాగంగా ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును తీసి పూజలో పెట్టాలని చెప్పగా ఆమె నిరాకరించింది.
తలపై బండరాయితో కొట్టడంతో
దీంతో బలవంతంగా గొలుసు తీసే ప్రయత్నం చేయగా ఆమె అడ్డుకోవడంతో బుచ్చమ్మను కిందపడేసి బండరాయితో తలపై కొట్టి దారుణంగా హత్య(Woman Murder) చేశాడు. చనిపోయినట్లు నిర్ధారించుకున్నాక ఆభరణాలను తీసుకొని పారిపోయాడు. గతంలో బుచ్చమ్మ అదృశ్యమైనట్లుగా కేసు నమోదు చేసుకున్న గుమ్మడిదల పోలీసులు వీరన్నగూడెం సీసీ కెమెరాల(CC Cameras) ఆధారంగా విచారణ చేపట్టారు. శనివారం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుడు ఒంటరి మహిళలను టార్గెట్ చేసి, వారి వద్ద బంగారు ఆభరణాలు చోరీ చేసేవాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై హన్మకొండ, ముషీరాబాద్(Musheerabad PS) పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసులు ఉన్నాయన్నారు. కేసు ఛేదించిన పోలీసులను సీఐ అభినందించారు. ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నకలీ పూజారులు, దొంగ స్వామీజీలను నమ్మవద్దని, మీకు అపరిచిత వ్యక్తుల పట్ల అనుమానం వస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని సీఐ తెలిపారు.
ఆభరణాలు కొట్టేసిన మహిళ అరెస్ట్
బస్సులో ప్రయాణికురాలి హ్యాండ్ బ్యాగ్ లో నుంచి బంగారు ఆభరణాలు కొట్టేసి తప్పించుకొని తిరుగుతున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ కు చెందిన గంగొని గౌతమీ ఈ నెల 13న తోడికోడలు మధురితో కలిసి హైదరాబాద్(Hyderabad) లో పెళ్లికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో నిజామాబాద్ వెళ్లాడానికి బస్సు దొరకలేదు. దీంతో మరో బస్సు ఎక్కి మెదక్ జిల్లా రామాయంపేటలో దిగారు. అక్కడ నిజామాబాద్(Nizamabad) వెళ్లే బస్సు ఎక్కారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత తన హ్యాండ్ బ్యాగ్ లో బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఆమె వెంటనే రామాయంపేట పోలీస్ స్టేషన్ లో నగలు(Gold ornaments Robbery) చోరీకి గురైనట్లు పోలీసులకు పిర్యాదు చేసింది. రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దీంతో శనివారం రామాయంపేట బైపాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఓ బస్సు లో నుంచి మహిళ హ్యాండ్ బ్యాగ్ వేసుకొని దిగింది. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న హైదరాబాద్ కు చెందిన ఠాగూర్ శారదను పట్టుకొని విచారించడంతో విషయం వెలుగుచూసింది. ఆమె వద్దనున్న బ్యాగ్ ను మహిళా కానిస్టేబుళ్లు చెక్ చేయగా అందులో రామాయంపేట బస్టాండ్ లో చోరీకి గురైన 10 తులాల బంగారు ఆభరణాలు కనిపించాయి. ఆమె వద్ద నుంచి ఆభరణాలు స్వాధీనం చేసుకొని ఆమెను రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఆమెపై ఇప్పటికే హైదరాబాద్, బేగంపేట్ ఠాణాల్లో కేసులు నమోదు కావటంతో పాటు జైలుకు వెళ్లి వచ్చినట్లు డీఎస్పీ తెలిపారు.
రిపోర్టింగ్ : హెట్.టి.తెలుగు కరస్పాండెంట్, మెదక్
సంబంధిత కథనం