CPM on Budget : కేంద్ర బడ్జెట్ బడా కార్పొరేట్ల కోసమే, తెలంగాణకు తీవ్ర అన్యాయం- సీపీఎం
CPM on Budget : బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని సీపీఎం నేత చుక్కా రాములు విమర్శించారు. ఇద్దరు కేంద్రమంత్రులతో సహా 8 మంది బీజేపీ ఎంపీలున్నా రాష్ట్రానికి నిధులు రాబట్టలేకపోయారని విమర్శలు చేశారు
CPM on Budget : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను కాపాడేందుకు ఉపయోగపడుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు విమర్శించారు. బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు . ఆదివారం సంగారెడ్డి పట్టణంలో జరిగిన నిరసన, దిష్టి బొమ్మ దగ్ధం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బడ్జెట్ బడా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడే విధంగా ఉందని చుక్కా రాములు విమర్శించారు.
సామాన్య ప్రజలకు నేరుగా లబ్ది కల్పించేందుకు ఎలాంటి చర్యలు లేవని అన్నారు. వేతన జీవులను పెద్దఎత్తున సంతృప్తి పరుస్తామంటూ గొప్పలు చెప్పి ముష్టి వేసినట్టు ఊరట కల్పించారని విమర్శలు చేశారు. దేశ ప్రజల బడ్జెట్ అంటూ ప్రధాని మోదీ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలున్నా రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టలేక పోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన హామీలను గాలికొదిలేశారని పేర్కొన్నారు.
తెలంగాణకు అన్యాయం
రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుకు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐఐఎం, హైస్పీడ్ రైల్వే ట్రాక్‌లకు నిధుల ఊసే లేదని విమర్శించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయించారని తెలిపారు.
ఎరువుల సబ్సిడీ నిధుల్లో కోత
రూ.50,65,345 కోట్లతో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో రూ.12,76,338 కోట్లు, అంటే 25.2 శాతం వడ్డీల చెల్లింపునకే కేటాయించారని సీపీఎం నేత జాన్‌వెస్లీ వివరించారు. వ్యవసాయ రంగానికి గతం కన్నా రూ.10 వేల కోట్లు తగ్గించారని తెలిపారు. ఎరువుల సబ్సిడీకి రూ.11 వేల కోట్లు కోత విధించారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ దేశంలో రూ.25 కోట్ల మందిని దారిద్య్రరేఖకు ఎగువకు తెచ్చామని చెప్తూనే 2029 వరకు 80 కోట్ల మందికి ఐదు కిలోల చొప్పున రేషన్ షాపుల ద్వారా ఉచిత బియ్యం పంపిణీ చేస్తామన్నారని గుర్తు చేశారు.
ఉపాధి హామీకి నిధులేవీ
ఉపాధి హామీ చట్టానికి 2023-24లో రూ.89,154 కోట్లు ఖర్చు చేయగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.86 వేల కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. దళిత, గిరిజనులకు బడ్జెట్, సబ్‌ప్లాన్ కింద చేసిన కేటాయింపులు ఆ వర్గాల అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడడం లేదని పేర్కొన్నారు. ఈ వర్గాలకు కేటాయించిన నిధులను నోడల్ ఆఫీసర్ ద్వారా ఆవాసాలు, రహదారులు, తాగునీరు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తే ఆ వర్గాల్లో కొంతమేరకైనా అభివృద్ధి జరుగుతుందని వివరించారు. దళితులకు 16 శాతం కేటాయించాల్సి ఉండగా, ఐదు శాతం నిధులు మాత్రమే కేటాయించారని విమర్శించారు. గిరిజనులకు ఏడు శాతం నిధులు కేటాయింపునకు బదులు రెండు శాతం కేటాయించారని తెలిపారు.
విద్య, వైద్య రంగాలకు అంతంత మాత్రమే
విద్య, వైద్య రంగాలకు చాలా స్వల్పంగా కేటాయింపులు మూడు శాతంలోపే కేటాయింపులున్నాయని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగం ఉత్పత్తికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కార్పొరేట్లకు పన్ను రాయితీలు, బ్యాంకుల అప్పుల ఎగవేతకు అవకాశం కల్పిస్తూ తయారుచేసిన ఈ బడ్జెట్‌ను పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధికి అనుకూలంగా తీర్చిదిద్దాలని కోరారు. వలసలను, ఆత్మహత్యలను నిరోధించే విధంగా బడ్జెట్‌ను రూపొందించాలని తెలిపారు.