CPM Maha Sabhalu : హిందుత్వ, కార్పొరేట్ బీజేపీకి ఆ రెండు స్థంభాల్లాంటివి- ప్రకాష్ కారత్
CPM Maha Sabhalu : బీజేపీ హిందుత్వ, కార్పొరేట్ అనే రెండు స్థంభాల మీద ఆధారపడి మనుగడ సాగిస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్ అన్నారు. సరళీకరణ ఆర్థిక విధానాలు, సామాజిక అణచివేత, కుల వివక్ష పైన ఒక్కటై పోరాడాలని సూచించారు.
CPM Maha Sabhalu : హిందుత్వ సిద్ధాంతం, కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడటమనే రెండు స్థంభాల మీద ఆధారపడి బీజేపీ మనుగడ సాగిస్తోందని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు, ఆ పార్టీ సమన్వయకర్త ప్రకాష్ కారత్ వ్యాఖ్యానించారు. విశాల ప్రజా ఉద్యమాల ద్వారా వాటిని తిప్పికొట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. వీటితోపాటు సరళీకరణ ఆర్థిక విధానాలు, సామాజిక అణచివేత, కుల వివక్ష పైన ఒక్కటై పోరాడాలని ఆయన పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

వామపక్షాలు ఐక్యం కావాలి
స్వతంత్ర బలాన్ని పెంచుకోవటంతోపాటు వామపక్షాలన్ని ఐక్యత కోసం కృషి చేయాలని ప్రకాష్ కారత్ సూచించారు. సంగారెడ్డి పట్టణంలో కొనసాగుతున్న సీపీఐ (ఎం) నాలుగో రాష్ట్ర మహాసభలు ఆదివారం నాటికి రెండో రోజుకు చేరాయి. మహాసభల్లో పాల్గొన్న ప్రకాష్ కారత్ మాట్లాడుతూ...జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులను సోదాహరణంగా వివరించారు. గత మూడేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో పలు మార్పులు సంభవించాయని తెలిపారు.
అమెరికా ఇజ్రాయిల్ కు మద్దతుగా
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, పాలస్తీనాపై ఇజ్రాయిల్ యుద్ధాలను ప్రస్తావించారు. ఇతర దేశాలు, ప్రజలందరూ శాంతిని కోరుకుంటున్న ప్రస్తుత తరుణంలో అమెరికా మాత్రం ఇజ్రాయిల్ కు మద్దతుగా నిలిచిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కూడా ఇజ్రాయిల్ కు మద్దతునివ్వటం శోచనీయమని అన్నారు. ఇప్పుడు అమెరికాలో అధికారాన్ని చేపట్టిన ట్రంప్ 'అమెరికా ఫస్ట్' అనే నినాదాన్ని ఇవ్వటం ద్వారా ఆర్థికంగా, రాజకీయంగా, వాణిజ్యపరంగా ఇతర దేశాలపై ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
వామపక్షాలు తిరిగి వస్తున్నాయి
పలు దేశాల్లో మితవాద శక్తులు అధికారంలోకి వస్తున్న క్రమంలోనే శ్రీలంకలో అనూర కుమార దిసనాయకే అధికారంలో వచ్చారని తెలిపారు. బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్, మెక్సికోల్లో సైతం వామపక్ష శక్తులు అధికారంలోకి వచ్చాయని గుర్తు చేశారు. ఇదే సమయంలో అమెరికాకు సాగిలబడుతున్న మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం ఆ దేశానికి అనుకూలంగా ఉంటోందని విమర్శించారు.
63 సీట్లు తక్కువగా వచ్చినప్పటికీ మిత్రుల సహకారంతో మోదీ మూడోసారి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని కారత్ ఈ సందర్భంగా వివరించారు. అయినప్పటికీ బీజేపీ హిందుత్వ ఎజెండాలో ఎలాంటి మార్పు లేదన్నారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న ప్రస్తుత తరుణంలో...రాజ్యాంగంలోని ప్రజాస్వామ్క లౌకిక, సమాఖ్య విలువలకు మోదీ సర్కారు తిలోదకాలిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చుక్కా రాములు మాట్లాడుతూ సీపీఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయటానికి పారిశ్రామిక కార్మిక వర్గం గత 2నెలలుగా మా వెన్నుతట్టి అన్ని రకాలుగా అండదండలు అందజేశారన్నారు. అసంఘటిత కార్మికులు, స్కీం వర్కర్లు, వ్యవసాయ కూలీలు, రైతులు, పేదలు పీడిత వర్గం అంతా ఎర్రజెండా కోసం మేము ఉన్నామని సహకారం అందించటం స్ఫూర్తిదాయకం అన్నారు.