Sangareddy News : పట్నం మాణిక్యం ప్రకటనపై బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్, ప్రగతి భవన్ కు పిలిచి క్లాస్!
Sangareddy News : వచ్చే ఎన్నికల్లో తానే బీఆర్ఎస్ అభ్యర్థినని ప్రకటించుకున్న పట్నం మాణిక్యంపై అధిష్టానం సీరియస్ అయింది. ప్రగతి భవన్ కు పిలిచి హెచ్చరించింది.
Sangareddy News : బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు డీసీసీబీ వైస్ ఛైర్మన్ పట్నం మాణిక్యంపై అధినాయకత్వం సీరియస్ అయింది. సీఎం కేసీఆర్.. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను సంగారెడ్డి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ, నిన్న తన పుట్టినరోజు వేడుకల్లో పట్నం మాణిక్యం.. సంగారెడ్డి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ తానే బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉంటానని ప్రకటించుకున్నారు. పట్నం వ్యాఖ్యలను అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. పుట్టినరోజు మరునాడే మాణిక్యంకు ప్రగతి భవన్ నుంచి పిలుపువచ్చింది. మంత్రి హరీశ్ రావు మాణిక్యంతో మాట్లాడి తీవ్రంగా హెచ్చరించినట్టు తెలుస్తోంది. మంత్రి సుమారుగా గంటసేపు మాణిక్యంతో మాట్లాడినట్టు సమాచారం. ఎన్నికల ముందు పార్టీని బలహీన పరిచే విధంగా ఎవరు ప్రవర్తించినా సహించేది లేదని హరీశ్ రావు తేల్చి చెప్పినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
తానే అభ్యర్థినని ప్రకటించుకున్న పట్నం
అందరూ కలిసికట్టుగా చింతా ప్రభాకర్ విజయం కోసం పనిచేయాలని కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేసే వరకు అందరూ కలిసికట్టుగా ఉండాలని మంత్రి హరీశ్ రావు అన్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, పార్టీ విజయం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 22న తన 60వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్న మాణిక్యం, సంగారెడ్డి పట్టణంలో పెద్ద ర్యాలీ కూడా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తానే బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నానని, తనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని ప్రజలను కోరారు. పట్నం ప్రకటనతో బీఆర్ఎస్ లో గందరగోళం నెలకొంది. అయితే చింతా ప్రభాకర్ పైన, పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా పట్నం ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోయినా, తనను తానే అభ్యర్థిగా ప్రకటించుకోవడాన్ని పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీ కేడర్ లో గందరగోళం సృష్టిస్తున్నాయని పార్టీ భావించినట్టు తెలుస్తోంది.
కీలక నేతలతో భేటీకానున్న హరీశ్ రావు
ఈ పరిణామాల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పార్టీ బాధ్యుడైన మంత్రి హరీశ్ రావు, త్వరలోనే నియోజకవర్గంలోని కీలక నేతలతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలతో మీటింగ్ పెట్టి అందరూ కలిసి పనిచేయాలని దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ నాయకులు తెలిపారు. బీఆర్ఎస్ కు సంగారెడ్డిలో జగ్గారెడ్డి రూపంలో గట్టి ప్రత్యర్థి పోటీలో ఉండటంతో... కాంగ్రెస్ కు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా పనిచేయాలని మంత్రి బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.