Organ Donation : అవయవదానంతో ఏడుగురికి ప్రాణం పోసిన సంగారెడ్డి యువకుడు
Organ Donation : తాను మరణిస్తూ మరో ఏడుగురికి ప్రాణం పోశాడు సంగారెడ్డి జిల్లాకు చెందిన యువకుడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బీజేపీ కార్యకర్త పెంటన్నను బ్రెయిన్ డెడ్ గా వైద్యులు ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులు అవయవదానికి ముందుకొచ్చారు.
Organ Donation : సంగారెడ్డి జిల్లాలోని సిర్గాపూర్ కు చెందిన యువకుడు చనిపోతూ తన అవయవాలు దానం చేసి ఏడుగురికి ప్రాణం పోశాడు. సంగారెడ్డి జిల్లాలోని సిర్గాపూర్ కి చెందిన యువకుడు, భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నేత గొల్ల పెంటన్న (34) ఇటీవల రోడ్డు ప్రమాదం తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా పెంటన్న అవయవాలు దానం చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. అవయవ దానానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప అభినందించారు.
ట్రెండింగ్ వార్తలు
ప్రమాదంలో అపస్మారకస్థితిలోకి వెళ్లిన పెంటన్న
బుధవారం రాత్రి పెంటన్న తన బంధువుల ఇంటికి వెళ్లి బైక్ పై తిరిగి వస్తున్న క్రమంలో నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపూర్ క్రాసింగ్ వద్ద ఎదురుగా వస్తున్నా గుర్తుతెలియని వాహనం అతడ్ని ఢీకొట్టింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. అతనిని నారాయణఖేడ్ హాస్పిటల్లో ప్రథమ చికిత్స చేసిన తర్వాత సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు పరిశీలించి, తన పరిస్థితి విషమంగా ఉందని చెప్పటంతో పెంటన్నను హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతడు బ్రెయిన్ డెడ్ అయ్యాడని వైద్యులు ప్రకటించడంతో... జీవన్ దాన్ ట్రస్ట్ పెంటన్న కుటుంబ సభ్యులకు అవయవదానం ప్రాధాన్యాన్ని వివరించడంతో వారు అంగీకరించారు. పెంటన్న శుక్రవారం తెల్లవారుజామున మరణించడంతో అతడి ఏడు అవయవాలను ఇతరులకు అమర్చనున్నట్లు జీవన్ దాన్ సంస్థ సభ్యులు తెలిపారు. పెంటన్న నారాయణఖేడ్ బీజేపీ నేత, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్పకు అనుచరుడు కావడంతో ఆయన రోజు హాస్పిటల్ కు వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ వచ్చారు.
అవయదానానికి ముందుకొచ్చిన కుటుంబసభ్యులు
ఆసుపత్రి యాజమాన్యంతో కలిసి కుటుంబ సభ్యులకు జీవన్ దాన్ అవయవదానం విశిష్టతను సంగప్ప తెలియజేశారు. పెంటన్న అవయవ దానానికి ముందుకు వచ్చిన కుటుంబసభ్యులను సంగప్ప అభినందించారు. శనివారం సిర్గాపూర్ లో పెంటన్న అంత్యక్రియలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులూ, కార్యకర్తలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దుఃఖంలో ఉండి అవయవదానం చేసిన పెంటన్న కుటుంబసభ్యులను అందరూ అభినందించారు. అవయవదానం అంటే చనిపోబోతున్న వారికీ తిరిగి ప్రాణం పోయటమేనని వాళ్ళు అభిప్రాయపడ్డారు. పెంటన్నకు భార్య లావణ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ నాయకులు కోరారు.