Ameenpur Lake FTL : అమీన్ పూర్ చెరువులోకి వ్యర్థ జలాలు, నీట మునిగిన 5 వేల ప్లాట్లు-హైడ్రా కమిషనర్ రంగంలోకి
Ameenpur Lake FTL : సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పెద్ద చెరువులోకి వ్యర్థ జలాలు చేరుతుండడంతో ఎఫ్టీఎల్ పరిధి 93 ఎకరాల నుంచి 460 ఎకరాలకు పెరిగింది. దీంతో చెరువు దిగువన ఉన్న సుమారు 5 వేల ప్లాట్లు నీట మునిగాయి. ఈ ప్లాట్లను హైడ్రా కమిషనర్ పరిశీలించారు.
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పెద్ద చెరువులో భారీగా వ్యర్థ జలాలతో వచ్చి చేరుతున్నాయని, అందువలన చెరువు ఎఫ్టీఎల్ పరిధి పెరిగి వేలాది ప్లాట్లు నీటిలో మునిగిపోయాయంటున్నారు ప్లాట్లు కొనుగోలు చేసినవాళ్లు. పెద్ద చెరువు విస్తీర్ణం 93 ఎకరాలు అని రికార్డులలో నమోదు చేశారని, కానీ ఇప్పుడు నీరు సుమారుగా 460 ఎకరాలలో వ్యాప్తి చెందిందని అంటున్నారు. కాగా 1980, 1990 లలో చెరువు వెనుకగా భూములలో సుమారుగా 20 లేఔట్ లు చేయగా అక్కడ 5,000 ఫ్లాట్ లు కొనుగోలు చేశారు.
ఎఫ్టీఎల్ పరిధి 93 ఎకరాల నుంచి 460 ఎకరాలకు
చెరువులోకి వర్షపు నీటితో పాటు వ్యర్థ జలాలు వదలటంతో 93 ఎకరాలు ఉన్న చెరువు కాస్త ఇప్పుడు 460 ఎకరాలకు విస్తరించి, ఈ ప్లాట్లు అన్ని కూడా నీటిలో మునిగిపోయాయి. దీనికి కారణం ఇరిగేషన్ వారు చెరువు తూములు, అలుగులు మూసివేయడం వలన నీరు క్రమంగా పెరిగి కింద ఉన్న ఫ్లాట్ లను ఆక్రమించిందని ఆ ప్లాట్ల ఓనర్లు ఆరోపిస్తున్నారు. అక్కడ స్థలాలు కొన్న బాధితులు తమకు న్యాయం చేయాలని చాల కాలంగా అధికారులను వేడుకుంటున్నారు. కానీ నీటిపారుదల అధికారులు మాత్రం చెరువు, 460 ఎకరాలను మొత్తం FTL గా నిర్ధారించారు. తమ సమస్యను పరిస్కారం చేసుకోవడం కోసం, బాధితులందరు జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు. కానీ బాధితుల ఆవేదనను అధికారులు పట్టించుకోకపోవడంతో, చివరికి వారంతా కలిసి హైడ్రా కమీషనర్ రంగనాథ్ ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.
పెద్ద చెరువును పరిశీలించిన రంగనాథ్
బాధితుల ఫిర్యాదుతో మంగళవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్ పూర్ పెద్ద చెరువును సందర్శించారు. రంగనాథ్ తో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు బాధితులతో కలిసి పెద్ద చెరువును పరిశీలించారు. అప్పట్లో తాము కష్టపడి పైసా పైసా కూడబెట్టుకొని ఈ స్థలాలను కొనుకున్నామని ఆవేదన వ్యక్తపరిచారు. చెరువు కింద 20 లేఔట్ లను సుమారు ఐదు వేల ప్లాట్లను కొనుగోలు చేశామని బాధితులు తెలిపారు. ఇప్పుడు తమ స్థలాలు చెరువులో మునిగిపోయాయని వారు రంగనాథ్ కు వివరించారు. కావున అధికారులు చెరువులో ఉన్న మురుగు నీటిని తొలగించాలని వారు కోరుతున్నారు. చెరువు విస్తీర్ణం 93 ఎకరాల వరకు నీటిని ఉంచి మిగతా స్థలాలను తమకు అప్పగించాలని బాధితులు కోరుతున్నారు. త్వరలో తాను అధికారులందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, నిజానిజాలు తెలుస్తానని రంగనాథ్ వారికి హామీ ఇచ్చారు.
వందనాపురి కాలనీ లో ఇల్లు కూల్చివేత
గత కొంతకాలంగా, స్తబ్దుగా ఉన్న హైడ్రా సోమవారం అమీన్ పూర్ పరిధిలో వందనాపురి కాలనీలోని 848 సర్వ్ నంబర్ లో రోడ్డును ఆక్రమించి కట్టిన ఇంటిని హైడ్రా అధికారులు కూల్చేశారు. రాజు అనే అతను, రోడ్డును ఆక్రమించి ఇల్లు కట్టారని ఆరోపణలు రావటంతో, అధికారులు విచారణ చేసి తన ఇల్లును కూల్చివేశారు.
సంబంధిత కథనం