Thief Arrested : 'వీడొక్కడే' 200లకు పైగా చోరీలు, మారు వేషాల్లో పోలీసుల కళ్లుగప్పి దొంగతనాలు
Thief Arrested : సంగారెడ్డి జిల్లా జిన్నారం పోలీసులు 200లకు పైగా చోరీలు చేసిన ఘరానా దొంగను అరెస్టు చేశారు. తాళలు ఉన్న ఇళ్లు లక్ష్యంగా చోరీలు చేయడం, మారు వేషాలతో తప్పించుకు తిరగడం ఈ దొంగకు పరిపాటి. దీంతో పాటు చోరీ తర్వాత బట్టలు మార్చుకుని జనంలో కలిసిపోతుంటాడు.
తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా పట్టపగలే వరుస చోరీలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఘరానా దొంగను సంగారెడ్డి జిల్లా జిన్నారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అతడు ఇప్పటివరకు రాష్ట్రంలోని పలు జిల్లాలో 200 లకి పైగా ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. కాగా ఇళ్లల్లో దొంగతనాలు చేసి పోలీసుల కళ్లుగప్పి మారువేషాల్లో తిరుగుతుంటాడు.
జిన్నారం సీఐ సుదీర్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం వారం రోజుల కిందట గుమ్మడిదలకు చెందిన చిలుముల రవీందర్ రెడ్డి దంపతులు ఇంటికి తాళం వేసి పూజకు వెళ్లి తిరిగొచ్చేలోపే ఇంట్లో చోరీ జరిగి 31 తులాల బంగారం ఆభరణాలు దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ కేసును నమోదు చేసుకున్న పోలీసులు సవాలుగా తీసుకొని ఒక టీంగా ఏర్పడి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
దొంగిలించిన బంగారాన్ని కరిగిస్తుండగా
పోలీసుల దర్యాప్తులో భాగంగా నిందితుడు గుమ్మడిదలలో చోరీ చేసిన బంగారాన్నిచార్మినార్ లోని ఓ దుకాణంలో కరిగించి 24 క్యారెట్ ల బంగారు బిస్కెట్ తీసుకున్నాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు హమీద్ సయ్యద్ అలియాస్ అహ్మద్ (42)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి బంగారు బిస్కెట్ తో పాటు చరవాణి, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని విచారించగా పలు విషయాలు బయటపడ్డాయి.
నిందితుడి నేర చరిత్ర ....... 15 ఏళ్లుగా దొంగతనాలు
వరంగల్ జిల్లాకు చెందిన హమీద్ సయ్యద్ అలియాస్ అహ్మద్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని చార్మినార్ నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడు 15 సంవత్సరాలుగా పగటి పూట తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. నిందితునిపై తెలంగాణలోని పలు జిల్లాలో సుమారు 150 నుంచి 200 దొంగతనాల కేసులు నమోదయ్యాయని విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పోలీసులకు దొరకాకుండా ఇళ్లలో దొంగతనం చేసిన తర్వాత తాను వేసుకున్న బట్టలు తీసివేసి తన వెంట తెచ్చుకున్న వేరే బట్టలు వేసుకొని ప్రజల్లో కలిసిపోతాడన్నారు. ఈ విధంగా పోలీసులను తప్పుదోవ పట్టిస్తాడు.
ఇప్పటివరకు 200లకు పైగా కేసులు......
అతడిపై ఇప్పటివరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 56, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 22, రాచకొండ పరిధిలో 09, ఆదిలాబాద్ జిల్లాలో 10, సంగారెడ్డి జిల్లాలో 07, నిజామాబాద్ జిల్లాలో 05, వరంగల్ జిల్లాలో 02, కరీంనగర్ లో 08, సిద్దిపేటలో 01, మెదక్ లో 01చొప్పున కేసులు నమోదయినట్లు గుర్తించారు. ఈ కేసును వారం రోజుల్లోనే ఛేదించి నిందితుడిని పట్టుకున్న ఎస్ఐ, సిబ్బందిని సీఐ అభినందించారు.
సంబంధిత కథనం