TG Samagra Kutumba Survey : నేటి నుంచే సమగ్ర కుటుంబ సర్వే - ఈ పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి..!
TG Samagra Kutumba Survey Updates: తెలంగాణలో ఇవాళ్టి నుంచి సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం కానుంది. ఇప్పటికే మూడు రోజుల పాటు స్టిక్కరింగ్ ప్రాసెస్ పూర్తి అయింది. నేటి నుంచి కుటుంబ వ్యక్తిగత వివరాలను ఎన్యూమరేటర్లు సేకరిస్తారు. తాజాగా ఈ సర్వేకు సంబంధించి ప్రణాళిక శాఖ కీలక వివరాలను పేర్కొంది.
తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరగనుంది. నవంబర్ 6 నుంచి ప్రారంభం కావాల్సిన ఉన్నప్పటికీ… స్టిక్కరింగ్ ప్రక్రియ మాత్రమే ముగిసింది. అధికారికంగా ఇవాళ్టి నుంచి సర్వే ప్రారంభం కానుంది.
నేటి నుంచి ప్రారంభమయ్యే సమగ్ర కుటుంబ సర్వే నవంబర్ 30 వరకు జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మూడు రోజలుగా హౌస్‌లిస్టింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. శనివారం(నవంబర్ 09) కుటుంబ వ్యక్తిగత వివరాలను ఎన్యూమరేటర్లు సేకరిస్తారు.
ఈ పత్రాలు ఉంచుకోండి..!
సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా… ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వస్తారు. అయితే వివరాల సేకరణలో భాగంగా కొన్ని పత్రాలు ఉంచుకుంటే వేగంగా సమాచారం సేకరణ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, సెల్ ఫోన్ నెంబర్ల వంటివి అందుబాటులోకి ఉంచుకోవాలని సూచిస్తున్నారు. తీరా ఎన్యూమరేటర్లు వచ్చే సమయానికి ఇబ్బందిపడకుండా… ముందుగానే ఈ కాగితాలను సిద్ధం చేసుకుంటే వివరాలను కూడా సులభంగా చెప్పొచ్చని చెబుతున్నారు. ఇక మొత్తం వివరాలు పూర్తయ్యాక తాను చెప్పిన వివరాలన్నీ నిజమేనని ప్రకటిస్తున్నట్లుగా కుటుంబ యజమాని సంతకం చేయాల్సి ఉంటుంది.
మీరు ఉంటున్న చోటే ఇవ్వొచ్చు…!
ఈ సర్వేకు సంబంధించి రాష్ట్ర ప్రణాళిక శాఖ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ఒక కుటుంబం ప్రస్తుతం ఎక్కడ నివసిస్తుంటే అక్కడే తమ వివరాలను నమోదు చేయించుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం సొంత గ్రామానికే వెళ్లాల్సిన పని లేదని పేర్కొంది.అయితే ఆధార్ పై ఉండే చిరునామా ఆధారంగానే వివరాల సేకరణ ఉంటుందని అధికారులు ముందుగా పేర్కొన్నారు. ఈ విషయంలో అనేక విజ్ఞప్తులు రాగా… ప్రణాళిక శాఖ వెసులుబాటు కల్పించినట్లు తెలిసింది.
రాష్ట్రంలో మొత్తం 1,17,44,954 కుటుంబాలు ఉన్నాయని ప్రణాళిక శాఖ తెలిపింది. వీటిని 87,092 ఎన్యూమరేషన్ బ్లాక్‌లుగా విభజించినట్లు వివరించింది. ఇక సర్వే కోసం ఇప్పటికే నియమించిన సిబ్బంది క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ సర్వేలో కీలకంగా మారారు.
75 ప్రశ్నలు…!
ఈ సర్వేలో భాగంగా 75 ప్రశ్నలు ఉండనున్నాయి. ప్రతి కుటుంబంలో సభ్యులందరి ఫోన్, ఆధార్ నంబర్లు సహా సమస్త వివరాలను నమోదు చేసి కంప్యూటరీకరణ చేయనున్నారు. ఇక సమగ్ర కుటుంబ సర్వేలో కులం వివరాలు చెప్పకుండా ఉండేందుకు కూడా ప్రత్యేక కాలమ్ ను కూడా తీసుకొచ్చారు. వ్యవసాయ భూములు కలిగివున్నట్టయితే ధరణి పాస్‌బుక్ నంబర్‌తో పాటు భూమి రకం, నీటిపారుదల వనరు, కౌలు సాగుభూమి వివరాను చెప్పాల్సి ఉంటుంది.
ఇక రేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలను సేకరిస్తారు. ఆదాయపు పన్ను చెల్లిస్తే… వివరాలను పేర్కొనాలి. విద్యార్హతలతో పాటు ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం వంటి వివరాలను కూడా చెప్పాల్సి ఉంటుంది. గత 5 ఏళ్లలో ప్రభుత్వం నుంచి ఏమైనా రుణాలు పొందారా..? వంటి వివరాలను కూడా సేకరిస్తారు. రాజకీయ నేపథ్యానికి సంబంధించి కూడా ఫామ్ లో కాలమ్స్ ఉన్నాయి.
సంబంధిత కథనం