Fake Medicines Seize: తప్పుడు ప్రకటనలతో ఆయుర్వేద ఔషధాల విక్రయం, నూమోనియా, డయాబెటిక్ చికిత్సల పేరుతో మోసాలు
Fake Medicines Seize: న్యూమోనియా, డయాబెటిస్ చికిత్సల పేరుతో ప్రజల్ని మభ్య పెడుతూ ఔషధాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఔషధ నియంత్రణ శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు.
Fake Medicines Seize: తప్పుడు ప్రకటనలతో ఔషధాలు తయారు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తున్న తయారీ సంస్థలపై తెలంగాణ ఔషధ నియంత్రణ శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు.
రంగారెడ్డి జిల్లా గండిపేటలో 'న్యుమోనియా'కు ఆయుర్వేద ఔషధం పేరుతో తయారు చేస్తున్న ఆర్థో విన్ గోల్డ్ ఆయిల్ ను తయారు చేస్తున్నట్టు గుర్తించారు. నిజామాబాద్‌లో 'మధుమేహం'కు ఆయుర్వేద ఔషధం పేరుతో ఉసిరి జ్యూస్‌ను విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
ఆయుర్వేద ఔషధాల పేరుతో పలు సంస్థలు తమ లేబుళ్లపై 'న్యుమోనియా' 'డయాబెటీస్'కి చికిత్సకు పని చేస్తాయని విక్రయిస్తున్నట్టు ఔషధ నియంత్రణ శాఖ గుర్తించింది. తప్పుడు ప్రచారాలతో మార్కెట్‌లో చలామణి అవుతున్న కొన్ని మందులను గుర్తించారు. ఇలాంటి ప్రచారాలు డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం ప్రకారం నిషిధ్దమైనవిగా పేర్కొన్నారు. అభ్యంతరకరమైన ప్రకటనలు ఇస్తున్న సంస్థలపై చర్యలు చేపట్టారు.
డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టం, 1954లో కొన్ని రకాల వ్యాధులు, రుగ్మతల చికిత్స కోసం చేసే మందుల ప్రకటనలను నిషేధించారు. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం కింద గుర్తించిన వ్యాధుల చికిత్స ప్రకటనల్లో ఏ వ్యక్తి కూడా పాల్గొనకూడదు.
ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా అభ్యంతరకరమైన ప్రకటనలతో మార్కెట్‌లో తరలిస్తున్న మందులను గుర్తించేందుకు మే 23 & 24 తేదీల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
గండిపేటలో పట్టుబడిన ఆర్థో విన్ గోల్డ్ ఆయిల్, న్యూమోనియాను తగ్గిస్తుందనే ప్యాకింగ్ పై ముద్రించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తయారు చేస్తున్నట్టు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలోని మెడికల్ షాపులో నిర్వహించిన సోదాల్లో మందుల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడలో తయారీ….
నిజమాబాద్ అర్బన్‌లో డ్రగ్స్ నియంత్రణ అధికారులు చేసిన తనిఖీల్లో ఆయుర్వేద ఔషధం ఆమ్లా జ్యూస్‌ను గుర్తించారు. విజయవాడలోని మన్‌ఫర్ ఆయుర్వేదిక్ డ్రగ్స్ తయారు చేస్తున్న ఆమ్లా జ్యూస్ ఉత్పత్తి లేబుల్‌పై 'డయాబెటిస్'కి చికిత్సకు పని చేస్తుందని ముద్రించారు. దీంతో నిజామాబాద్‌లోని మెడికల్ షాపులో నిర్వహించిన సోదాల్లో మందుల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.
'న్యుమోనియా', 'డయాబెటిస్' చికిత్సల పేరుతో అభ్యంతరకరమైన ప్రకటనలపై కేసులు నమోదు చేశారు. తదుపరి విచారణ చేపట్టి నేరస్తులందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని తెలంగాణ ఔషధ నియంత్రణ శాఖ ప్రకటించింది. అభ్యంతరకరమైన ప్రకటనలు ఇస్తే చట్టప్రకారం జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారని హెచ్చరించారు.
చట్టవిరుద్ధమైన ఔషధాల విక్రయాలకు సంబంధించి డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వారికి టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969 ద్వారా సమాచారం అందించాలని కోరారు. ఇలాంటి ఔషధాలకు సంబంధించిన చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు తెలియచేయవచ్చని ప్రకటించారు.