TGSRTC Logo : ఆర్టీసీ కొత్త లోగో ఖరారు చేయలేదు... ఆ ప్రచారమంతా ఫేక్ - సజ్జనార్-sajjanar made a key announcement on the subject of tgsrtcs new logo ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgsrtc Logo : ఆర్టీసీ కొత్త లోగో ఖరారు చేయలేదు... ఆ ప్రచారమంతా ఫేక్ - సజ్జనార్

TGSRTC Logo : ఆర్టీసీ కొత్త లోగో ఖరారు చేయలేదు... ఆ ప్రచారమంతా ఫేక్ - సజ్జనార్

Maheshwaram Mahendra Chary HT Telugu
May 23, 2024 01:59 PM IST

TGSRTC New Logo : తెలంగాణ ఆర్టీసీ లోగో మార్పుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సంస్థ ఎండీ సజ్జనార్ స్పందించారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు.

తెలంగాణ ఆర్టీసీ కొత్త లోగోపై సజ్జనార్ ప్రకటన
తెలంగాణ ఆర్టీసీ కొత్త లోగోపై సజ్జనార్ ప్రకటన (TGRTC Twitter)

TGSRTC New Logo : తెలంగాణ ఆర్టీసీ లోగో మార్పుపై చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై….సంస్థ ఎండీ సజ్జనార్ స్పందిస్తూ ప్రకటన విడుదల చేశారు.

TGSRTC కొత్త లోగో విషయంలో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని సజ్జనార్ స్పష్టం చేశారు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదని చెప్పారు. 

టీజీఎస్‌ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్‌ మీడియాలో  ఫేక్ ప్రచారం జరుగుతోందని కొట్టిపారేశారు. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోందని…. కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదని తెలిపారు.

పేరు మారింది…!

TSRTC To TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) పేరు మారింది. టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చినట్లు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ఎక్స్(X) వేదికగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టీఎస్‌ఆర్టీసీ పేరును టీజీఎస్‌ఆర్టీసీగా మార్చామన్నారు. ఆ మేరకు అధికారిక ఎక్స్‌ ఖాతాలను సైతం టీజీఎస్ఆర్టీసీగా మార్చామన్నారు. 

ప్రయాణికులు విలువైన సలహాలు, సూచనలతో పాటు ఫిర్యాదులను మార్చిన ఖాతాల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని సజ్జనార్ కోరారు. అలాగే టీజీఎస్ఆర్టీసీ అందిస్తోన్న సేవల గురించి తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వాలని విజ్ఞప్తి చేశారు.

టీెఎస్ నుంచి టీజీగా మార్పు….

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్... టీఎస్ పేరును టీజీగా మారుస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం ఇటీవల అంగీకరించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లకు టీజీ పేరును ఇస్తున్నారు. ఈ మార్పులతో తాజాగా టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సూచించే అధికారిక సంక్షిప్త పదం టీఎస్ నుంచి టీజీగా మారుస్తూ ఇటీవల సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, ఏజెన్సీలు, ఇతర స్వయం ప్రతిపత్తి సంస్థలు, అధికారిక హోదాలు సూచించే బోర్డుల్లో రాష్ట్రాన్ని టీజీగా పేర్కొనాలని సూచించారు. జీవోలు, పాలసీ పేపర్లు, నోటిఫికేషన్లు, సర్క్యులర్లు, లెటర్‌ హెడ్స్‌, అధికారిక పత్రాల్లో సైతం టీజీ అని వచ్చేలా చూడాలన్నారు. ఇప్పటికే టీఎస్‌ పేరుతో ముద్రించిన పత్రాలపై ఈ నెలాఖరుకు నివేదిక అందజేయాలని సీఎస్ ఆదేశించారు.

తెలంగాణ వాహనాల నెంబర్ ప్లేట్లపై టీఎస్ కు బదులు టీజీ అని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ జారీ చేసింది. మార్చి 15 నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లకు టీజీ అనే చేయాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనుమతి తెలిపింది. దీంతో ఇకపై వాహనాల నెంబర్ ప్లేట్లపై టీఎస్‌ను బదులుగా టీజీగా ముద్రించనున్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర కోడ్ ను టీజీగా ముద్రించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ కూడా ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. వాహనాల నంబర్ ప్లేట్లపై టీజీ వచ్చే విధంగా రిజిస్ట్రేషన్ చేయాలని పేర్కొంది. సీరియల్ నంబర్ 29ఏ ప్రకారం టీఎస్ బదులుగా టీజీ అని మార్చినట్లు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 

 

Whats_app_banner