Sajjanar on Betting Apps : బెట్టింగ్ విష చక్రం.. ప్రమోట్ చేసే అందరిపైనా కేసులు నమోదు చేయాలి: సజ్జనార్
Sajjanar on Betting Apps : బెట్టింగ్ యాప్స్ ఎంతోమంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. వాటిని ప్రమోట్ చేసిన వారు మాత్రం కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఇదే అంశంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇటీవల ఉద్యమం ప్రారంభించారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.
బెట్టింగ్ అన్నది ఒక విష చక్రం.. అందులో చిక్కుకుంటే అంతే సంగతులని.. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగ్ వల్ల కుటుంబాలు కూడా నష్టపోతాయని చెప్పారు. బెట్టింగ్ యాప్స్‌పై ప్రజలకు అవగాహన వచ్చినప్పుడే వాటిని అరికట్టగలమని అభిప్రాయపడ్డారు. గతంలో లోన్ యాప్స్, మల్టీ లెవల్ మార్కెటింగ్, మైక్రో ఫైనాన్స్ వంటి వాటిపై పోరాటం చేశానని గుర్తు చేశారు.
కేసులు పెట్టాలి..
'సురేఖ వాణి కుమార్తెతో పాటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే అందరిపైనా కేసులు నమోదు చేయాలి. సన్నీ యాదవ్ లాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. ఈజీ మనీ మాయలో జీవితాలు నాశనం అవుతున్నాయి. బెట్టింగ్ అన్నది ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు.. ఇది దేశానికి సంబంధించిన సమస్య. దీనిపై అందరూ కలిసి పోరాడాలి' అని సజ్జనార్ స్పష్టం చేశారు.
దర్యాప్తు చేయాలి..
'సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల కొందరు సూసైడ్ చేసుకుని ఉంటారు. సమగ్ర దర్యాప్తు చేస్తే మనీలాండరింగ్, చట్టవ్యతిరేక నేరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. బ్యాంక్ అకౌంట్స్, ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. మరింత సమాచారం సేకరించవచ్చు. ఆ సమాచారంతో మరిన్ని సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయవచ్చు' అని సజ్జనార్ వ్యాఖ్యానించారు.
వీరి స్వార్థం వల్లే..
'బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ.. ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేసి కోట్లలో సంపాదించి.. వేలల్లో పంచుతూ.. సంఘ సేవ చేస్తున్నట్లు ఫోజులు కొడుతున్న ఇలాంటి వాళ్లనా మీరు ఫాలో అవుతోంది. వీరి స్వార్థం వల్లే బెట్టింగ్ సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. భారత ఆర్ధిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తోంది. అసలు ఏం ఉద్ధరించారు వీళ్లు. ఏమైనా దేశ సేవ చేస్తున్నారా.. సమాజ హితం కోసం ఏమైనా మంచి పనులు చేస్తున్నారా' అని సజ్జనార్ ప్రశ్నించారు.
పోలీసులకు ఫిర్యాదు చేయండి..
'ఇప్పటికైనా ఇలాంటి సైబర్ టెర్రరిస్టులను అన్ ఫాలో కొట్టండి. వారి అకౌంట్‌లను రిపోర్ట్ చేయండి. ఎవరైనా బెట్టింగ్ యాప్‌ల వల్ల నష్టపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించి.. బెట్టింగ్ భూతాన్ని అంతం చేయాలి. లేకపోతే మరిన్ని కుటుంబాలు నష్టపోయే ప్రమాదం ఉంది' అని సజ్జనార్ వ్యాఖ్యానించారు.