Sajjanar Appeal: ఆ సంస్థలకు ప్రచారం చేయొద్దని బాలీవుడ్ నటులకు సజ్జనార్ విజ్ఞప్తి
Sajjanar Appeal: మోసకారీ గొలుసుకట్టు సంస్థల తరపున బాలీవుడ్ నటులు ప్రచారం చేయొద్దని ఆర్టీసీ ఎండీ, ఐపిఎస్ అధికారి సజ్జనార్ ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేశారు. సినీనటులతో పాటు ప్రముఖులు ఎవరూ మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థలకు ప్రచారం చేయొద్దని సూచించారు.
Sajjanar Appeal: ప్రజల బలహీనత ఆధారంగా వ్యాపారం చేసే మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థలకు ప్రముఖులు ఎవరూ ప్రచారం చేయొద్దంటూ ట్విటర్ వేదికగా ఐపీఎస్ అధికారి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
ఆమ్వే సంస్థకు ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రచారం చేయడంతో అమితాబ్ బచ్చన్‌ను ట్యాగ్ చేస్తూ సజ్జనార్ ట్వీట్ చేశారు. ‘’మోసకారి సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయని, అమాయక ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నాయని సజ్జనార్ పేర్కొన్నారు. ఇలాంటి సంస్థలను సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం లేదా వాటికి మద్దతు ఇవ్వడం చేయొద్దని సజ్జనార్ సూచించారు.
గతంలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ 'క్యూనెట్'కు టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రచారం చేయడంపై సజ్జనార్ ట్విటర్‌లో స్పందించారు. సజ్జనార్ హైదరాబాద్ సీపీగా ఉన్న సమయంలో పలు మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలపై చర్యలు తీసుకున్నారు. ఆమ్వే సంస్థ గొలుసు కట్టు వ్యాపారం పేరుతో మోసానికి పాల్పడుతున్నట్లు 2022లో ఈడీ గుర్తించి.. ఆస్తులను జప్తు చేసింది. పెరల్స్, క్యూనెట్ సహా పలు మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థలకు చెందిన సూత్రధారులపై సజ్జనార్ హయంలో కేసులు నమోదయ్యాయి. తాజాగా క్యూనెట్ కార్యాలయంలో అగ్నిప్రమాదంలో ఆరుగురు కాల్ సెంటర్ ఉద్యోగులు చనిపోయిన సమయంలో కూడా సజ్జనార్ ట్వీట్ చేశారు. ఈ సంస్థల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.