Krishna River Projects : ఎగువ నుంచి భారీ వరద..! మరోసారి తెరుచుకున్న సాగర్ గేట్లు, తాజా పరిస్థితి ఇదే..!
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద తరలివస్తోంది. దీంతో శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. కొన్ని గేట్లు కొంతమేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం గరిష్టస్థాయికి చేరింది.
శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు మరోసారి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు కొన్ని క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల దాటికి… వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. అప్రమత్తమైన అధికారులు… ముందుజాగ్రత్తగా కొన్ని గేట్లు ఎత్తి నీటిని కిందికి పంపిస్తున్నారు.
శ్రీశైలం జలాశయం నుంచి 1,07,787 క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతుంది. దీంతో సాగర్ ప్రాజెక్ట్ ఆరు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 1,08,851 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 312.05 టీఎంసీలు కాగా… మొత్తం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం కూడా 312.05 గా ఉంది. ఈ ఏడాది కర్ణాటకలో కురిసిన భారీవర్షాలకు కృష్ణమ్మ పోటెత్తింది. ఆగస్ట్ నుంచి ఇప్పటికే పలుమార్లు పూర్తి గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఇటీవలే వాయుగుండం, అల్పపీడన ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మళ్లీ ఎగువ నుంచి ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇవాళ్టి(అక్టోబర్ 19) ఉదయం రిపోర్ట్ ప్రకారం… సాగర్ ప్రాజెక్టులో 590 అడుగుల నీటిమట్టం ఉంది.ఇన్ ఫ్లో 1,08,851 క్యూసెకులుగా నమోదు కాగా… 1,08,851 క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టులో చూస్తే నీటిమట్టం 884.6 అడుగులకు చేరింది. మొత్తం ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 213.4 టీఎంసీలుగా ఉంది. ఇన్ ఫ్లో 1,19,427 క్యూసెక్కులుగా ఉండగా… ఔట్ ఫ్లో 1,07,787గా ఉంది.
ఇక పులిచింతల ప్రాజెక్టు వద్ద పరిస్థితి చూస్తే…. ప్రస్తుతం 174.21 అడుగుల నీటిమట్టం ఉంది. 44.54 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 93,876 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా… ఔట్ ఫ్లో 96,080 క్యూసెక్కులుగా ఉంది.