Saddula Bathukamma : ఊరిఊరిలో తీరొక్క పూలకళ.. గంగమ్మ ఒడికి బతుకమ్మ
Bathukamma Celebrations : తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ పాటలతో ఊరూవాడా మారుమోగాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మ గంగమ్మ ఓడికి చేరింది.
సద్దుల బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రంగురంగుల పూలను పేర్చి.. ఊయ్యాల పాటలతో మహిళలు ఆడిపాడారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. పల్లెల్లో సంబరాలు అంబరాన్నంటాయి. పల్లెలు, పట్టణాల్లోని చౌరస్తాలు.. బతుకమ్మలతో మురిసిపోయాయి.
ఎల్బీ స్టేడియంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్యర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. నాలుగు వేల బతుకమ్మలను పేర్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ఎల్బీ స్టేడియం నుంచి మహిళలు బతుకమ్మలను ఎత్తుకుని భారీ ప్రదర్శనగా ట్యాంక్‌బండ్ వైపు వచ్చారు. కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ.. ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు జరిగాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ తెలంగాణ ఆడబిడ్డల అందరూ సంతోషంగా పండుగ నిర్వహించుకున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. హన్మకొండలో సద్దుల బతుకమ్మ వేడుకలు జాతరను తలపించాయి. బతుకమ్మలను తీసుకుని వందలాదిగా తరలివచ్చిన మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు. పద్మాక్షి గుట్ట వద్ద వేడుకలకు భారీగా మహిళలు వచ్చారు.
నల్గొండ, ఖమ్మం, సూర్యపేట, పెద్దపల్లి కరీంనగర్.. ఇలా ప్రతి జిల్లాల్లోనూ వేడుకను ఘనంగా నిర్వహించారు. మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి.. వాటి చూట్టూ ఆడిపాడారు. తీరొక్క పూలతో మహిళలు బతుకమ్మలను అందంగా పేర్చారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరై ఆడిపాడి సందడి చేశారు.
చిన్నాపెద్దా తేడా లేకుండా బతుకమ్మ ఆడటం ఆకర్షణగా నిలిచింది. బతుకమ్మ ఆడిన అనంతరం సమీపంలో చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు.