Rythu Bandhu: నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు
Rythu Bandhu: తెలంగాణలో నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి ‘రైతుబంధు’ నిధులు జమ కానున్నాయి.ఈ ఏడాది కొత్తగా 5 లక్షల మంది రైతులకు పథకాన్ని వర్తింప చేస్తున్నారు. మొత్తం 70 లక్షల మందికి సాయంగా రూ.7,720 కోట్ల విడుదల చేశారు.
Rythu Bandhu: తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రారంభించిన రైతుబంధు నిధులు నేడు విడుదల కానున్నాయి. ఆరుగాలం కష్టపడే అన్నదాతలకు పెట్టుబడి సాయంగా ఏటా ఎకరానికి రూ.10వేల చొప్పున సర్కారు అందిస్తోంది. ఇప్పటికే పది విడుతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. పదకొండో విడతలో భాగంగా సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు ఆర్థిక సాయాన్ని జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
వానాకాలం పంటకు సంబంధించి 70లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సారి 1.5లక్షల మంది పోడు రైతులకు కూడా రైతుబంధు అమలు చేయనున్నట్లు చెప్పారు. రైతుల ఖాతాల్లో మొత్తం రూ.7720.29కోట్లు జమ కానున్నాయి. 1.54కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందించనున్నట్లు వివరించారు.
తెలంగాణలో వానాకాలం సాగుకు పెట్టుబడి సాయంగా 70 లక్షల మంది అన్నదాతలకు రైతుబంధు నిధులు ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7,720.29 కోట్లు విడుదల చేసింది. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు నేరుగా రైతుల ఖాతాల్లోకి వ్యవసాయశాఖ నగదు జమ చేయనుంది.
ఈ సీజన్‌లో కొత్తగా 5 లక్షల మంది రైతులకు ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తింప చేసింది. దీంతో సుమారు రూ.300 కోట్ల అదనపు భారం పడనుంది. తాజాగా విడుదల చేసిన 11వ విడతతో కలిపి ఇప్పటివరకూ రైతులకు రైతుబంధు ద్వారా మొత్తం రూ.72,910 కోట్ల సాయం అందించారు. ఈ సీజన్‌లో 1.54 కోట్ల ఎకరాలకు పంట సాయం అందుతుంది.
కొత్తగా రైతుబంధు సాయం తీసుకోనున్న రైతులు.. తమ బ్యాంకు ఖాతాల వివరాలతో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. వానాకాలం రైతుబంధు నిధుల విడుదల నేపథ్యంలో తెలంగాణ రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
'దేశంలో ఏడాదికి రెండు విడతల్లో ఎకరాకు రూ.10 వేల సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. అన్నదాతలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న ఆప్యాయతకు రైతుబంధు నిదర్శమని చెప్పారు. రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీటి సరఫరాతో రైతుల కష్టాలు తీరుస్తున్నామని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలను కొనసాగిస్తున్నారన్నారు.
ఖర్చు ఎంతైనా రైతు నష్టపోకూడదన్నది కేసీఆర్ ఆలోచన అని కాళేశ్వరంతో ఒక్క ఎకరా సాగులోకి రాలేదంటూ విషం కక్కిన విపక్షాలు, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు బియ్యం సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలను చూసైనా కళ్లు తెరవాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయడంతో పాటు, కాళేశ్వరం నిర్మాణంతో అందుబాటులోకి వచ్చిన సాగునీటితో అత్యధిక వరిధాన్యం ఉత్పత్తి సాధ్యమయిందన్నారు. బియ్యం సరఫరాపై కేంద్రం చేతులు ఎత్తేస్తే పొరుగు రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని, రాష్ట్ర వ్యవసాయ విధానాలు దేశాన్ని ఆకర్షిస్తున్నాయన్నారు.