warangal RTC Income: సంక్రాంతి పండుగకు ఆర్టీసీకి కాసుల వర్షం, వారంలో వరంగల్ రీజియన్ కు రూ.16.47 కోట్ల ఆదాయం-rtc receives a shower of money for sankranti festival warangal region earns rs 16 47 crore in revenue in a week ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Rtc Income: సంక్రాంతి పండుగకు ఆర్టీసీకి కాసుల వర్షం, వారంలో వరంగల్ రీజియన్ కు రూ.16.47 కోట్ల ఆదాయం

warangal RTC Income: సంక్రాంతి పండుగకు ఆర్టీసీకి కాసుల వర్షం, వారంలో వరంగల్ రీజియన్ కు రూ.16.47 కోట్ల ఆదాయం

HT Telugu Desk HT Telugu
Jan 17, 2025 09:48 AM IST

warangal RTC Income: వరంగల్ ఆర్టీసీకి సంక్రాంతి పండుగ కాసుల వర్షాన్ని కురిపించింది. సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో దాదాపు వారం రోజుల పాటు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించగా.. గతంతో పోలిస్తే ఈసారి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది.

వరంగల్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ
వరంగల్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ

warangal RTC Income: సంక్రంతి సీజన్‌ తెలంగాణ ఆర్టీసీకి కాసుల వర్షం కురిసింది. వరంగల్‌ రీజియన్‌లో ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు వరంగల్ రీజియన్ నుంచి 927 ప్రత్యేక బస్సులు నడవగా.. మొత్తంగా రూ.16.47 కోట్ల ఆదాయం వచ్చింది.

ఏడు రోజుల్లో 16.47 కోట్ల ఆదాయం

వరంగల్ రీజియన్ పరిధిలో హనుమకొండ, వరంగల్1, వరంగల్ 2, పరకాల, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, నర్సంపేట, తొర్రూరు .. ఇలా మొత్తం 9 డిపోలు ఉండగా.. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది.

వరంగల్ రీజినల్ మేనేజర్ విజయభాను ఆదేశాల మేరకు పండుగ నేపథ్యంలో మొత్తంగా 927 బస్సులు 26.61 లక్షల కిలోమీటర్ల మేర నడిపించగా.. వారం రోజుల సమయంలో మొత్తంగా 26.42 లక్షల మంది ప్రయాణించారు. అందులో రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించగా.. ఓవరాల్ గా 16.30 లక్షల మంది మహిళలు ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారు.

ఇదిలా ఉంటే వరంగల్ రీజియన్ కు సాధారణ రోజుల్లో ప్రతి రోజు రూ.2 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా.. కేవలం ఈ ఏడు రోజుల్లో రూ.16.47 కోట్ల ఆదాయం రావడం గమనార్హం. ఇందులో మహాలక్ష్మీ పథకం ద్వారా ప్రయాణించిన 16.30 లక్షల మంది నుంచి రూ.7.6 కోట్ల ఆదాయం రాగా.. టికెట్ ఛార్జీలు చెల్లించి ప్రయాణించిన 10.12 లక్షల మంది నుంచి రూ.8.86 కోట్ల లాభం వచ్చింది.

వరంగల్ 2 డిపో టాప్

వరంగల్ రీజియన్ పరిధిలోని తొమ్మిది డిపోల్లో అత్యధికంగా వరంగల్ – 2 డిపో నుంచే ఆదాయం సమకూరింది. వరంగల్ 2 డిపో నుంచి బస్సులు 4.82 లక్షల కిలోమీటర్లు బస్సు సర్వీసులు నడవగా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చింది. వరంగల్ 1 డిపో నుంచి బస్సులు 3.72 లక్షల కిలో మీటర్లు నడవగా రూ.2.26 కోట్ల లాభం వచ్చింది.

హనుమకొండ డిపో నుంచి 1.98 కోట్లు, జనగామ డిపో నుంచి 1.90 కోట్లు, తొర్రూరు నుంచి 1.84 కోట్లు, భూపాలపల్లి డిపో నుంచి రూ.1.64 కోట్లు, నర్సంపేట డిపో నుంచి రూ.1.63 కోట్లు, పరకాల డిపో నుంచి రూ.1.21 కోట్లు, మహబూబాబాద్ డిపో నుంచి 1.13 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఇదిలాఉంటే హనుమకొండ డిపో పరిధిలో నడిచిన బస్సుల్లో అత్యధికంగా 4.36 లక్షల మంది ప్రయాణం చేయగా.. అత్యల్పంగా తొర్రూరు డిపో నుంచి 2.43 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారు.

కాగా సమష్టి కృషి తోనే ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు నడిపించామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. రద్దీ రూట్లపై ఎక్కువ ఫోకస్ పెట్టి బస్సులు తిప్పినట్లు పేర్కొంటున్నారు. కాగా ఆర్టీసీకి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరడంతో ఆఫీసర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner