Attack on RTC Driver: మహబూబాబాద్‌లో హారన్ కొట్టినందుకు ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి, కేసు నమోదు
Attack on RTC Driver: రన్నింగ్ లో ఉన్న ఆర్టీసీ బస్సుకు అడ్డుగా వచ్చినందుకు డ్రైవర్ హారన్ కొట్టడంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి సదరు డ్రైవర్ ను చితకబాదాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Attack on RTC Driver: రన్నింగ్ లో ఉన్న ఆర్టీసీ బస్సుకు అడ్డుగా వచ్చినందుకు డ్రైవర్ హారన్ కొట్టడంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి సదరు డ్రైవర్ ను చితకబాదాడు. దీంతో బాధిత డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు యువకులపై గురువారం కేసు నమోదు చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో చోటుచేసుకుంది.

స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. కోరుట్ల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు బుధవారం సాయంత్రం భద్రాచలం నుంచి కోరుట్లకు తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలో మహబూబాబాద్ లోని బస్టాండ్ కు వెళ్తుండగా, ఓం ప్రకాశ్ అనే వ్యక్తి, తన స్నేహితుడితో కలిసి వెళ్తూ బైక్ తో బస్సుకు అడ్డుగా వచ్చాడు.
దీంతో బస్సు డ్రైవర్ దండి శ్రీనివాస్ బైక్ పక్కకు తప్పుకోవాల్సిందిగా హారన్ కొట్టాడు. బండి సైడ్ కు తీసి, బస్సుకు దారి ఇవ్వాల్సిన ఓం ప్రకాశ్ ఆవేశంతో ఊగిపోయాడు. తననే తప్పుకోమని హారన్ కొడతవా అంటూ బైక్ ను అక్కడే రోడ్డు మీద నిలిపేసి బస్సు డ్రైవర్ తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం ఆగ్రహంతో ఇద్దరూ కలిసి డ్రైవర్ శ్రీనివాస్ పై దాడికి పాల్పడ్డారు.
దీంతో బస్సులో ఉన్న కొందరు ప్రయాణికులు వారించే ప్రయత్నం చేయగా, మహిళలని చూడకుండా వారిపై దురుసుగా ప్రవర్తించారు. ఇద్దరు యువకులు రాద్ధాంతం చేయడంతో బస్సు బస్టాండ్ లోనే దాదాపు నాలుగు గంటల పాటు నిలిచి పోయింది. ఫలితంగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కాగా తనపై అకారణంగా దాడి చేశారంటూ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కొద్దిరోజుల కిందట వరంగల్ లో..
కొద్దిరోజుల కిందట వరంగల్ నగరంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వరంగల్ నగరంలోని శంభునిపేట జంక్షన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకోగా.. హారన్ కొట్టారనే కారణంతో కారు డ్రైవర్ పై కొంతమంది యువకులు దారుణంగా దాడి చేసి పరాయ్యారు.
వరంగల్ కు చెందిన జాటోతు నాగన్న అనే కారు డ్రైవర్ జూన్ 25వ తేదీ సాయంత్రం కారులో శంభునిపేట జంక్షన్ మీదుగా వెళ్తుండగా, సడెన్ గా ఓ బైక్ కారుకు అడ్డుగా వచ్చింది. దీంతో నాగన్న వెంటనే హారన్ కొట్టాడు. దీంతో బైక్ పై వచ్చిన వ్యక్తులు చిర్రెత్తిపోయారు. బైక్ ఆపేసి కారు డ్రైవర్ నాగన్నతో వాదనకు దిగారు.
హారన్ ఎందుకు కొడుతున్నావంటూ నాగన్నపై ఫైర్ అయ్యారు. దీంతో ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుండగానే దాడికి పాల్పడ్డారు. శంభునిపేట జంక్షన్ వద్దే ఈ ఘటన జరగగా, అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఈ దాడి ఘటనను సెల్ ఫోన్ లో వీడియా తీశారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. అనంతరం బాధితుడు నాగన్న మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)