SLBC Latest Update : సాంకేతిక సమస్యలతో ఆగిపోయిన రోబో రెస్క్యూ.. మరోసారి రంగంలోకి కాడవర్ డాగ్స్
SLBC Latest Update : ఎస్ఎల్‌బీసీ సొరంగంలో 21వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలు కారణాలతో రోబో రెస్క్యూ ఆగిపోయింది. దీంతో మళ్లీ కాడవర్ డాగ్స్‌ను రంగంలోకి దింపారు. పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని.. సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది చెబుతున్నారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో 21వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే.. పలు సాంకేతిక సమస్యలతో రోబో రెస్క్యూ ఆగిపోయింది. చివరి 50 మీటర్ల వద్ద ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్న సిబ్బంది చెబుతున్నారు. మృతదేహాల గుర్తింపు కోసం మరోసారి కాడవర్ డాగ్స్‌ను రంగంలోకి దింపనున్నారు. అటు టీబీఎం శిథిలాల కట్టింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది.
ప్రమాద స్థలానికి రోబో..
అన్వీ రోబోటిక్స్ సంస్థకు చెందిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను ప్రమాద స్థలానికి తీసుకువచ్చారు. రోబో ద్వారా టన్నెల్ లోపల ఉన్న శిథిలాలను తొలగించడం, భూమిని తవ్వడం వంటి సహాయక చర్యలు చేపట్టారు. ఈ రోబో గంటకు 5000 క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించగలదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు రోబోను పరిశీలించిన అనంతరం.. అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోతో విజయ్, అక్షయ్ తమ బృందంతో కలిసి లోకో ట్రైన్ ద్వారా టన్నెల్ లోపల ప్రమాద స్థలానికి వెళ్లారు.
ప్రాణ నష్టం జరగకుండా..
ఎస్ఎల్బీసీ ప్రమాద స్థలంలో చేపడుతున్న సహాయక చర్యలలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన సమీప ప్రదేశాలను 50 మీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాన్ని డీ2 గా 20 మీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాన్ని డి1గా క్రోడీకరించుకున్న రెస్క్యూ బృందాలు.. కాడవర్ డాగ్స్ తిరిగిన ప్రదేశాల్లో తవ్వకాలు వేగంగా జరుపుతున్నారు.
8 మంది గల్లంతు..
సొరంగం పైకప్పు కూలిపోవడంతో 8 మంది కార్మికులు గల్లంతయ్యారు. ఈ సొరంగాన్ని భూమి ఉపరితలం నుంచి సుమారు 400 మీటర్ల లోతులో నిర్మిస్తున్నారు. 43 కిలోమీటర్ల ఈ టన్నెల్‌లో 'ఇన్‌లెట్, ఔట్‌లెట్' మినహా.. మధ్యలో ప్రత్యామ్నాయ మార్గమేదీ లేదు. ప్రమాదం 13.9 కిలోమీటర్ల పాయింట్ వద్ద జరిగింది. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టన్నెల్ వద్దే ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
డేంజర్ జోన్..
ప్రభుత్వ అనాలోచిత చర్యలతో ప్రమాదకర జోన్ వద్ద టీబీఎం మరమ్మతులు చేస్తుండగానే ప్రమాదం జరిగిందని.. బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్రమాదం జరిగిన చోటు నుంచి 500 మీటర్లలోనే మరో డేంజర్ జోన్ ఉన్నట్టు తెలిసింది. ఇలాంటి సమయంలో మధ్యలో మరో మార్గం ఉంటే ప్రయోజనం ఉంటుందని.. నిపుణులు సూచించారు. కానీ.. పనులు చేసే సంస్థ ఆ విధంగా చర్యలు చేపట్టలేదనే ఆరోపణలు ఉన్నాయి.