Khammam Crime: మొదటి భార్యను ఊరికి పంపి,రెండో భార్యను కడతేర్చిన ఆర్‌ఎంపీ డాక్టర్, గుండెపోటంటూ డ్రామా-rmp doctor sent first wife to village and married the second wife and killed her ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khammam Crime: మొదటి భార్యను ఊరికి పంపి,రెండో భార్యను కడతేర్చిన ఆర్‌ఎంపీ డాక్టర్, గుండెపోటంటూ డ్రామా

Khammam Crime: మొదటి భార్యను ఊరికి పంపి,రెండో భార్యను కడతేర్చిన ఆర్‌ఎంపీ డాక్టర్, గుండెపోటంటూ డ్రామా

HT Telugu Desk HT Telugu
Published Jun 18, 2024 12:48 PM IST

Khammam Crime: మొదటి భార్యను ఊరికి పంపి రెండో భార్యను కడతేర్చిన ఆర్ఎంపీ వైద్యుడి ఘాతుకం ఖమ్మంలో వెలుగు చూసింది.

ఖమ్మంలో భార్యను గొంతు నులిమి చంపేసిన ఆర్‌ఎంపీ డాక్టర్
ఖమ్మంలో భార్యను గొంతు నులిమి చంపేసిన ఆర్‌ఎంపీ డాక్టర్

Khammam Crime: మొదటి భార్యను ఊరికి పంపి రెండో భార్యను కడతేర్చాడు. ఆపై ఆమె గుండెపోటుతో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఖమ్మంలో ఆర్ఎంపీ వైద్యుడి ఘాతుకం స్థానికంగా కలకలం రేపింది.

అతను ఒక ఆర్ఎంపీ వైద్యుడు. ఒక వివాహం జరిగి ఇద్దరు పిల్లలు కలిగాక రెండో పెళ్లి చేసుకోవాలన్న కోరిక కలిగింది. అనుకున్నదే తడవుగా మొదటి భార్య ఉండగానే ఆమెను ఒప్పించి, మెప్పించి రెండో వివాహం చేసుకున్నాడు. అయితే కొన్నేళ్లకే మీజు తీరిందో ఏమో.? చడీ చప్పుడు కాకుండా ఆమెను హతమార్చి గుండె పోటుతో మరణించినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

ఖమ్మం జిల్లా కేంద్రంలోని వికలాంగుల కాలనీలో సోమవారం రాత్రి చోటు చేసుకున్న హత్య సంచలనం రేపింది. ఆర్ఎంపీ వైద్యుడిగా పని చేస్తున్న మల్లేష్ స్థానికంగానే ఉంటూ అక్కడి ప్రజలకు ప్రధమ చికిత్సలు చేస్తుంటాడు. అయితే భార్య, పిల్లలు కూడా ఉన్న అతనికి రెండో పెళ్లి చేసుకోవాలనే ఆశ కలగడంతో మూడేళ్ళ కిందట కలమ్మ అనే మహిళను వివాహం చేసుకున్నాడు.

రెండో పెళ్లి తర్వాత ఇద్దరు భార్యలను కూడా ఒకే ఇంట్లో ఉంచి పోషిస్తున్నాడు. ఇలా సజావుగా సంసారం సాగుతున్న క్రమంలో మల్లేష్‌కు రెండో భార్యకు మధ్య ఇటీవల చిన్నపాటి గొడవలు అవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో సోమవారం రాత్రి మొదటి భార్యను కావాలనే పథకం ప్రకారం ఊరికి పంపించిన మల్లేష్ ఇంట్లో ఉన్న రెండో భార్యను నిద్రలో గొంతు నులిమి చంపేశాడు.

ఆ తరవాత ఏమీ ఎరుగనట్లు తన భార్య గుండె పోటుతో మరణించిందని చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. దీంతో అనుమానం వచ్చిన మృతురాలి బంధువులు గట్టిగా నిలదీయడంతో తానే చంపానని ఒప్పుకున్నాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

భార్య ఉండగానే రెండో పెళ్లిపై కోరికతో మరో మహిళను వివాహమాడిన ఆర్ఎంపీ వైద్యుడు మల్లేష్ చివరికి కొన్నేళ్ల కాపురం తర్వాత ఆమె ప్రాణాలనే పొట్టన పెట్టుకున్నాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి)

Whats_app_banner