Revanth Vs Talasani: యాదవ జేఏసీ ఛలో గాంధీభవన్ ఉద్రిక్తం.. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై దుమారం
Revanth Vs Talasani: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యాదవ జేఏసీ చేపట్టిన ఛలోగాంధీభవన్ ఉద్రిక్తతకు దారి తీసింది. రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ ఇందిరా పార్క్ నుంచి గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.
Revanth Vs Talasani: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు వ్యతిరేకంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. రేవంత్ క్షమాపణలు చెప్పాలంటూ యాదవ జేఏసీ ఇచ్చిన గడువు ముగియడంతో గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇందిరా పార్క్ నుంచి గాంధీభవన్‌కు నిరసనగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో గాంధీ భవన్ వద్ద భారీ ఎత్తున పోలీసులు మొహరించారు. అటు ఇందిరా పార్క్ వద్ద ముట్టడికి బయలుదేరిన యాదవ జేఏసీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు తలసాని-రేవంత్ రెడ్డి మధ్య జరిగిన మాటల యుద్దంలో ఎవరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని గొల్లకురుమలు డిమాండ్ చేయడం సరికాదంటున్నారు. తలసానిని మాత్రమే ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారని, తలసాని దూషించిన తర్వాతే రేవంత్ రెడ్డి స్పందించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
యాదవులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, కర్ణాటక సిఎం సిద్దరామయ్య యాదవుడనే సంగతి గుర్తుంచుకోవాలంటున్నారు. తలసాని శ్రీనివాస యాదవ్ చేతకానితనానికి కులాన్ని అడ్డం పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాస యాదవ్ తప్పుడు మాటలు మాట్లాడటం వల్ల తలెత్తిన వివాదమని, దానిని కులానికి సంబందం ఏమిటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.
తెలంగాణలో గొల్ల కురుమలకు గొర్రెలు ఇస్తామని ప్రభుత్వం స్కీం పెట్టి, ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు మోసం చేస్తున్నాడని, గొల్లలకు పథకాన్ని వర్తింప చేయలేక, తన చేతకానితనాన్ని రేవంత్‌పై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. యాదవ జేఏసీ తలసాని ట్రాప్‌లో చిక్కుకోవద్దని, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్ని రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రేవంత్‌రెడ్డి తిట్టింది తలసానిని కాబట్టి అది వారిద్దరికి సంబంధించిన వ్యవహారమన్నారు.
ఏం జరిగిందంటే…..
ఇటీవల హైదరాబాద్ లో కాంగ్రెస్ యువ సంఘర్షణ సభ నిర్వహించింది. ఈ సభకు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకగాంధీ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుతో ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు.
“ఓ పొట్టోడు ఎమ్మెల్యేలను, మంత్రులను అందరినీ వాడు, వీడు అని మాట్లాడుతున్నాడన్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు.. పిసికితే ప్రాణం పోతది” అంటూ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి తలసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా తాత, నాన్నమ్మ, నా నాన్న అంటూ కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఉద్దేశించి తలసాని విమర్శలు చేయడంతో రేవంత్ రెడ్డి కూడా ఘాటు స్పందించారు. మంత్రి తలసానిపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఓ మీటింగ్ కు హాజరైన రేవంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం సరికాదన్నారు.
పాన్ పరాగ్ లు నమిలే వ్యక్తి తనపై మాట్లాడడం సరికాదన్నారు. పశువుల కాపరిగా ఉన్నాడు కాబట్టి తలసానికి పేడ పిసకడం అలవాటు అయినట్లుందని విమర్శించారు. అందుకే తనను పిసుకుతాను అంటున్నారని రేవంత్ సెటైర్లు వేశారు. చిన్ననాటి నుంచి పేడ పిసకడం అలవాటు అయినట్టుందని ఎద్దేవా చేశారు. బాధ్యతాయుతంగా మాట్లాడాలని, రాజకీయాలలో ఆదర్శంగా ఉండడం నేర్చుకోవాలన్నారు.
అరటిపళ్ల బండి దగ్గర మేక నమిలినట్టు గుట్కాలు నమిలే వ్యక్తులు కూడా తన గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అంత పిసుకుడు కోరిక ఉంటే, ఎక్కడికి ఎప్పుడు రావాలో చెబితే తాను వస్తానన్నారు. అప్పుడు ఎవరు ఏం పిసుకుతారో అర్థమవుతుందని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. సీఎం కేసీఆర్ కాళ్లు పిసికినట్టు అనుకుంటున్నారేమో రేవంత్ రెడ్డిని పిసకటం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు యాదవ సామాజిక వర్గాన్ని అవమానించేలా ఉన్నాయంటూ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి రేవంత్ స్పందించకపోవడంతో గాంధీభవన్ ముట్టడికి సిద్ధమయ్యారు.
సంబంధిత కథనం