Revanth Reddy : ఢిల్లీలో బిజీబిజీగా రేవంత్ రెడ్డి - ప్రమాణస్వీకార సమయంలో మార్పు
Telangana New CM Revanth Reddy : గురువారం రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తొలుత ఉదయం అనున్నప్పటికీ… మధ్యాహ్నం 1:04 గంటలకు సమయాన్ని మార్చారు.
Telangana New CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ నెల 7న రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే తొలుత ఉదయం 10.28 గంటలకు చేయాలని నిర్ణయించారు… ఈ సమయాన్ని మార్చారు. గురువారం మధ్యాహ్నం 1:04 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
మరోవైపు ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముందుగా కేసీ వేణుగోపాల్, పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు ప్రియాంకగాంధీ, సోనియాగాంధీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు.
రేపటి ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్షించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో పని చేసి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను సీఎస్ ఆదేశించారు. అగ్నిమాపక యంత్రాలు, అగ్నిమాపక శకటాలను వేదిక దగ్గర ఉంచాలని దిశానిర్దేశం చేశారు.
సీఎంగా రేవంత్ రెడ్డి పేరు ప్రకటించడంతో ఆయన నివాసం వద్ద భద్రత పెంచారు. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు.
రేవంత్ రెడ్డి ప్రస్థానం
అనుముల నర్సింహారెడ్డి,రామ చంద్రమ్మ దంపతులకు నవంబర్ 8,1969 న అనుముల రేవంత్ రెడ్డి జన్మించారు. రేవంత్ రెడ్డి స్వస్థలం కొండ రెడ్డి పల్లి గ్రామం, వంగురు మండలం,నాగర్ కర్నూల్ జిల్లా.రేవంత్ రెడ్డి ఏవీ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఆయనకు భార్య గీతా రెడ్డి, కుమార్తె నైమిష రెడ్డి ఉన్నారు.
• 2007 జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలను మట్టికరిపించి ఉమ్మడి మహబూబ్ నాగర్ జిల్లాలోని మిడ్జిల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి తొలి విజయంతోనే అందరి చూపునూ తన వైపు తిప్పుకున్నారు.
• ఆ తరువాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరమని ఆహ్వానించినా.....రేవంత్ రెడ్డి సున్నితంగా ఆహ్వానాన్ని తిరస్కరించి చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో చేరారు.
• 2009లో కొడంగల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి కాంగ్రెస్ సీనియర్ నేత రావులపల్లి గుర్నాథ్ రెడ్డి పై విజయం సాధించారు.
• ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి, 2017 వరకు టీడీపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా కొనసాగి సభలో అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించారు.
• 2017 అక్టోబర్ నెలలో టీడీపీకి రాజీనామ చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరిన అనంతరం మూడేళ్ల పాటు ప్రజా సమస్య లే అజెండాగా ముందుకు సాగారు.
• రేవంత్ ప్రతిభను, జనంలో ఆయనకు ఉన్న ఆదరణను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం... ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది.
• 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన......ఆ తరువాత వచ్చిన పార్లిమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి ఎంపిగా ఎన్నికయ్యారు.
• జూన్ 26,2021 న కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా నియమించింది. 2021 జూలై 7న నాటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాకూర్ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేశారు.
• కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి దక్కిందని కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అసంతృప్తితో ఉన్న అధిష్ఠానం సహకారంతో నేతలందరినీ ఒకతాటిపైకి తెచ్చారు.
• ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అందరినీ కలుపుకుని ప్రచారం చేశారు. ఫలితంగా రాష్ట్రంలో కాంగ్రెస 64 స్థానాలను దక్కించుకొని విజయపతాక ఎగరవేసింది.
• తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వడానికి ముఖ్య కారకుడిగా నిలిచిన రేవంత్ రెడ్డినే సీఎం అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం.