Revanth Reddy: ఆంధ్రాలో నష్టపోతామని తెలిసినా సోనియా మాట మీద నిలబడ్డారు-రేవంత్‌రెడ్డి-revanth reddy said that sonia kept her word even though she knew that she would lose completely in andhra ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy: ఆంధ్రాలో నష్టపోతామని తెలిసినా సోనియా మాట మీద నిలబడ్డారు-రేవంత్‌రెడ్డి

Revanth Reddy: ఆంధ్రాలో నష్టపోతామని తెలిసినా సోనియా మాట మీద నిలబడ్డారు-రేవంత్‌రెడ్డి

Sarath chandra.B HT Telugu
Nov 03, 2023 12:16 PM IST

Revanth Reddy: కేసీఆర్‌ దొంగ దీక్షలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని, సోనియా గాందీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని రేవంత్‌ రెడ్డి అన్నారు.

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

Revanth Reddy: కేసీఆర్‌ దొంగ దీక్షలకు భయపడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదని 2004లో కరీంనగర్‌లో ఇచ్చిన మాటను సోనియా గాంధీ నిలబెట్టు కోవడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

yearly horoscope entry point

తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ, సమానత్వం,సామాజిక న్యాయం ఓ వ్యక్తి పాదాల కింద నలిగిపోతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ లెక్కల జోలికి వెళ్లకుండా ఆంధ్రాలో 175అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలు ఉన్న ఆంధ్రాకు 119 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంటు స్థానాలు ఉన్న తెలంగాణ మధ్య రాష్ట్రం కోసం కొట్లాట జరిగితే రాజకీయ ప్రయోజనాలు ఏమాత్రం లేకపోయినా నష్టం కలుగుతుందని తెలిసినా, తెలంగాణ ప్రాంత ప్రజల పోరాటంలో న్యాయం, ధర్మం ఉందని తెలిసి రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించారన్నారు.

2004లో కరీంనగర్‌లో తెలంగాణ ప్రజల అకాంక్షను గుర్తించిన సోనియా, ఏపీలో తీవ్రమైన నష్టం జరుగుతుందని, రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబు వేస్తే జరిగిన నష్టం తరహాలో ఆంధ్రాలో మొక్క కూడా మొలవదని, తెలంగాణ తర్వాత ఆంధ్రాలో వార్డు మెంబర్ కూడా మిగలరని తెలిసినా, కాంగ్రెస్‌ నిర్ణయం రాజకీయ అణుబాంబు అవుతుందని తెలిసినా రాష్ట్ర విభజనలో వెనక్కి తగ్గలేదన్నారు.

రాజకీయ లెక్కలు వేస్తేనో, కేసీఆర్‌ దీక్షలు చేస్తేనో తెలంగాణ రాలేదన్నారు. కుటుంబ సభ్యుడి ప్రాణం విలువ ఎంతో, తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ఎంత విలువ అంతేనని సోనియా భావించారన్నారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి, కేసీఆర్‌ ప్రాణాలకు ఎలాంటి తేడా లేదన్నారు. ప్రాణాలను లెక్కబెడితే కేసీఆర్‌ 1201వ ప్రాణం అవుతుందని అంతకు మించి ఏమి ఉండేది కాదని, అయినా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రఏర్పాటుకు కట్టుబడిందన్నారు.

మట్టికి పోయినా ఇంకొకరు పోవాలనే ఆలోచన కేసీఆర్‌ది అన్నారు.కేసీఆర్‌ ఏమి చెప్పాడు, ఏమి చేశాడన్నది గమనించాలన్నారు. నీళ్లు, నిధులు, అభివృద్ధి పేదలసంక్షేమం, అభివృద్ధి వచ్చాయో లేదో ఆలోచించాలన్నారు. ఆఖరికి రాష్ట్ర పేరును కూడా పార్టీ పేరుకు దగ్గరగా ఉండేలా టిజి నుంచి టిఎస్‌ అని మార్చారని ఆరోపించారు.

రాష్ట్ర అధికారిక ముద్రలో కూడా రాచరిక పోకడలు ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణలో త్యాగాలతో కూడిన అధికారిక చిహ్నం రాచరిక పోకడలతో ఉందన్నారు. త్యాగంతో కనిపించాల్సిన తెలంగాణ తల్లి స్థానంలో శ్రీమంతుల తల్లిని చూపిస్తున్నార్నారు.

రాష్ట్రం పేరును టీజీ నుంచి టిఎస్‌కు మార్చడంలో కూడా రాచరిక ధోరణే కేసీఆర్‌కు ఉందన్నారు. ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ గెలిచినా కేసీఆర్‌ ధోరణి మాత్రం రాచరికంలోనే సాగిందన్నారు. గెలిచాక ఓడిన వారిని జైళ్లలో మగ్గాలనే ధోరణితో కేసీఆర్‌ వ్యవహరించారని ఆరోపించారు. . ప్రతిపక్ష నాయకుడికి సభాపక్ష నాయకుడికి సభలో సమాన అవకాశాలు గతంలో ఉండేదని గుర్తు చేశారు.

51శాతం ఉన్న పాలక పక్షం నిర్ణయాలు చేయాలని, ఆ నిర్ణయాల్లో లోపాలను లేవనెత్తడం, ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత అన్నారు. ప్రాథమిక సూత్రాలు, హక్కులను కేసీఆర్ కాలరాశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే అన్ని వర్గాల ప్రజల హక్కుల్ని నిరంకుశంగా అణిచివేశారన్నారు. అందరిని వర్గ శత్రువులుగా చూడటం మొదలు పెట్టి అందరిని భయపెట్టాడన్నారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి భయంతో బతికే పరిస్థితిని తీసుకొచ్చారన్నారు. 1994నుంచి 2014 వరకు ఇరవై ఏళ్ల పాటు వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నా ముఖ్యమంత్రులు ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయంలో అందుబాటులో ఉండి సామాన్యులకు అందుబాటులో ఉండేవారన్నారు. రోశయ్య సైతం ఇదే అవలంబించారని గుర్తు చేశారు.

సచివాలయంలో సి బ్లాక్‌ ముందు జర్నలిస్టులు ఉండటానికి అవకాశం ఉండేదని ఇప్పుడు ఎందుకు ఆ అవకాశం లేదన్నారు. ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు మంత్రులకు ఉన్న సదుపాయాలు జర్నలిస్టులకు సచివాలయంలో ఉండేవని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపక్షాలను, మీడియాను సెక్రటెరియట్‌లోకి రానివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Whats_app_banner