Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అనగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకొస్తారు : రేవంత్ రెడ్డి
Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అనగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకొస్తారని.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రవంచ గ్రామంలో పర్యటించిన రేవంత్.. 4 కొత్త పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా కొడంగల్‌కు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా.. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులను చంద్రవంచ గ్రామంలో ప్రారంభిస్తున్నామని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 2022 వరకు.. కొడంగల్ నియోజకవర్గానికి జరగాల్సిన న్యాయం జరగలేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో కష్టపడి తనను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే.. సోనియా గాంధీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశారని చెప్పారు.

సమయం ఇవ్వలేకపోతున్నా..
'ముఖ్యమంత్రి అయ్యాక కొడంగల్‌కు ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్న. భూమికి, విత్తుకు ఎంత అనుబంధమో.. కాంగ్రెస్‌కు రైతులకు అంత అనుబంధం ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు.. బకాయిలను రద్దు చేశారు. యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ దేశ వ్యాప్తంగా రూ.72 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశారు. ఆనాటి ప్రభుత్వం వ్యవసాయం అంటే దండుగ కాదు.. పండుగ అని నిరూపించింది' అని సీఎం వ్యాఖ్యానించారు.
రుణమాఫీ చేసి చూపించాం..
'రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చేసి చూపించాం. ఆగస్టు 15న 22.50 లక్షల రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసి వారిని రుణవిముక్తులను చేశాం. మొదటి విడత రైతు భరోసాలో భాగంగా దాదాపు 7 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో వేశాం. దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా మొదటి ఏడాదిలోనే 55,145 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ తోపాటు.. 50 లక్షల పేదల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం' అని రేవంత్ వివరించారు.
ఆడబిడ్డల కోసం..
'తెలంగాణలో 50 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. 120 కోట్ల ఆడబిడ్డలు 13 నెలలుగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం చేశారు. ఆడబిడ్డల ఉచిత ప్రయాణం కోసం ఇప్పటి వరకు ఆర్టీసీకి రూ.4000 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. పేదలను ఇంకా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో రైతు భరోసా సాయం 5000 రూపాయలు ఉంటే.. ఈ సారి ఎకరానికి ఏడాదికి 12 వేల రూపాయలకు పెంచాం. ప్రతి ఏడాది రూ.20 వేల కోట్లను 70 లక్షల మందికి రైతు భరోసా కింద చెల్లిస్తాం' అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
నా పాదయాత్రలో..
'లక్షలాది రైతులను ఆదుకోవడం కోసం.. చంద్రవంచ గ్రామం నుంచి రైతు భరోసాను ప్రారంభిస్తున్నాం. నా పాదయాత్రలో అనేక మంది భూమి లేని పేదలు తమకు సాయం అందించాలని కోరారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని పేదలకు ప్రతి ఏడాది 12 వేల రూపాయలను చెల్లిస్తాం. 10 లక్షల కుటుంబాలను ఈ కార్యక్రమం ద్వారా ఆదుకుంటాం. రాత్రి 12 గంటల తర్వాత వారి ఖాతాల్లో డబ్బులు పడతాయి' అని రేవంత్ స్పష్టం చేశారు.
వైఎస్సార్ గుర్తొస్తారు..
'ఇందిరమ్మ ఇళ్లు అనగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకువస్తారు. 2004 నుంచి 2014 వరకు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. ఒక్క కొడంగల్‌లో 34 వేల ఇళ్లు పేదలకు ఇప్పించగలిగాం. కొడంగల్‌కు పెద్ద ఎత్తున ఇళ్ల కేటాయింపు పైన కేసీఆర్ కు కడుపు మండి.. సీబీసీఐడీ విచారణ వేశారు. కేసీఆర్ హయాంలో ఎవరికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు. మార్చి 31 వరకు కొడంగల్ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వబోతున్నాం. కొడంగల్ లో ప్రతి పేదవాడిని ఇంటిని వాడిని చేసే బాధ్యత మీ సోదరుడిగా తీసుకుంటా' అని రేవంత్ హామీ ఇచ్చారు.
ప్రజలే పాలకులు..
'రాష్ట్రంలో కొత్తగా 40 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇస్తాం. రేషన్ కార్డు పేదవాడి గుర్తింపు. గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. గ్రామ సభలు పెట్టి అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకున్నాం. గత పదేళ్లలో ఎప్పుడైనా గ్రామాల్లో అధికారులను చూశారా. ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలనే అధికారులను గ్రామాలకు పంపించాం. ప్రజల దగ్గరకే ఈ రోజు ముఖ్యమంత్రి స్వయంగా వచ్చారు. ప్రజలే రాజులు, పాలకులు. మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రైనా, మంత్రైనా ప్రజల దగ్గరకే వెళ్లాలన్న మార్పు తీసుకువచ్చాం' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.