T Congress : పైసలు ఉంటే ఎన్నికల్లో గెలవరు.. ప్రజాబలం ఉంటేనే గెలుస్తారు : రేవంత్‌ రెడ్డి-revanth reddy interesting comments on telangana youth congress ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  T Congress : పైసలు ఉంటే ఎన్నికల్లో గెలవరు.. ప్రజాబలం ఉంటేనే గెలుస్తారు : రేవంత్‌ రెడ్డి

T Congress : పైసలు ఉంటే ఎన్నికల్లో గెలవరు.. ప్రజాబలం ఉంటేనే గెలుస్తారు : రేవంత్‌ రెడ్డి

Basani Shiva Kumar HT Telugu
Published Feb 14, 2025 05:46 PM IST

T Congress : పార్టీ కోసం కష్టపడిన వారికే భవిష్యత్తు ఉంటుందని.. రేవంత్ మరోసారి స్పష్టం చేశారు. కొందరు క్షేత్రస్థాయిలో పనిచేయకుండా.. నేతల చుట్టూ తిరుగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పారు. ప్రజాబలం ఉంటేనే గెలుస్తారని స్పష్టం చేశారు.

రేవంత్‌ రెడ్డి
రేవంత్‌ రెడ్డి

క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు వస్తాయని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ అభివృద్ధికి కృష్టి చేసిన వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యూత్‌ కాంగ్రెస్‌పై ఉందని వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో జరిగిన యువజన కాంగ్రెస్‌ నేతల ప్రమాణస్వీకార కార్యక్రమానికి రేవంత్ ముఖ్య అతిథిగా హాజరై ఈ కామెంట్స్ చేశారు.

యూత్ కాంగ్రెస్‌దే బాధ్యత..

'పార్టీ కోసం పోరాడిన వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తాం. 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించాం. ప్రతి పేదవాడు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తున్నాం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ బాధ్యత యూత్ కాంగ్రెస్‌పై ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత ఎక్కువగా పాల్గొనాలి' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కష్టపడితేనే ఫలితం..

'కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది. పైసలు ఉంటే ఎన్నికల్లో గెలుస్తామని అనుకుంటారు. కానీ ప్రజాబలం ఉంటేనే గెలుస్తారు. పార్టీ కోసం కష్టపడకుండా కేవలం నాయకుల చుట్టూ తిరిగితే పదవులు రావు. డబ్బులతోనే రాజకీయాల్లో రాణిస్తామని అనుకోవద్దు. గల్లీ నుంచి పోరాడితేనే ఢిల్లీ వరకు ఎదిగే అవకాశం వస్తుంది. నిత్యం ప్రజలతో ఉండాలి. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వారికి భరోసా ఇవ్వాలి' అని రేవంత్ రెడ్డి సూచించారు.

కాకి లెక్కలు చెప్పారు..

'కులగణనపై ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్తాం. రాష్ట్రంలో కులగణన పారదర్శకంగా చేశాం. మైనార్టీల లెక్క ఎలా తీశామని కొందరు ప్రశ్నిస్తున్నారు. బీసీ-ఈ గ్రూప్ కింద 4 శాతం రిజర్వేషన్ ఉంది కాబట్టే మైనార్టీల లెక్క తీశాం. కేసీఆర్ ఒక్కరోజే సర్వే చేసి కాకి లెక్కలు చూపారు. కాకి లెక్కలతో సర్వే చేసి.. మా సర్వే తప్పంటున్నారు. కులగణనపై విపక్షాలది దుష్ప్రచారం మాత్రమే. తెలంగాణ సమాజంలో జీవించే హక్కు కేసీఆర్‌కు లేదు. కేసీఆర్ లాంటివాళ్లు కులగణన సర్వేలో పాల్గొనలేదు. రాష్ట్రంలో కులగణన పారదర్శకంగా చేశాం' అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

మహేష్ క్లాస్..

టీపీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. 'గత ప్రభుత్వం కంటే సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నా.. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మైలేజ్‌ రావడం లేదు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదు. నేతలు, కార్యకర్తలు అలకవీడి పార్టీకోసం పనిచేయాలి' అని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

Basani Shiva Kumar

eMail
Whats_app_banner