Ghanpur Station : పిల్ల కాకులతో నాకెందుకు.. అసలైన వాళ్లనే రమ్మనండి : రేవంత్-revanth reddy fires on harish rao and ktr in station ghanpur meeting ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ghanpur Station : పిల్ల కాకులతో నాకెందుకు.. అసలైన వాళ్లనే రమ్మనండి : రేవంత్

Ghanpur Station : పిల్ల కాకులతో నాకెందుకు.. అసలైన వాళ్లనే రమ్మనండి : రేవంత్

Ghanpur Station : కేసీఆర్‌పై మరోసారి ఫైర్ అయ్యారు సీఎం రేవంత్. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై నిప్పులు చెరిగారు. ఆయన ఏమన్నారో ఓసారి చూద్దాం.

సీఎం రేవంత్

కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకుని అందరినీ ఉసిగొల్పుతున్నారని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధికారంలో పోతే బయటికి రాడా.. బయటికి రానప్పుడు మరి ప్రతిపక్ష హోదా ఎందుకు అని ప్రశ్నించారు. హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులకు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. పిల్ల కాకులతో ఎందుకు.. అసలైన వాళ్లనే రమ్మనండి ఛాలెంజ్ చేశారు. ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదమో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.

పదేళ్లలో దివాళా..

'అది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కట్టించామని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ ఎవరు కట్టించారో హరీష్ రావు చెప్పాలి. ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే కేసీఆర్ కుటుంబం అప్పులపాలు చేసింది. సింగరేణి, విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టారు. పదేళ్లలో దివాళా తీసిన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటన నడిపిస్తున్నాం' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

భయంతో మౌనం..

'ఇందిరమ్మ ప్రభుత్వంలో చెప్పినవే కాకుండా చెప్పని హామీల అమలు కూడా జరిగింది. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తుంది. అసెంబ్లీకి రెండే సార్లు వచ్చిన కేసీఆర్.. నిజాలు ఎక్కడ బయటపెట్టాల్సి వస్తుందనే భయంతో మౌనం వహిస్తున్నారు' అని మంత్రి పొంగులేటి విమర్శించారు. 'కాంగ్రెస్ అంటేనే ఉద్యోగ, ఉపాధి కల్పించడం.. కాంగ్రెస్ అంటేనే విద్యార్హతను పెంచడం.. కాంగ్రెస్ అంటేనే పేదలకు కూడు, గుడ్డ ఇవ్వడం' అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.

అభివృద్ధి పనులు..

స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ. 630.27 కోట్ల అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. రూ.200 కోట్లతో జాఫర్‌గఢ్ మండలంలోని కోనాయాచలం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, రూ.5.5 కోట్లతో ఘన్‌ఫూర్‌లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు, రూ.45.5 కోట్లతో ఘన్‌ఫూర్‌లో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు, రూ.26 కోట్లతో ఘన్‌ఫూర్‌లో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నారు.

మహిళలకు బస్సులు..

రూ.148.76 కోట్లతో దేవాదుల రెండో దశ, 274 ఇండ్లు ఘన్‌పూర్ మండలానికి, 238 ఇండ్లు ధర్మసాగర్, వేలైర్ మండలాలకు, రూ.15 కోట్లతో మల్లన్నగండి నుంచి తాటికొండ, జిట్టగూడెం నుంచి తరిగొప్పుల వరకు రహదారి విస్తరణ, రూ. 1 కోటితో స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎన్పీడీసీఎల్ డివిజనల్ ఆఫీస్ కమ్ ఈఆర్వో ఆఫీస్ భవనం నిర్మాణం, రూ.2 కోట్లతో బంజారా భవన్ నిర్మాణం, రూ.1.76 కోట్లతో కుడా ఆధ్వర్యంలో పెద్దపెండ్యాల గ్రామంలో రోడ్ల విస్తరణ, మహిళా శక్తి కింద ఏడు ఆర్టీసీ బస్సులు మంజూరు (రూ.2.10 కోట్లు), స్వయం సహాయ సంఘాలకు రూ.100 కోట్ల బ్యాంక్ లింకేజ్‌ చెక్కును ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా శక్తి స్టాల్స్‌ను పరిశీలించారు. చేతి అల్లికలతో తయారుచేసిన చిత్రపటాన్ని మహిళా సంఘాల సభ్యులు సీఎంకు అందించారు.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.