Revanth Reddy: డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిన ఊర్లోనే బీఆర్ఎస్ ఓట్లు అడగాలి.. రేవంత్-revanth reddy fires on brs and kcr government during his hath se hath jodo abhiyan padayatra ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Revanth Reddy Fires On Brs And Kcr Government During His Hath Se Hath Jodo Abhiyan Padayatra

Revanth Reddy: డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిన ఊర్లోనే బీఆర్ఎస్ ఓట్లు అడగాలి.. రేవంత్

HT Telugu Desk HT Telugu
Feb 13, 2023 09:36 PM IST

Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్లు కట్టిన ఊర్లో కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందని... డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చిన గ్రామంలో బీఆర్ఎస్ ఓట్లు అడగాలని... రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పాదయాత్రలో భాగంగా మణుగూరు చేరుకున్న ఆయన... మన్మోహన్ సింగ్ ని పొగిడి మళ్లీ కాంగ్రెస్ కి దగ్గరవ్వాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు.

పాదయాత్రలో రేవంత్ రెడ్డి
పాదయాత్రలో రేవంత్ రెడ్డి

Revanth Reddy: డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చిన గ్రామాల్లోనే బీఆర్ఎస్ ఓట్లు అడగాలని... టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని.. బీఆర్ఎస్ కూడా వారు ఇండ్లు కట్టించి ఇచ్చిన ఊర్లోనే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రలో భాగంగా మణుగూరు చేరుకున్న రేవంత్ రెడ్డి... అంబేడ్కర్ సెంటర్ లో కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పినపాకలో అభివృద్ధి పేరుతో పార్టీ మారిన సన్నాసికి సవాల్ విసురుతున్నానని... పినపాకలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చిన ఊర్లోనే బీఆర్ఎస్ ఓట్లు అడగాలని అన్నారు. తన సవాల్ కి సిద్ధమా అని ప్రశ్నించారు.

ట్రెండింగ్ వార్తలు

కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుగా మార్చారన్న రేవంత్ రెడ్డి... ఫిర్యాదు చేసిన తమ పార్టీ కార్యకర్తలపైనే పోలీసులు కేసులు పెడతారా ? అని ఫైర్ అయ్యారు. కబ్జా చేసిన తమ పార్టీ ఆఫీసును తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో... ఇదే పోలీసులతో రేగా కాంతారావుకు బేడీలు వేయించి తమ పార్టీ ఆఫీసు ముందు నుంచి తీసుకెళ్లేలా చేస్తామని హెచ్చరించారు. కాళ్లు విరుగుతాయ్ అని కేసీఆర్ మాట్లాడుతున్నారని... ఎక్కడికి రమ్మంటారో చెప్పాలని అన్నారు. తమ కార్యకర్తలతో వస్తానని.. ఎవరి కాళ్లు విరుగుతాయో తేల్చుకుందామని ఛాలెంజ్ చేశారు. మన్మోహన్ సింగ్ ని పొగిడి మళ్లీ కాంగ్రెస్ కి దగ్గరవ్వాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న రేవంత్... ఇన్నాళ్లు బీజేపీ చంకలో ఉన్న ఆయనని కాంగ్రెస్ నమ్మే ప్రసక్తే లేదని చెప్పారు. కేసీఆర్ కు కాలం చెల్లిందని... ఆయన రద్దైన వెయ్యి నోటు లాంటివారని ఎద్దేవా చేశారు. కాలనాగునైనా కౌగిలించుకుంటాం కానీ కేసీఆర్ ను నమ్మమని... కల్వకుంట్ల కుటుంబంతో కలవమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

"అటు మోదీ, ఇటు కేసీఆర్... తెలంగాణ కష్టాలు తీర్చరు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ కు మాత్రమే ఇక్కడి ప్రజల కష్టాలు తెలుసు. వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీని గెలిపిస్తేనే తెలంగాణ కష్టాలు తీరుతాయి. బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ. బీఆర్ఎస్ దొరల పార్టీ. కాంగ్రెస్ పేదలు, దళిత, గిరిజన, మైనార్టీల పార్టీ. దళితుడిని పార్టీ అధ్యక్షుడిని చేసే దమ్ము బీఆరెస్ కు ఉందా ? మోదీ డబుల్ ఇంజిన్ సర్కారు అంటే.. డీజిల్, పెట్రోల్ ధరలను డబుల్ చేయడమా ? కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ. 500 లకే సిలిండర్ ఇచ్చి పేదలను ఆదుకుంటాం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ పేదవాడికి ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు సాయం అందిస్తాం. ఆపన్న హస్తం.. పేదలకు అభయ హస్తం ఇస్తుంది" అని రేవంత్ హామీ ఇచ్చారు.

బయ్యారం ఉక్కు కర్మాగారం తెస్తామని చెప్పిన సన్నాసులు ఇప్పుడు దొరగారి దొడ్లో గడ్డి తింటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పోడు భూములకు పట్టాలు ఇస్తానని కేసీఆర్ చెప్పి తొమ్మిదేళ్లయినా... సమస్య పరిష్కారం కాలేదన్నారు. అర్హులందరికీ పట్టాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పగానే... కేసీఆర్ గుండెల్లో గుబులు పుట్టిందని.... అందుకే పోడు భూములకి పట్టాలు ఇస్తామని అసెంబ్లీలో చెప్పారని వ్యాఖ్యానించారు. తొమ్మిదేళ్లలో చేయలేనిది తొమ్మిది నెలల్లో చేస్తారన్న నమ్మకం లేదన్నారు. అందుకే కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి పోడు భూములకు పట్టాలు తెచ్చుకుందామని రేవంత్ పిలుపునిచ్చారు. గోదావరి ముంపు బాధితులకు ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్... ఇచ్చిన మాటను నెరవేర్చలేదని అన్నారు.

IPL_Entry_Point