Telangana Assembly : తెలంగాణ ఆత్మబంధువు మన్మోహన్‌ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి : రేవంత్ రెడ్డి-revanth reddy demands bharat ratna for late prime minister manmohan singh in telangana assembly ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Assembly : తెలంగాణ ఆత్మబంధువు మన్మోహన్‌ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి : రేవంత్ రెడ్డి

Telangana Assembly : తెలంగాణ ఆత్మబంధువు మన్మోహన్‌ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి : రేవంత్ రెడ్డి

Basani Shiva Kumar HT Telugu
Dec 30, 2024 11:33 AM IST

Telangana Assembly : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తెలంగాణ అసెంబ్లీ నివాళులర్చించింది. శాసనసభలో సీఎం రేవంత్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మన్మోహన్‌ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల గుండెల్లో మన్మోహన్‌ స్థానం శాశ్వతమన్నారు.

అసెంబ్లీలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి
అసెంబ్లీలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి

దేశానికి మన్మోహన్‌ సింగ్‌ విశిష్టమైన సేవలు అందించారని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. నిర్మాణాత్మక సంస్కరణల అమలులో మన్మోహన్‌ సింగ్‌ది కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు. మన్మోహన్‌ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో పెట్టింది మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వమేనని.. తెలంగాణకు మన్మోహన్‌ సింగ్‌ ఆత్మబంధువని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్ మన్మోహన్‌ సింగ్‌‌కు 4 కోట్ల మంది తరఫున నివాళులర్పిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజల గుండెల్లో మన్మోహన్‌ సింగ్‌ స్థానం శాశ్వతమని స్పష్టం చేశారు.

yearly horoscope entry point

తీరనిలోటు..

'మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం ఈ దేశానికి తీరని లోటు. మౌనముని అంటూ ఎన్ని విమర్శలు వచ్చినా.. ఆయన తన సహనాన్ని కోల్పోలేదు. దేశాన్ని ఆర్దికంగా, సామాజికంగా బలోపేతం చేయడంపైనే ఆయన దృష్టిసారించారు. ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఆదర్శంగా తీసుకునే వారిలో మన్మోహన్ సింగ్ మొదటి వరుసలో ఉంటారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆనాడు పార్లమెంటు సభ్యులుగా మాతో పాటు ఆయన ఢిల్లీలో నిరసనలో పాల్గొన్నారు. ఇది మాకు జీవిత కాలం గుర్తుండిపోయే సంఘటన' అని రేవంత్ వ్యాఖ్యానించారు.

పేదలకు మేలు చేసేలా..

'పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిరసనలో పాల్గొనడం వారి నిరాడంబరతకు నిదర్శనం. ఉపాధి హామీ పథకం తెచ్చి పేదలకు 100 రోజుల పని కల్పించిన వ్యక్తి మన్మోహన్ సింగ్. ఫుడ్ సెక్యూరిటీ, సమాచార హక్కు చట్టాలను తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి ఆయన. 2013 భూసేకరణ చట్టం తెచ్చి భూమి లేని పేదలకు మేలు జరిగేలా చేశారు. 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్. అంబేద్కర్ స్పూర్తిని కొనసాగిస్తూ ఆయన చట్టాలు తీసుకొచ్చారు' అని రేవంత్ రెడ్డి కొనియాడారు.

తెలంగాణకు ఆత్మబంధువు..

'అలాంటి గొప్ప మానవతావాదిని కోల్పోవడం దురదృష్టకరం. ఆయన తీసుకొచ్చిన సరళీకృత విధానాలు దేశం దశ-దిశను మార్చాయి. దేశానికి ఆయన మాజీ ప్రధాని, మాజీ ఆర్థిక మంత్రి. కానీ తెలంగాణకు ఆయన ఆత్మబంధువు. తెలంగాణకు పురుడుపోసిన వ్యక్తిగా అయన్ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. దేశానికి ఆయన చేసిన సేవలకు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా మన్మోహన్ సింగ్ పట్ల ఏకాభిప్రాయం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది' అని సీఎం అభిప్రాయపడ్డారు.

తెలంగాణ గడ్డపై విగ్రహం..

'మన్మోహన్ సింగ్‌తో జైపాల్ రెడ్డికి ఎంతో సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆయన విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందో సభ్యుల సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నాం. తెలంగాణ గడ్డపై మన్మోహన్ సింగ్ విగ్రహం పెట్టడం సముచితం అని భావిస్తున్నాం' అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ‎

Whats_app_banner