TJS Support Congress : కాంగ్రెస్ కు టీజేఎస్ మద్దతు - రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Telangana Election 2023: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, తెలంగాణ జనసమితి కలిసి వెళ్తాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ కోదండరామ్ భేటీ అయిన మాట్లాడిన ఆయన… వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం టీజేఎస్ వారికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
Congress - TJS :టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీసుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇంచార్జి మాణిక్ రావు థాక్రే, బోసురాజు వెళ్లారు. ఈ సందర్భంగా…. వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్లే అంశంపై మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి…. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ , టీజేఎస్ పార్టీలు కలిసి వెళ్తాయని, తమ ప్రచారంలో కోదండరామ్ పాల్గొంటారని ప్రకటించారు. ఈ మేరకు రెండు పార్టీల మధ్య అవగాహన ఒప్పందం కుదినట్లు తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో టీజేఎస్ వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు.
"వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేసే అంశంపై ఇరు పార్టీలు చర్చించాయి. కాంగ్రెస్‌కు కోదండరామ్ మద్దుతు తెలిపారు. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఎన్నికల్లో కలిసి ముందుకెళ్తాం. కలిసి పోరాడాలని నిర్ణయం తీసుకున్నాం. మా ఫోన్లు హ్యాకింగ్ చేయిస్తున్నారు. బీఆర్‌ఎస్ నిరంకుశ పాలనను అంతమొందించాలి. మా ప్రచారంలో కూడా కోదండరామ్ పాల్గొంటారు" అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నాం - కోదండరామ్
కాంగ్రెస్ పార్టీకి మద్దతుపై టీజేఎస్ ప్రకటన విడుదల చేసింది. కేసీఆర్ నియంత పాలనను దించేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తాము సూచిస్తున్న అంశాలను ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు పలు అంశాలను ప్రస్తావించారు.
టీజేఎస్ ప్రస్తావించిన ముఖ్య అంశాలు:
ఉచిత విద్య, వైద్యం అందించాలి
ఉపాధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఆర్థిక విధానాల రూపకల్పన ఉండాలి.
ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి.
చిన్న తరహా పరిశ్రమలకు ఊతం ఇవ్వాలి.
భూ హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మెనార్టీ, మహిళలకు పేద వర్గాలకు పాలనలో భాగస్వామ్యం కల్పించాలి.
ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.