Siddipet : ఇంత అమానుషమా..? వ్యక్తి అంత్యక్రియలకు ఒక్కరూ రాని వైనం! కుల పెద్దల ఆదేశాలే అసలు కారణం!
సిద్దిపేట జిల్లాలోని బొప్పాపూర్ గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. భూవివాదంలో కుల పెద్దల ఆదేశాలకు లోబడి… ఓ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఒక్కరూ కూడా రాలేదు. డప్పులు కొట్టేందుకు కూడా గ్రామంలో ఉండేవారు రాకపోవటంతో వేరే గ్రామం నుంచి తీసుకువచ్చి కార్యక్రమాన్ని ముగించారు
మనిషి అంతరిక్షంలోకి వెళుతున్న నేటి సమాజంలో కుల కట్టుబాట్లు, బహిష్కరణతో ఇంకా చాలా గ్రామాలల్లో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ తరహా ఘటన సిద్ధిపేట జిల్లాలో తాజాగా వెలుగు చూసింది. భూవివాదం పంచాయితీలో ఓ కుటుంబానికి చెందిన వ్యక్తి అంత్యక్రియలను కుల పెద్దలు బహిష్కరించారు.
అంత్యక్రియలపై ఆంక్షలు విధించిన ఈ సంఘటన సిద్దిపేట జిల్లా అక్బర్ పేట-భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామంలో జరిగింది. గ్రామస్థులు ఎవరైనా అంత్యక్రియల్లో పాల్గొంటే రూ. 5 వేలు జరిమానా విధిస్తామని కుల పెద్దలు హెచ్చరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
భూవివాదంలో కుల బహిష్కరణ ......!
స్థానికలు తెలిపిన వివరాల ప్రకారం బొప్పాపూర్ గ్రామానికి చెందిన బండమీది సాయిలు (70), మల్లయ్య ఇద్దరు అన్నదమ్ములు. వీరు వ్యవసాయం చేసుకొని జీవనం సాగించేవారు. కాగా బొప్పాపూర్ గ్రామ పెద్దలు నిర్ణయించిన ధరకు తమ భూమిని విక్రయించడానికి అన్నదమ్ములు నిరాకరించారు. దీంతో కుల పెద్దలకు, అన్నదమ్ములకు గొడవ జరిగింది.
దీంతో వీరిద్దరూ కుటుంబాలను 2021లో కుల బహిష్కరణ చేశారు . ఈ విషయంలో అన్నదమ్ములు అప్పట్లో అధికారులను ఆశ్రయించారు. అనంతరం గ్రామంలోనే గొడవను పరిష్కరించుకొని, కుల సంఘానికి కొంత జరిమానా చెల్లించి… మరల కులంలో చేరారు. అయితే అధికారుల ముందు కులస్థులు ఒప్పుకున్నా ఆ తర్వాత వారిపట్ల అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు.
అంత్యక్రియలకు రాని వైనం…!
కాగా మంగళవారం సాయంత్రం సాయిలు అనారోగ్యంతో మృతి చెందాడు. కులస్తులు మృతదేహం వద్దకు రావడానికి నిరాకరించారు. దీంతో సోదరుడు మల్లయ్య అంత్యక్రియలకు సహకరించాలని కులస్తులను వేడుకున్నా.. వారు స్పందించలేదు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలతో చర్చించినా ఫలితం లేకుండా పోయింది. గ్రామస్థులు ఎవరైనా అతని అంత్యక్రియల్లో పాల్గొన్నా, వారితో మాట్లాడిన రూ. 5 వేలు జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు హెచ్చరించినట్లు తెలిసింది.
కనీసం డప్పు కొట్టడానికి రావాలని పోలీసులు కోరిన ఒప్పుకోలేదు. అయితే బుధవారం మధ్యాహ్నం వరకు కులస్థులు వస్తారని మృతుడి కుటుంబీకులు, బంధువులు మృతదేహంతో వేచి చూశారు. అయినా వారు రాకపోవడంతో పక్క గ్రామాల నుంచి డప్పులు తెప్పించి… సాయిలు అంత్యక్రియలు నిర్వహించారు.
కనీసం మానవత్వం చూపలేని కుల పెద్దల వైఖరిపై బంధువులు మండిపడ్డారు. తమకు జరిగిన అవమానం మరెవరికి జరగకూడదని.. దీనిపై పోలీసులకు పిర్యాదు చేస్తానని మృతుడి సోదరుడు మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తం బహిష్కరణ వెనక నలుగురు పెద్దలు ఉన్నారని ఆయన అన్నారు.
ఇదే కాకుండా… రెండేళ్ల కిందట గవ్వల రామస్వామి కుటుంబాన్ని కూడా పెద్దలు బహిష్కరించారు. పెనాల్టీలు, పెద్దల ఆంక్షలకు భయపడి గ్రామంలోని మిగిలిన వారు తమతో మాట్లాడడం మానేశారని స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబం కూడా ఇదే బాధను అనుభవిస్తుందని చెప్పుకొచ్చారు.