Delta Express Accident 2005 : ‘డెల్టా’ ప్రమాదానికి 19 ఏళ్లు-200 ప్రాణాలను నీటిలో కలిపేసిన ట్రైన్ యాక్సిడెంట్-repalle secunderabad delta express accident in 2005 nearly 200 people died 19 completed ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Delta Express Accident 2005 : ‘డెల్టా’ ప్రమాదానికి 19 ఏళ్లు-200 ప్రాణాలను నీటిలో కలిపేసిన ట్రైన్ యాక్సిడెంట్

Delta Express Accident 2005 : ‘డెల్టా’ ప్రమాదానికి 19 ఏళ్లు-200 ప్రాణాలను నీటిలో కలిపేసిన ట్రైన్ యాక్సిడెంట్

HT Telugu Desk HT Telugu

Delta Express Accident 2005 : కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా దీపావళి జరుపుకుని..తిరిగి హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు. అక్టోబరు 29వ తేదీ, 2005 తెల్లవారుజామున 4.30 గంటలకు ఒక్కసారిగా భారీ కుదుపు. డెల్టా ఎక్స్ ప్రెస్ 7 బోగీలు కనిపించకుండా పోయాయి. ఈ ఘోర రైలుప్రమాదానికి నేటికి 19 ఏళ్లు.

‘డెల్టా’ ప్రమాదానికి 19 ఏళ్లు-200 ప్రాణాలను నీటిలో కలిపేసిన రైలు ప్రమాదం

కుటుంబ సభ్యులతో... బంధువులతో.. పిల్లా పాపలతో.. ఎంతో ఆనందంగా జరుపుకున్న దీపావళి.. నాలుగు రోజులు తిరగకుండానే వారి జీవితాల్లో కారుచీకట్లు నింపింది. అంతా ఉత్సాహంగా గడిపి.. తీయని జ్ఞాపకాలతో హైదరాబాద్ కు తిరుగు ముఖం పట్టిన వారు.. జీవితాంతం చేదు జ్ఞాపకాలతో బతకాల్సి వస్తుందని, తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు.. బిడ్డలను కోల్పోయి కన్నవాళ్లు.. అన్నను తమ్ముడు.. అక్కను చెల్లీ.. తోడబుట్టిన వారిని.. కట్టుకున్న వారిని.. కన్న వారిని.. ఇలా.. ఒకరినొకరిని విడదీసిన ‘ రేపల్లే – సికింద్రాబాద్ ’ డెల్టా ఎక్స్ ప్రెస్ రైలు పమాదం ఏకంగా రెండు వందల మందిని పొట్టన పెట్టుకుంది.

సరిగ్గా 19 ఏళ్ల కిందట

2005 అక్టోబరు 29వ తేదీ రాత్రి రేపల్లె సికింద్రాబాద్ డెల్టా ఎక్స్ ప్రెస్ రైలు రేపల్లె రైల్వే స్టేషన్‌ నుంచి రాత్రి పదిన్నర గంటలకు సికింద్రాబాద్‌కు బయలు దేరింది. ఆ రోజు శనివారం రాత్రి . అంతకు ముందు మంగళవారమే దీపావళిని పండుగను జరుపుకున్నారు. రేపల్లె – సికింద్రాబాద్‌ (డెల్టా) ఎక్స్‌ప్రెస్‌ గుంటూరు జిల్లా రేపల్లె – సికింద్రాబాద్‌ జంక్షన్‌ మధ్య నడిచే ముఖ్యమైన రైలు. డెల్టా ఎక్స్‌ప్రెస్‌ 341 కిమీ దూరం నిత్యం ప్రయాణిస్తుంది. ఈ రైలు సగటున గంటకు 40కిమీ వేగంతో నడుపుతారు. రేపల్లె – సికింద్రాబాద్‌ (డెల్టా) ఎక్స్‌ప్రెస్‌కు మొత్తం 19 స్టాప్‌లు ఉన్నాయి. రాత్రి పదిన్నర గంటలకు బయలుదేరి రేపల్లె – పాలికోన – భట్టిప్రోలు – వేమూరు - చిన్నరావూరు తెనాలి జంక్షన్‌ - వేజండ్ల - గుంటూరు జంక్షన్‌ - సిరిపురం - పెదకూరపాడు – సత్తెనపల్లి – పిడుగురాళ్ల - నడికుడి జంక్షన్‌ - మిర్యాలగూడ – నల్గొండ - ఘట్కేసర్‌ - చర్లపల్లి - మౌలాలీ .. స్టేషన్ల మీదుగా సికింద్రబాద్‌కు చేరుకుంటుంది.

మూడు రాష్ట్రాలను కుదిపేసిన భారీ వర్షాలు

అంతకు ముందు నుంచే.. అంటే దాదాపు వారం రోజులుగా.. రాష్ట్ర (నాటి ఉమ్మడి ఆంధ్రప్రేదేశ్‌ ) వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. అప్పటికే ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వరదలు అల్లకల్లోలం సృష్టించాయి. మూడు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. భారీ ఆస్తి నష్టం జరిగింది. చాలా చోట్ల రోడ్డు మార్గాలు బంద్‌ అయ్యాయి. రైల్వే ట్రాకుల మీది నుంచి వరదలు పారుతున్నాయి. ఆ రాత్రి రేపల్లె - సికింద్రాబద్‌ డెల్టా ఎక్స్‌ప్రెస్‌ ఘట్కేసర్‌ స్టేషన్‌కు చేరుతుందనగా.. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని రామన్నపేట - వలిగొండ చిన్న స్టేషన్ల మధ్య ఉన్న గొల్లపల్లి గ్రామ సమీపంలో 2005 అక్టోబరు 29వ తేదీ రాత్రి డెల్టా రైల్‌ ఇంజన్, దాని వెనుకే ఉన్న ఏడు బోగీలు చీకటిలో మాయం అయ్యాయి. మిగిలిన పది బోగీల్లో కనీసం నాలుగు బోగీలు పక్కనే ఉన్న పొలాల్లో గాల్లోకి లేచాయి. హాహా కారాలు.. అరుపులు.. ఏం జరిగిందో తెలిసే లోపో గాఢ నిద్రలో ఉన్న వందకు పైగా ప్రాణాలు గాలిలో కలిశాయి. వందలాది మంది గాయాలతో మిగిలిపోయారు. కొన్ని వందల కుటుంబాల్లో.. డెల్టా ప్రమాదం నిప్పులు పోసింది..!

దేశ చరిత్రలో భారీ ప్రమాదం

భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత భారీ ప్రమాదంగా నమోదైన వలిగొండ వద్ద జరిగిన సంఘటనలో సుమారు రెండు వందల మంది చనిపోయారు. అధికారికంగా లెక్క తేల్చింది మాత్రం 140. ఒక్కో పత్రిక.. ఒక్కో టీవీ ఛానల్‌ ఒక్కో రకంగా రిపోర్టు చేసినా.. వందలాది కుటుంబాల్లో విషాదం నింపిన ప్రమాదం అది. 2005, అక్టోబరు 29వ తేదీ తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంతకు ఇరవై నిమిషాల ముందు ఇదే ట్రాక్‌ పై నుంచి నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించిందని అప్పటి హోమ్‌ మంత్రి కె. జానారెడ్డి ప్రకటించారు. అంటే.. ఇరవై నిమిషాల వ్యవధిలో ట్రాక్‌ కొట్టుకు పోయింది... అంటే.. ఫ్లాష్‌ ఫ్లడ్‌ వచ్చిందని తేల్చారు. ట్రాక్‌కు ఎగువ బాగాన ఉన్న నాలుగు చెరువులు పూర్తి స్థాయిలో నిండి గండి పడడంతో, రైల్‌ బ్రిడ్జ్‌.. ట్రాక్‌ కొట్టుకుపోయే స్థాయిలో వరద ముంచెత్తింది... ఈ ట్రాక్‌పై సికింద్రాబాద్‌ వైపు దూసుకు వచ్చిన డెల్టా నీటిలో పడిపోయింది.

రంగంలోకి దిగిన త్రివిధ దళాలు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ప్రమాదంలో.. సహాయక చర్యలు చేపట్టేందుకు ఇండియన్‌ నేవీ, ఇండియన్‌ ఆర్మీ, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ రంగంలోకి దిగాయి. వందలాది మందిని రక్షించాయి. నేవీ డైవర్స్‌ వరదలో కొట్టుకుపోయిన బోగీల్లో ఇంకా ఎవరైనా బతికి ఉన్నారేమోనని వెదుకులాడాయి. లగేజీపైన, బోగీల్లోని ఫ్యాన్లకు వేలాడుతూ ప్రాణాలతో మిగిలిన వారిని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ హెలీకాఫ్టర్ల ద్వారా రక్షించి తీసుకువచ్చారు... ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒక్కొక్కరి ఉద్యోగం అని హామీలు ఇచ్చారు... అంతా ఆ సంఘటనను మరిచిపోయారు.. కానీ.. అయిన వాళ్లను పోగొట్టుకున్న వారికి మాత్రం అది కాళరాత్రిగా మిగిలిపోయింది. సరిగ్గా పంతొమ్మిదేళ్ల కిందట ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన ఈ సంఘటన గురించి ఆ ప్రాంతంలో ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నారు.

(రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్)