Mohan Babu: సినీ న‌టుడు మోహ‌న్ బాబుకు ఊర‌ట‌... కఠిన చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశం-relief for film actor mohan babu supreme court orders not to take strict action ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mohan Babu: సినీ న‌టుడు మోహ‌న్ బాబుకు ఊర‌ట‌... కఠిన చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశం

Mohan Babu: సినీ న‌టుడు మోహ‌న్ బాబుకు ఊర‌ట‌... కఠిన చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశం

HT Telugu Desk HT Telugu
Jan 10, 2025 06:24 AM IST

Mohan Babu: జర్నలిస్ట్ పై దాడి కేసులో సినీ నటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.జర్నలిస్టుపై దాడి కేసులో తదుపరి విచారణ వరకు పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. గతేడాది డిసెంబర్ 10న జల్‌పల్లిలోని తన నివాసం వద్ద జర్నలిస్ట్ దాడి కేసులో ఊరట లభించింది.

సుప్రీంకోర్టులో మోహన్‌ బాబుకు ఊరట
సుప్రీంకోర్టులో మోహన్‌ బాబుకు ఊరట

Mohan Babu: జర్నలిస్ట్ పై దాడి కేసులో సినీ నటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో తదుపరి విచారణ వరకు పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. గతేడాది డిసెంబర్ 10 న జల్‌పల్లిలోని తన నివాసం వద్ద జర్నలిస్ట్ దాడి కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ మోహన్‌ బాబు దాఖలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.

yearly horoscope entry point

డిసెంబర్ 23న ఈ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్‌ చేసింది. పోలీసులు నమోదు చేసిన కేసులో అభియోగాలు తీవ్రమైనందున ముందస్తు బెయిల్‌ ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మోహన్ బాబు డిసెంబర్ 24న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను గురువారం జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ద్విసభ ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా మోహన్‌బాబు తరపు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ... జర్నలిస్ట్‌పై దాడి ఏ పరిస్థితుల్లో జరిగిందో ధర్మాసనానికి వివరించారు.

మోహనబాబుకు ఒక కుమారుడు ఉన్నాడని, ఆయ‌న‌తో వివాదం ఉందని, 20-30 మందితో కుమారుడు తన ఇంట్లోకి చొరబడ్డారని తెలిపారు. క్షణికావేశంలో మోహనబాబు జర్నలిస్ట్ మైక్ లాక్కొని, అదే మైక్‌ను విసిరారన్నారు. అయితే ఈ ఘటనపై బహిరంగ క్షమాపణలు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైతే బాధితుడైన జర్నలిస్ట్‌కు నష్టపరిహారం కూడా చెల్లించేందుకు సుముఖంగా ఉన్నారని అభ్యర్థించారు. ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టును పరామర్శించేందుకు కూడా మోహనబాబు వెళ్లారని రోహత్గీ కోర్టుకు తెలిపారు.

మోహన్ బాబు చేసిన దాడితో దవడ విరిగిందని జర్నలిస్ట్ తరపు న్యాయ‌వాది వాదనలను కొనసాగించారు. మోహనబాబు వయస్సు 76 ఏళ్లు అయినా... 35 ఏళ్ల జర్నలిస్టుపై దాడి చేశారని ధ‌ర్మాస‌నానికి తెలిపారు. జర్నలిస్టు ఆస్పత్రిలో ఐదు రోజులు గడపాల్సి వచ్చిందని, దవడకు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందన్నారు. దీంతో పైపుతో ఆహారం తినిపించారని తెలిపారు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని కోరేందుకు మోహనబాబు కుటుంబ సభ్యులతో కలిసి హస్పిటల్ వెళ్లారని జర్నలిస్టు తరపు న్యాయవాది తెలిపారు.

ముకుల్‌ రోహత్గీ జోక్యం చేసుకొని... మోహన్ బాబును జర్నలిస్టును బెదిరించలేదని ధ‌ర్మాస‌నానికి నివేదించారు. ఈ కేసులో మోహన్ బాబును జైల్లో ఉంచాల్సినంత సీరియస్ లేదన్నారు. అయినప్పటికీ హత్యాయత్నం కింద కూడా కేసు నమోదు చేశారని అన్నారు. మోహన్‌బాబు ఇంటిపైకి 20-30 మంది వచ్చారని, ఇది అతిక్రమణ కిందకి వస్తుందని అన్నారు. మోహన్ బాబు మంచి పేరున్న నటుడని, ఎవరినైనా చంపడం, బాధపెట్టడం ఆయనకు ఇష్టం లేదని అన్నారు.

ఈ వాదనలపై జస్టిస్‌ దులియా స్పందిస్తూ ఎవరైనా ఇంటిలోనికి వచ్చినంత మాత్రాన దాడి చేస్తారా? అని మోహన్ బాబు తరపు న్యాయ‌వాది ముకుల్ రోహిత్గిని ప్రశ్నించారు. అయితే ఇరుపక్షాలు వాదనలు విన్న ధర్మాసనం... ప్రతివాదిగా ఉన్న బాధితుడు పరిహారం కోరుకుంటున్నారా? చెప్పాలని కోరింది. దీనిపై జర్నలిస్టు న్యాయవాదితో మాట్లాడి, ఆయనకు ఏమి కావాలో చేస్తానని ముకుల్‌ రోహత్గీ కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణ వరకు మోహన్ బాబుపై బలవంతపు చర్యలు వద్దని పోలీసులను ఆదేశించింది. అలాగే మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి, జర్నలిస్టుకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 13కు వాయిదా వేసింది.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner