US Visa Slots: రెండున్నర లక్షల వీసా స్లాట్ల విడుదల, ఈ ఏడాది అమెరికా ఆశావహులకు పండగే.. యూఎస్ కీలక నిర్ణయం
US Visa Slots: విద్య, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లాలని కలలు కంటున్న వారికి ఢిల్లీలోని యూఎస్ కాన్సులేట్ తీపి కబురు చెప్పింది.ఇటీవల ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఈ ఏడాది భారతీయుల కోసం రెండున్నర లక్షల వీసా స్లాట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. దేశంలోని నాలుగు రాయబార కార్యాలయాల్లో స్లాట్లు ఉంటాయి.
US Visa Slots: అమెరికా వెళ్లాలని కలలు కంటున్న వారికి భారత్‌లోని యూఎస్ కాన్సులేట్ తీపి కబురు చెప్పింది. ఇప్పటికే దరఖాస్తు చేసి ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్న వారి కోసం 2.5 లక్షల అదనపు స్లాట్ల విడుదల చేయనున్నట్టు వెల్లడించింది.
అమెరికా వీసాకు దరఖాస్తు చేసి ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఎదురు చూస్తున్న వారి కోసం రెండున్నర లక్షల స్లాట్లను విడుదల చేసినట్టు సోమవారం ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ స్లాట్ల ద్వారా పర్యాటకులు, వృత్తి నిపుణులు, విద్యార్థుల వీసాలు లభిస్తాయి. తాజా నిర్ణయంతో భారతీయులు సమయానికి వీసాలను పొందడానికి వీలు కలుగుతుంది.
ఇటీవల అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, యూఎస్ అధ్య క్షుడు బైడెన్ వీసాల జారీలో వేగం పెంచేందుకు పరస్పరం సహకరించాలని నిర్ణయించిన నేపధ్యంలో వీసా స్లాట్లను విడుదల చేయడం ద్వారా ఈ హామీని నెరవేరుస్తున్నట్టుచెప్పడానికి గర్వపడుతున్నట్టు యూఎస్ కాన్సులేట్ పేర్కొంది.
వీసా ఇంటర్వ్యూల నిర్వహణ కోసం రాయబార కార్యాలయంలోని కాన్సులర్ బృందాలు, దేశంలోని నాలుగు కాన్సులేట్లలోని సిబ్బంది అలుపు లేకుండా పని చేస్తున్నారని వివరించారు. డిమాండుకు అనుగుణంగా వీసా ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నామని భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి పేర్కొన్నారు.
అమెరికా వీసాలకు ఇటీవలి కాలంలో భారీ డిమాండ్ ఉంది. పర్యాటక వీసా స్లాట్లకు కొన్ని చోట్ల ఏడాదికి పైగా సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా రాయబార కార్యాలయం చర్యలు చేపట్టింది. దరఖాస్తు చేసిన వారికి నిర్ణీత గడువులోగా వీసా ఇంటర్వ్యూ తేదీలను ఖరారు చేసేలా చర్యలు చేపట్టారు.
కుటుంబాలను కలపడం, అమెరికాలో వ్యాపార కార్యకలాపాలను పెంపొందించడం, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అధిక ప్రాధాన్యమిస్తున్నా మని అమెరికా రాయబారవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమెరికాలో 60 లక్షల మంది భారతీయులకు వలసేతర వీసాలున్నాయని వెల్లడించింది. ప్రతి రోజూ వేలాదిమందికి వీసాలు జారీ చేస్తున్నట్టు కాన్సులేట్ ప్రకటించింది.
2023లో భారతీయ విద్యార్థులకు 1.4 లక్షల వీసాలను అమెరికా రాయబార కార్యాలయం గతంలో వెల్లడించింది. ఇది ప్రపంచంలోనే ఏ ఇతర దేశం కన్నా అధికమని వివరించింది." వరుసగా మూడేళ్లపాటు విద్యార్థి వీసాల జారీచేయడంలో రికార్డు సృష్టించామని యూఎస్ కాన్సులేట్ వెల్లడించింది.
ఈ ఏడాది ఇప్పటిదాకా అమెరికాకు 12 లక్షల మంది భారతీయులు ప్రయాణిం చారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 35 శాతం అధికమని కాన్సులేట్ వర్గాలు పేర్కొన్నాయి. వలసేతర వీసా దరఖాస్తుల్లో ఇప్పటికే ఈ ఏడాది 10 లక్షల ఇంటర్వ్యూలను అమెరికా రాయబార కార్యాలయం నిర్వహించింది.
గత ఏడాది కూడా పది లక్షలకు పైగా ఇంటర్వ్యూలను నిర్వహించినట్టు వెల్లడించారు. విద్యార్థి వీసాల ప్రాసెసింగ్‌లో కూాడ ఈ ఏడాది రికార్డు సృష్టించామని రాయబార కార్యాలయం వెల్లడించింది. తొలిసారి వీసా లకు దరఖాస్తు చేసిన విద్యార్థులందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించామని తెలిపారు.