Kodangal Medical College: కొడంగల్ నియోజక వర్గానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీ రానుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వికారాబాద్ జిల్లా కొడంల్‌లో వైద్య కళాశాలతో పాటు నర్సింగ్, ఫిజియోథెరపీ, పారా మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కొడంగల్‌లో ప్రస్తుతం ఉన్న 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 220 పడకల ఆసుపత్రిగా మార్చనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజక వర్గ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయనుంది.
కొత్తగా ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీతో తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 35కు చేరుకోనుంది. కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో 50 ఎంబీబీఎస్ సీట్లతో పాటు 60 బీఎస్సీ నర్సింగ్, 50 ఫిజియోథెరపీ, 30 పారామెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మెడికల్ కాలేజీ , నర్సింగ్ కాలేజీ, ఫిజియోథెరపీ కళాశాలలతో పాటు 220 పడకల టీచింగ్ హాస్పటల్ నిర్మాణం కోసం రూ.224.50 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగూ ఉత్త ర్వులు జారీ చేశారు.
వైద్య కళాశాల భవనాలను రూ.124.5 కోట్లతో నిర్మిస్తారు. నర్సింగ్ కాలేజీ భవనాలను రూ.46 కోట్లతో, ఫిజియోథెరపీ కళాశాల భవనాలను రూ.27 కోట్లతో ఆర్ అండ్ బి అధికారులు నిర్మించనున్నారు. కొడంగల్ నియోజక వర్గంలో 220 పడకల ఆసుపత్రిని రూ.27 కోట్లతో టీఎస్ఎం ఎస్ఐడీసీ నిర్మిస్తుంది.
విద్యార్థుల కోసం పూర్తిస్థా యిలో హాస్టళ్లను కూడా నిర్మిస్తారు. కొత్త కళాశాలల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డీఎంఈ, ఇతర విభాగాధిపతులను వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశించింది.
ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలకు అను బంధంగా నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో కొడంగల్‌లో నాలుగు కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. ఈ కాలేజీలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మెడికల్ కాలేజీలకు అనుమతుల విషయంలో ఇప్పటికే ఎంసిఐ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.
జనాభా దామాషా లెక్కలో అదనపు కాలేజీలకు అనుమతుల విషయంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అభ్యంతరం చెబుతోంది. ఈ నేపథ్యంలో మరో కాలేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో దానికి అనుమతులు లభిస్తాయా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.