Real estate in Hyderabad: రియల్ ఎస్టేట్ సేల్స్ డౌన్.. బిల్డర్ల ఆఫర్లు
Real estate in Hyderabad: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ అమ్మకాలు పడిపోవడంతో బిల్డర్లు ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నారు.
Real estate in Hyderabad: కోవిడ్‌కు ముందు, కోవిడ్ తరువాత హైదరాబాద్‌లో ఫ్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫ్లాట్ల ధరలను 100 శాతం పెంచేశారు. భూమి, స్టీలు, సిమెంట్, ఇసుక, తదితర ముడిసరుకు ధర పెరిగిందని నమ్మబలికినా.. కొనుగోలుదారులు విశ్వసించలేదు. దీంతో ఆగస్టు మాసం నుంచి క్రమంగా రియల్ ఎస్టేట్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. సెప్టెంబరులో అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని కొన్ని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సర్వేలు తేల్చి చెప్పాయి.
హైదరాబాద్ నగరంలో కొందరు ప్రముఖ బిల్డర్లు రెసిడెన్షియల్ ఫ్లాట్లను సామాన్యుడికి అందుబాటులో లేకుండా చదరపు అడుగు ధరను రూ. 10 వేలకు పెంచేశారు. కొన్ని ఖరీదైన ప్రాంతాల్లో ఏకంగా రూ. 15 వేలకు పెంచేశారు. వీరిని చూసి పొరుగున ఉన్న చిన్న చిన్న బిల్డర్లు కూడా బడా బిల్డర్ల తరహాలోనే అత్యాశకు పోయి వారి వారి ఫ్లాట్ల ధరలను పెంచేశారు.
ఐటీ, ఆర్థిక సంస్థల కార్యకలాపాలు ఎక్కువగా ఉండే హైదరాబాద్ పశ్చిమ ప్రాంతం తరహాలోనే ఇప్పుడు నార్త్ హైదరాబాద్, ఈస్ట్ హైదరాబాద్‌లో కూడా బిల్డర్లు ఇబ్బడి ముబ్బడిగా ధరలు పెంచేయడం, ముడిసరుకు ధరలు పెరగముందు పూర్తిచేసిన ఫ్లాట్లకు కూడా ధరలు పెంచేయడం వంటి కారణాల వల్ల కొనుగోలుదారుల్లో ఆసక్తి సన్నగిల్లింది.
మరోవైపు ఆర్థిక మాంద్యం భయాలు సామాన్యుడి నుంచి సిలికాన్ వ్యాలీలో ఉన్న ఎన్నారై వరకు భయపెడుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్భణాన్ని అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే 1.90 శాతం మేర వడ్డీ రేట్లను పెంచింది. వాణిజ్య బ్యాంకులు హోం లోన్లపై వడ్డీ రేట్లను ఏకంగా 2 నుంచి 2.50 శాతం మేర పెంచేశాయి.
దీంతో కొనుగోలుదారులు తమ సొంతింటి కలను వాయిదావేసుకుని ప్రస్తుతానికి అద్దె ఇంట్లో ఉండడమే సేఫ్ అన్న నిర్ణయానికి వస్తున్నారు. పాలు, కూరగాయలు, పెట్రోలు, స్కూలు ఫీజులు, ట్యూషన్ ఫీజులు అన్నీ పెరిగిపోవడంతో నెలవారీ బడ్జెట్ తల్లకిందులై ప్రస్తుతానికి కొత్తగా పెట్టుబడుల జోలికి వెళ్లేందుకు జంకుతున్నారు.
బిల్డర్ల దీపావళి ఆఫర్లు..
అమ్మకాలు సన్నగిల్లడంతో రియల్ ఎస్టేట్‌లో కొత్త పోకడ కనిపిస్తోంది. కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు కొందరు బిల్డర్లు దీపావళి ఆఫర్లను తీసుకొచ్చారు. ఫ్లాటు విలువలో కేవలం 10 శాతం చెల్లించి, ఫ్లాట్ నిర్మాణం పూర్తయ్యాకే మిగిలిన సొమ్ము చెల్లించొచ్చని ఆఫర్ ఇస్తున్నాయి. అంటే దీనినే రియల్ ఎస్టేట్ భాషలో చెప్పాలంటే నో ప్రీ ఈఎంఐ ఆఫర్ అంటారు.
ఇక మరికొందరు బిల్డర్లు దీపావళి ఆఫర్‌గా చదరపు అడుగుకి రూ. 300 నుంచి రూ. 500 వరకు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించారు. మరికొన్ని నెలల పాటు వడ్డీ రేట్లు పెరుగుతాయన్న సంకేతాల కారణంగా బిల్డర్లు ఇప్పుడిప్పుడే డిస్కౌంట్ ఆఫర్లు మొదలుపెడుతూ తమ ఫ్లాట్లను అమ్ముకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇక మరికొందరు బిల్డర్లు బడా కార్పొరేట్ ఫర్నీచర్, ఇతర సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని క్యాష్ బ్యాక్‌లు, గిఫ్ట్ ఓచర్లు ఇస్తున్నారు.