Hyderabad RRR : రీజనల్ రింగ్ రోడ్డుతో ఈ ప్రాంతాల ప్రజల బతుకే మారిపోతుంది.. డబ్బులే డబ్బులు!
Hyderabad RRR : తాజాగా నిర్మించ తలపెట్టిన రిజనల్ రింగ్ రోడ్డు.. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌కు మంచి బూస్ట్ ఇవ్వనుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో ఓఆర్ఆర్‌తో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డుతో నగర శివారు ప్రాంతాలే కాకుండా.. జిల్లాల్లోనూ ధరలు పెరగనున్నాయి.
హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు.. కేవలం ఒక రోడ్డు మాత్రమే కాదు.. ఇది హైదరాబాద్, తెలంగాణ భవిష్యత్తు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌కు సూపర్ బూస్ట్. ప్రస్తుతం హైదరాబాద్ ఐటీ, ఫార్మా రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. అయితే.. త్వరలో నిర్మించబోయే రిజనల్ రింగ్ రోడ్డుతో కనెక్టివిటీ మరింత పెరిగి.. కొత్త కారిడార్‌లు అభివృద్ధి చెందనున్నాయి. ఇది రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇంకా బలోపేతం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలతో అనుసంధానం..
రిజనల్ రింగ్ రోడ్డు హైదరాబాద్‌తో పలు జిల్లాలను అనుసంధానించనుంది. ప్రధాన రహదారులు, పట్టణాలు, పారిశ్రామిక కేంద్రాలకు వారధిగా మారనుంది. దాదాపు 340 కిలోమీటర్ల మేర హైదరాబాద్ చుట్టు దీన్ని నిర్మించనున్నారు. దీంతో శంకర్‌పల్లి, యాచారం, ఇబ్రహీంపట్నం వంటి గ్రామీణ ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ఆస్తులకు భారీగా డిమాండ్ పెరుగనుంది. మెరుగైన కనెక్టివిటీతో.. గేటెడ్ కమ్యూనిటీలు, అభివృద్ధి చేసిన ప్లాట్లు అందుబాటులోకి రానున్నాయి.
పరిశ్రమల నిర్మాణం..
రిజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే.. దానివెంట పరిశ్రమలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, హోటళ్లు.. ఇలా ఎన్నో నిర్మాణాలు జరుగుతాయని భావిస్తున్నారు. ఫలితంగా ఈ రోడ్డు నిర్మాణం అయ్యే ప్రాంతాల్లో భూముల ధరలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి.
రవాణాకు అనుకూలం..
రిజనల్ రింగ్ రోడ్డు వేగవంతమైన లాజిస్టిక్స్, రవాణాకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పరిశ్రమలు, గిడ్డంగులు, టెక్ పార్కులు వస్తాయి. మరిన్ని వ్యాపారాలు విస్తరిస్తాయి. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు.. రిజనల్ రింగ్ రోడ్డు మధ్య భూముల్లో ఎక్కువ నిర్మాణాలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాంతాల్లోని భూముల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.
పర్యావరణంపై ఫోకస్..
రిజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా పర్యావరణంపై దృష్టిపెట్టనున్నారు. చెట్ల పెంపకం, వర్షపు నీరు నిల్వ వంటి చర్యలు తీసుకోనున్నారు. దీంతో రియల్ వ్యాపారులు కూడా పచ్చదనంతో కూడిన ప్లాట్లను అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బిల్డర్లు కూడా పర్యావరణ హితంగా నిర్మాణాలు చేపట్టేలా అడుగులు వేయబోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రాంతాల్లో..
ప్రస్తుతం ఉత్తర భాగం నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. సంగారెడ్డి, గజ్వేల్, భువనగిరి మార్గంలో నిర్మాణం జరగనుంది. దీంతో చౌటుప్పల్, పోచంపల్లి, భువనగిరి, బీబీనగర్, జగదేవ్‌పూర్, తుర్కపల్లి, వర్గల్, నాచారం, బొంతపల్లి, ఎల్దుర్తి, జోగిపేట ప్రాంతాల్లో భూములకు మంచి డిమాండ్ ఏర్పడనుంది. దక్షిణం వైపు కూడా నిర్మిస్తారనే ప్లాన్ ఉంది. దీంతో శంకర్‌పల్లి, చేవేళ్ల, షాద్‌నగర్, మహేశ్వరం, కందుకూర్, కడ్తాల్, మాల్, ఇబ్రహీంపట్నం, మర్రిగూడెం ప్రాంతాల్లో భూముల ధరలు పెరగనున్నాయి.