Yadagirigutta Explosion : యాదగిరిగుట్టలోని పరిశ్రమలో భారీ పేలుడు - ఒకరు మృతి, 7 మందికి తీవ్రగాయాలు..!
Yadagirigutta Explosion Incident : యాదగిరిగుట్ట పరిధిలోని పెద్దకందుకూరులో భారీ పేలుడు సంభవించింది. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో పేలుడు దాటికి… ఒకరు మృతి చెందారు. మరో 7 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులో భారీ పేలుడు జరిగింది. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ కంపెనీలో రియాక్టర్ పేలడటంతో… 7 మంది కార్మికులకు గాయాలయ్యాయి. ఒక కార్మికుడు మృతి చెందారు. గాయపడిన వారిలో మరొకరి పరిస్థితి(మొగిలిపతాక ప్రకాష్) విషమంగా ఉంది.
భారీ శబ్దంతో పేలడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. భారీ శబ్దంతో రియాక్టర్ పేలిన వెంటనే… కంపెనీ యాజమాన్యం ఎమర్జెన్సీ సైరన్ మోగించింది. ఈ ఘటనలో కనకయ్య(బచ్చన్నప్పటే వాసి) అనే కార్మికుడు మృతి చెందాడు. కంపెనీ నిర్లక్ష్యం వల్లనే కనకయ్య చనిపోయాడని కంపెనీ ఎదుట గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
భువనగిరి డీసీపీ రాజేశ్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం… యాదాద్రి జిల్లా పెద్దకందుకూరు గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. కంపెనీలోని ఓ గదిలో ఇద్దరు కార్మికులు ఇతర రసాయనాలతో మెగ్నీషియం కలుపుతుండగా ఈ సంఘటన జరిగిందని వివరించారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ… ఆ గది వరకే పరిమితమైందన్నారు.
ఈ పేలుడు ఘటనలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని డీసీపీ రాజేశ్ చంద్ర చెప్పారు. వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. ఒకరు మృతి చెందారని, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.
ప్రాథమిక విచారణ మేరకు.. ప్రమాదకర పదార్థాల నిర్వహణలో కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలిందని డీసీపీ తెలిపారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా ఫ్యాక్టరీ యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
కంపెనీలో కార్మికుల సేఫ్టీ ప్రోటోకాల్‌లను పాటించారా..? పారిశ్రామిక భద్రతా నిబంధనలకు లోబడే కంపెనీ ఉందో లేదో తెలుసుకోవడానికి విచారణ జరుపుతున్నామని డీసీపీ వివరించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ యాజమాన్యం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.