ఇన్‌స్టాలో పరిచయం.. ఫామ్‌హౌస్‌లో మైనర్ల ట్రాప్ హౌస్ పార్టీ.. డ్రగ్స్, విదేశీ మద్యం!-rave party busted in telangana 22 minors among 65 detained in moinabad farm house ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఇన్‌స్టాలో పరిచయం.. ఫామ్‌హౌస్‌లో మైనర్ల ట్రాప్ హౌస్ పార్టీ.. డ్రగ్స్, విదేశీ మద్యం!

ఇన్‌స్టాలో పరిచయం.. ఫామ్‌హౌస్‌లో మైనర్ల ట్రాప్ హౌస్ పార్టీ.. డ్రగ్స్, విదేశీ మద్యం!

Anand Sai HT Telugu

ఇన్‌స్టాలో పరిచయం అయిన వారంతా ఫామ్‌హౌస్‌లో ట్రాప్ హౌస్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో మైనర్లు కూడా అధిక సంఖ్యలోనే పాల్గొన్నారు. ఈ వేడుకలో డ్రగ్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.

ట్రాప్ హౌస్ పార్టీ

అక్రమ మాదకద్రవ్యాల సంబంధిత కార్యకలాపాలను అరికట్టేందుకు రాజేంద్రనగర్ స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) పోలీసులు మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటన చేసిన 'ట్రాప్ హౌస్ పార్టీ' కోసం ఓక్స్ ఫామ్‌హౌస్‌కి వచ్చిన 65 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌లో మాదకద్రవ్యాలతో పార్టీ జరుగుతుందనే అనుమానం ఆధారంగా పోలీసులు దాడి చేశారు. అక్కడికి చేరుకున్న అధికారులు, 22 మంది మైనర్లతో సహా 65 మంది వ్యక్తులు మద్యం సేవిస్తున్నట్లు గుర్తించారు. హాజరైన మొత్తం వారిలో 12 మంది బాలికలు ఉన్నారు, వారిలో ఐదుగురు మైనర్లు.

అదుపులోకి తీసుకున్న వ్యక్తులకు నిర్వహించిన రక్త పరీక్షల్లో ఇద్దరు గంజాయి తీసుకున్నారని నిర్ధారించారు. అందులో ఒకరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యక్తి ఇషాన్. మరొక వ్యక్తి మైనర్. ఇషాన్ 2024లో భారతదేశానికి వచ్చాడు. అతని తండ్రి ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నారు. ఫామ్‌హౌస్ ఆవరణ నుండి ఎస్ఓటీ అధికారులు 10 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ పార్టీని ట్రాప్ హౌస్. 9MM అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రచారం చేశారు. దీనిని హైదరాబాద్‌కు చెందిన ఒక డీజే నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. ఈ పార్టీ శనివారం సాయంత్రం 6 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు జరుగుతుందని, పాల్గొనేవారు మీ జీవితంలో ఎన్నడూ లేని ఆనందాన్ని ఆస్వాదిస్తారని ప్రకటన చేశారు.

ఎంట్రీ పాస్‌లను సింగిల్స్‌కు రూ. 1600, జంటలకు రూ. 2800 టిక్కెట్ ధరకు విక్రయించారు. దీనితో 65 మంది హాజరు అయ్యారు. దాడి తర్వాత వారందరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు మొయినాబాద్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు. మైనర్ల కుటుంబ సభ్యులకు సమచారం ఇచ్చారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.