Ramagundem Knife Attacks : రామగుండంలో కత్తిపోట్లు కలకలం-వారంలో రెండు ఘటనలు, ఒకరు మృతి
Ramagundem Knife Attacks : పెద్దపల్లి జిల్లా రామగుండంలో కత్తిపోట్లు కలకలం రేపుతున్నాయి. వారంలో రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. కత్తిపోట్లతో ఒకరు మృతి చెందగా...మరొకరు తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొంతున్నారు.
Ramagundem Knife Attacks : పారిశ్రామిక ప్రాంతమైన పెద్దపల్లి జిల్లా రామగుండంలో కత్తిపోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. వారంలో రెండు వేర్వేరు చోట్ల కత్తిపోట్లు జరగడం ఆందోళనకు గురి చేస్తోంది. కత్తి పొట్లకు గురై ఒకరు మృతిచెందగా, తాజాగా ఆర్ఎంపీ కత్తిపొట్లకు గురై ప్రాణాపాయ స్థితికి చేరారు. కత్తిపోట్లు పోలీస్ లకు సవాల్ గా మారాయి.
వారం రోజుల వ్యవధిలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెండు చోట్ల వేరువేరుగా కత్తిపోట్లు సంచలనంగా మారాయి. డిసెంబర్ 31న భార్యాభర్తల గొడవ విషయంలో పెద్దమనిషిగా వెళ్లిన దగ్గర బంధువు శ్రీనివాస్ పై శ్రావణ్ తల్వార్ తో నరికాడు. తీవ్ర గాయాల పాలైన శ్రీనివాస్ ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించగా వారం రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన మరిచిపోక ముందే రామ్ నగర్ లో ఆర్ఎంపీ యశ్వంత్ పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన యశ్వంత్ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఒంటరిగా ఉన్న ఆర్ఎంపీపై దాడి
రాంనగర్ లో ఆర్ఎంపీ యశ్వంత్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. యశ్వంత్ భార్య సింగరేణి ఏరియా ఆసుపత్రిలో నర్స్ గా పనిచేస్తుంది. మొదటి షిఫ్ట్ విధులకు హాజరై ఇంటికి వచ్చేసరికి భర్త యశ్వంత్ రక్తపు మడుగులో ఉండడంతో పక్కనే ఉన్న సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కత్తిపోట్లకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యశ్వంత్ ఇంట్లోని సీసీ కెమెరాలను పరిశీలించి సీసీ ఫుటేజ్ ఆధారంగా కత్తి పొట్ల మిస్టరీని చేధించే పనిలో నిమగ్నమయ్యారు. తెలిసినవారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.
అనుమానంతో వారం క్రితం
గోదావరిఖని వినోభానగర్ కు చెందిన నంది శ్రీనివాస్ ను మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రానికి చెందిన గొల్ల శ్రావణ్ డిసెంబర్ 31న తల్వార్ దాడి చేశాడు. విచక్షణ రహితంగా నరకడంతో రక్తపు మడుగులో శ్రీనివాస్ స్పృహ తప్పి పడిపోయాడు. చనిపోయాడనుకుని శ్రావణ్ తన భార్యకు ఫోన్ చేసి మీ మేనమామను చంపేశానని చెప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. తీవ్రగాయాలపాలైన నంది శ్రీనివాస్ ను స్థానికులు పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ వారం రోజులకు ప్రాణాలు కోల్పోయారు.
అదే కారణం...
శ్రీనివాస్ మేనకోడలు కాళ్ల పూజను ఆరేళ్ళ క్రితం భీమారానికి చెందిన గొల్ల శ్రావణ్ ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రావణ్ కు ఇతర మహిళతో వివాహేతర సంబంధం ఉందనే కారణంతో భార్యాభర్తల మధ్య ఏడాది కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో పూజ మేనమామ జోక్యం చేసుకుని ఎందుకు కొడుతున్నావని భీమారం వెళ్లి అతడి తల్లిదండ్రులతో మాట్లాడి పద్దతి మార్చుకోవాలని చెప్పి వచ్చాడు. తన ప్రవర్తన మార్చుకోకుండా శ్రావణ్ భార్య పూజను కొట్టడంతో నంది శ్రీనివాస్, నంది నగేశ్, కాళ్ల కిరణ్ భీమారం వెళ్లి పూజను ఇంటికి తీసుకువచ్చారు.
దీంతో పగ పెంచుకున్న శ్రావణ్ గోదావరిఖనికి చేరుకుని ఎలక్ట్రికల్ షాపులో పనిచేస్తున్న నంది శ్రీనివాస్ ను మాట్లాడే పని ఉందని బైక్ పై ఎక్కించుకుని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ కు తీసుకువచ్చాడు. పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న తల్వార్ తో నంది శ్రీనివాస్ పై విచక్షణ రహితంగా దాడిచేసి పారిపోతుండగా సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు పట్టుకుని అరెస్ట్ చేశారు. తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి భార్యపై తప్పుడు ఆరోపణలు చేసి, అనుమానిస్తూ ఈ అఘాయిత్యానికి దిగినట్లు ఏసీపీ రమేష్ వెల్లడించారు. రెండు ఘటనలు కుటుంబ కలహాలు, వ్యక్తిగత కక్షలతోనే జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కోరుతున్నారు.
రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.