Peddapalli ACB Trap: పెద్దపల్లిలో ఏసీబీకి చిక్కిన రామగుండం ఎస్టీవో మహేశ్వర్, సబార్డినేట్ పవన్...
Peddapalli ACB Trap: పెద్దపల్లి జిల్లాలో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. రిటైర్డ్ టీచర్ నుంచి పది వేలు లంచంగా తీసుకుంటుండగా రామగుండం STO ఏకుల మహేశ్వర్, ఆఫీస్ సబార్డినేట్ రెడ్డవేణీ పవన్ ను ఏసిబి అధికారులు పట్టుకుని అరెస్టు చేశారు.
Peddapalli ACB Trap: పెన్షన్ మంజూరు కోసం రిటైర్డ్ టీచర్ కన్నూరి ఆనందరావు రామగుండం STO ఏకుల మహేశ్వర్ ను సంప్రదించారు. ఎస్టీవో తనను ఖుషీ చేయాలని అందుకు 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని రిటైర్డ్ టీచర్ ప్రాధేయపడ్డప్పటికీ వినకపోవడంతో ఏసిబిని ఆశ్రయించారు. ఎస్టీవో నేరుగా లంచం డబ్బులు తీసుకోకుండా సభార్డినేట్ పవన్ ద్వారా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పదివేలు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.

వారం రోజుల క్రితం సబ్ రిజిస్ట్రార్...
వారం రోజుల క్రితం ఐదు వేలు లంచం తీసుకుంటు జగిత్యాల జిల్లా మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ అసిఫోద్దీన్ ఏసిబి కి చిక్కారు. సబ్ రిజిస్ట్రార్ తో పాటు ఔట్ సోర్సింగ్ అటెండర్ బాణోతు రవి కుమార్, డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ ఆర్మూర్ రవి పట్టుబడ్డారు. ఆ ఘటన మరిచిపోక ముందే తాజాగా రామగుండం ఎస్టీవో మహేశ్వర్ ఆఫీస్ సభార్డినేట్ పవన్ ఏసీబీకి చిక్కడం కలకలం సృష్టిస్తుంది.
దూకుడు పెంచిన ఏసీబీ...
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏసిబి అధికారులు దూకుడు పెంచి లంచం ముట్టందే పని చేయని అవినీతి అధికారుల ఉద్యోగుల భరతం పడుతున్నారు. గత నెల డిసెంబర్ 16న మెట్ పల్లి డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అఫీసుద్దీన్ 4500 లంచంగా తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అ ఘటన మరిచి పోకముందే డిసెంబర్ 28న శంకరపట్నం డిప్యూటీ తహశీల్దార్ మల్లేశం రైతు నుంచి ఆరు వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ పట్టుబడ్డాడు.
నవంబర్ 19న అంతర్గాం తహశిల్దార్ ఉయ్యాల రమేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్ 12 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కారు. ఆగష్టు 3న కాల్వశ్రీరాంపూర్ తహశిల్దార్ జహేద్ పాషా, విఆర్ఏ కుమారుడు విష్ణు, డ్రైవర్ అంజద్ పది వేలు లంచంగా తీసుకుంటూ పట్టుబడ్డారు. జూలై 4న కరీంనగర్ లో డిసిఎంఎస్ మేనేజర్ రేగులపాటి వెంకటేశ్వరరావు లక్షా రూపాయలు లంచంగా స్వీకరిస్తుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. నెలకు ఒకరు ఇద్దరు ఏసీబీకి చిక్కుతుండడంతో వారి పాపం పండిందని ప్రజలు భావిస్తున్నారు. లంచగొండి అవినీతి అధికారులపై కఠినంగా వ్యవహరించాలని జనం కోరుతున్నారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)