Ramagiri Khilla: రా..రమ్మని పిలుస్తున్న రామగిరి ఖిల్లా, రాముడు నడియాడిన నేలలో సందర్శకులతో సందడి
Ramagiri Khilla: పెద్దపల్లి జిల్లాలో పూర్వం రాముడు నడియాడిన నేల...మూడు దశాబ్దాల క్రితం వరకు నక్సల్స్ కు ఆవాసంగా ఉన్న ప్రాంతం... ఇప్పుడు పర్యాటకులను ఆకర్షిస్తుంది. రా.. రమ్మని పిలుస్తుంది రామగిరిఖిల్లా. ఎతైన కొండలు, విశాలమైన పచ్చికబయళ్లతో రామగిరి ఖిల్లా సందర్శకుల సందడికి స్వాగతం పలుకుతుంది.
Ramagiri Khilla: తెలంగాణలో అత్యంత పొడవైన విశాలమైన ఖిల్లా రామగిరి... రాముడు నడయాడిన రమ్యమైన నేల.. అలనాటి చారిత్రక కట్టడాలకు నిదర్శనమే రామగిరిఖిల్లా. ఆయుర్వేద వనమూలికలకు భాండాగారం... విభిన్న జాతుల వృక్షాలకు నిలయం... రామగిరి ఖిల్లా. ఆదిమ మానవులకు ఆవాసమైన తావు, ప్రకృతి ప్రేమికులకు సుగంధపు పరిమాళాలు వెదజల్లే రామగిరిఖిల్లా..
శాతవాహనుల నుంచి అసఫ్ జాహీల వరకు పాలన కేంద్రమైన కీర్తికిరీటం రామగిరి ఖిల్లా. అనేకమైన జలపాతాలకు జన్మనిచ్చిన జనని. ప్రకృతి ఒడిలో సేదతీరుతూ ప్రపంచాన్ని సైతం మైమరపించే అధ్బుతమైన పర్యాటక క్షేత్రం, రామగిరి ఖిల్లా యాత్ర చేయాలంటే సాహసంతో సావాసం చేయాల్సిందే... ఈ రామగిరి ఖిల్లాను సందర్శించడానికి తెలంగాణాలోని వివిధ జిల్లాలతో ఇతర రాష్ట్రాల వారు వస్తారు.
ఎక్కడ ఉంది... ఎలా వెళ్ళాలి?
చారిత్రక నేపథ్యం ఉన్న రామగిరి ఖిల్లా పెద్దపల్లి జిల్లాలో ఉంది. పెద్దపల్లి నుంచి మంథనికి వెళ్ళే దారిలో రైట్ సైడ్ లో రామగిరి మండలం బేగంపేట్, రత్నాపూర్ గ్రామాల మధ్య ఎతైనా విశాలమైన కొండలు కనిపిస్తాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి మంథని వేళ్ళే ప్రధాన రహదారిలో బేగంపేట్ ఎక్స్ రోడ్ వద్ద దిగి ఆటోల ద్వారా బేగంపేట్ గ్రామంలోపలికి వెళ్ళి సుమారు 3 కిలో మీటర్లు కాలినడకతో ఖిల్లాకు చేరుకోవచ్చు.
ప్రతి సంవత్సరం ఆగష్టు సెప్టెంబర్ మాసాలలో ముఖ్యంగా శ్రావణ మాసంలో రామగిరిఖిల్లాను సందర్శించడానికి వీలుంటుంది. ఉదయం 8 గంటలకు వెళ్ళితే ఖిల్లాపై ఉన్న వాటిని అన్ని చూసేసరికి సాయంత్రం అవుతుంది. అందుకే ఉదయం 8 గంటల వరకు బేగంపేట గ్రామానికి చేరుకుంటే సాయంత్రం 5 గంటల వరకు రిటర్న్ కావచ్చు. ఖిల్లాపై సుమారు 15-20 కిలోమీటర్లు నడవాలి.
ఖిల్లాపై చూడదగ్గ ప్రదేశాలు…
రామగిరి ఖిల్లాపై ఏడు కోట ప్రవేశ దర్వాజాలు ఉన్నాయి. మొదటి దర్వాజకి కుడివైపు వెళ్ళితే సముద్ర జలపాతం, రెండవ దర్వాజ ప్రవేశంలో కుడివైపు గోడపైన క్రీ.శ 1556 నాటి పది పంక్తులలో గల తెలుగు శాసనం (శాసనం వివారాలు: తుమ్మిఖాన్ అనే వ్యక్తి రెండవ దర్వాజ నిర్మాణానికి 10 వేల రుపాయాల ఖర్చు అయినట్టు అట్టి ఖర్చును పన్నురూపంలో స్థానిక ప్రజలు చెల్లించవలెనని ఉంది.
దర్వాజ లోపలకు ప్రవేశించిన తర్వాత ఎడమవైపు గల అధ్బుతమైన పచ్చని కోట 25 మీటర్ల పొడవు గల అతి పెద్ద ఫిరంగి, నాల్గవ దర్వాజ పై గల సృష్టి శిల్పాలతోపాటు, ఏనుగు తో పోరాడుతున్న యోధుడి శిల్పం, రెండు తలల గరుత్మంతుడి శిల్పం, పిల్లల ఫిరంగీ, సుమారు 15 మీటర్ల పొడవు గల ఫిరంగీని స్థానికులు పిల్లల ఫిరంగీ గా పిలుస్తారు.
ఇందులో నుంచి దూరితే సంతానంలేని వారికి పిల్లలు పుడుతారని, ఆయురారోగ్యాలతో జీవిస్తారని ప్రజల నమ్మకం. ఆరవ దర్వాజ నుంచి 21 మెట్లు ఎక్కి కోటపైనుంచి కనిపించే మానేరువాగు వయ్యారాలతోపాటు ఖిల్లాపై గల వివిధ చారిత్రక స్థలాలైన సీతమ్మ స్నానమాడిన కొలను, పసరుబావులు, పసుపు కంకుమ భరణీ, సవతుల బావులు, మాధవీ మండపం, రాముడు ప్రతిష్టించిన రామలింగాలు, హనుమంతుడి విగ్రహం, చరశాలలు, గజశాలలు, అశ్వశాలలు, నీటి సౌకర్యాన్ని రాజమందిరానికి తరలించిన రాతినీటిగొట్టాలు ఉన్నాయి. చివరగా సీతారాముల దేవస్థానం ఉంది.
పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి…
తెలంగాణలో అత్యంత పొడవైన, విశాలమైన చారిత్రక ప్రాధాన్యం గల రామగిరి ఖిల్లా ను పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందంటున్నారు స్థానికులు. ఖిల్లా వరకు రవాణా సౌకర్యాన్ని కల్పించి యాత్ర మార్గ నిర్దేశక సూచికలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పెద్దపల్లి, గోదావరిఖని, కరీంనగర్ ప్రధాన కేంద్రాల్లో ఖిల్లా ప్రాధాన్యతను తెలిపేలా పర్యాటక శాఖ వారు ప్రచార బోర్డులను పెట్టాలంటున్నారు. అత్యాధునిక సౌకర్యమైన రోప్ వే ను ఖిల్లా దిగువ భాగం నుంచి పైకి నిర్మాణం చేస్తే నిత్యం పర్యాటకులతో కనువిందు చేస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఖిల్లా అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష…
రామగిరి ఖిల్లాను పర్యాటకంగా కేంద్రంగా అభివృద్ధి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రామగిరిఖిల్లా చరిత్ర, ప్రాముఖ్యత తదితర అంశాలపై కలెక్టర్ శ్రీహర్ష ఆరా తీసి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ తో కలిసి కలెక్టర్ రామగిరి ఖిల్లా అభివృద్ధిపై అటవీశాఖ, పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
టూరిజం స్పాట్ గా రామగిరి ఖిల్లా అభివృద్ధి చేయడానికి వీలుగా బేగంపేట నుంచి రోడ్డు ఏర్పాటు చేయాలని అందుకు తగిన ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రామగిరిఖిల్లాను అభివృద్ధి చేయడం ద్వారా జిల్లాలో మంచి పర్యాటక ప్రాంతం ఏర్పాటు అవుతుందన్నారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)