'ఇందిరా సౌర గిరి జల వికాసం' పథకం ప్రారంభం భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దున్నేవాడిదే భూమి నినాదాన్ని ఇందిరా సౌర గిరి జల వికాసం వంటి పథకాల ద్వారా చట్టాలుగా అమలు చేస్తున్నామని అన్నారు.
అచ్చంపేట నియోజకవర్గంలో 'ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం' ప్రారంభ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. తెలంగాణ గడ్డపై ఉన్న నినాదాలు చట్టాలుగా మారాలంటే మరో 20 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండాలని అన్నారు. నల్లమల డిక్లరేషన్ అమలుచేసి గిరిజనులకు ఫలితాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో గిరిజనులు పంట పండించుకుంచే మహిళలని చూడకుండా చెట్టుకు కట్టేసి కొట్టారని, ఎంతో మందిపై పోలీసు కేసులు పెట్టారని భట్టి విక్రమార్క ఆరోపించారు.
"దేశంలోనే గొప్ప కార్యక్రమం “ఇందిర సౌర గిరి జల వికాసం పథకం”. జల్, జంగల్, జమీన్, భూమి కోసం, భుక్తి కోసం పోరాటం వంటి నినాదాలను చట్టంగా మారుస్తున్న ఈ ప్రభుత్వంలో భాగం అవ్వడం వల్ల నా జన్మ ధన్యమైంది. వజ్రం లాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వజ్రాల లాంటి మంత్రుల హృదయ అంతరాల్లోంచి ఈ పథకం ఉద్భవించింది" - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
అభివృద్ధి ఫలితాలు ప్రజలకు అందకుండా, ప్రభుత్వంపై నిత్యం కుట్రలు చేస్తున్నారని భట్టి ఆరోపించారు. ప్రభుత్వంపై ఒక మాట అన్న, కుట్ర చేసిన అది రాష్ట్ర ప్రజలపై కుట్రగానే భావిస్తామన్నారు.
జూన్ 2న గిరిజన యువతకు 'రాజీవ్ యువ వికాసం' స్వయం ఉపాధి పథకం ద్వారా రూ.1000 కోట్లు మంజూరు చేస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు.
ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొత్తం కేబినెట్... నల్లమల్ల సాక్షిగా మాట ఇస్తున్నామన్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా ఉమ్మడి కుటుంబాన్ని, సమాజాన్ని నిర్మించబోతున్నామని చెప్పారు.