ఆ రూల్ ఉన్నట్టా..? లేనట్టా...? అయోమయంలో 'రాజీవ్ యువ వికాసం' దరఖాస్తుదారులు...!-rajiv yuva vikasam scheme applicants are confused over cibil score requirement ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఆ రూల్ ఉన్నట్టా..? లేనట్టా...? అయోమయంలో 'రాజీవ్ యువ వికాసం' దరఖాస్తుదారులు...!

ఆ రూల్ ఉన్నట్టా..? లేనట్టా...? అయోమయంలో 'రాజీవ్ యువ వికాసం' దరఖాస్తుదారులు...!

రాజీవ్ యువ వికాసం స్కీమ్ దరఖాస్తుదారులకు 'సిబిల్ స్కోర్ టెన్షన్ పట్టుకుంది. దీని ఆధారంగానే బ్యాంకర్లు రుణాలు మంజూరు చేస్తే… తమ పరిస్థితేంటన్న భావనలో చాలా మంది ఉన్నారు. మరోవైపు సిబిల్ స్కోర్ ఆధారంగా ఎంపిక ఉండదని డిప్యూటీ సీఎం భట్టి ప్రకటన చేసినప్పటికీ… దరఖాస్తుదారుల్లో అనుమానాలు తొలగిపోవటం లేదు.

రాజీవ్ యువ వికాసం స్కీమ్

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు రాయితీలపై రుణ సదుపాయం అందించేందుకు ప్రభుత్వం… రాజీవ్ యువ వికాసం స్కీమ్ అమలు చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకానికి అన్ని జిల్లాల నుంచి భారీగా అప్లికేషన్లు అందాయి. ఏకంగా 15 లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. అర్హతలకు తగ్గటుగా… అందుబాటులో ఉన్న యూనిట్లకు దరఖాస్తు చేసుకున్నారు.

మరోవైపు రాజీవ్ యువ వికాసం స్కీమ్ అర్హుల ఎంపిక ప్రక్రియపై తెలంగాణ సర్కార్ కసరత్తు కొనసాగుతోంది. ప్రస్తుతం మండల స్థాయిలో వెరిఫికేషన్ జరుగుతుండగా… ఆపై జిల్లా కమిటీలకు సిఫార్సు చేస్తున్నారు. ఆ తర్వాత అర్హుల జాబితాలను వెల్లడిస్తారు.

ఇదిలా ఉంటే అర్హుల ఎంపికలో బ్యాంకర్లు సిబిల్ స్కోర్ ను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. సిబిల్‌ స్కోర్ బాగుంటేనే స్కీమ్ కు అర్హత లభించే అవకాశం ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలతో చాలా మంది దరఖాస్తుదారులు ఆందోళనకు గురయ్యారు.

సిబిల్ స్కోర్ నిబంధన వార్తల నేపథ్యంలో ఇటీవలనే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక సిబిల్ స్కోర్ ఆధారంగా జరుగుతుందని చేస్తున్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు. ఇలాంటి వార్తలను నమ్మవద్దని కోరారు. జూన్ 2వ తేదీ నుంచి నియోజకవర్గాల వారీగా శాంక్షన్ లెటర్ల పంపిణీ జరుగుతుందన్నారు.

ఆగని ప్రచారం…!

ఉముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటన చేసినప్పటికీ సిబిల్ స్కోర్ నిబంధన అంశంపై ప్రచారం ఆగటం లేదు. సిబిల్ స్కోర్ 700 పైగా ఉండాలని… అలాంటి వారికే ప్రాధాన్యత ఉంటుందనే వార్తలు తెరపైకి రావడంతో నిరాశకు లోనవుతున్నారు.

దరఖాస్తుదారుల బ్యాంక్ లావాదేవీల పరిశీలనతో పాటు పాన్ కార్డు ద్వారా వివరాలను సేకరిస్తున్నారు. గతంలో ఏమైనా రుణాలు తీసుకున్నారా..? తీసుకుంటే ఏ విధంగా రుణాల చెల్లింపు ప్రక్రియ జరిగింది..? వంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంకర్లు వైపు నుంచి పకడ్బందీగా ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతుండగా… సిబిల్ స్కోర్ ను కూడా ప్రమాణికంగా తీసుకుంటున్నారా..? అనే చర్చ జోరుగా జరుగుతోంది.

సిబిల్ స్కోర్ అనేది ప్రతి ఒక్కరికి ఉండకపోవచ్చు. దీంతో చాలా మంది దరఖాస్తులు అయోమయానికి గరువుతున్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటన చేసినప్పటికీ… ఈ ప్రచారం మాత్రం ఆగటం లేదు. మరోవైపు లబ్ధిదారుల జాబితాల వెల్లడికి సమయం దగ్గరపడుతోంది. జూన్ 2న మంజూరు పత్రాలను అందజేస్తారు. సమయం దగ్గరపడుతున్న వేళ…. సిబిల్ స్కోర్ విషయంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని పలువురు దరఖాస్తుదారులు కోరుతున్నారు…!

సిబిల్ స్కోర్ వార్తలు ప్రచారమవుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన ఉంటుందా..? దరఖాస్తుదారుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటుందా..? అనేది ఉత్కంఠగా మారింది…!

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం